Stocks to watch today, 7 September 2022: ఇవాళ ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 202.5 పాయింట్లు లేదా 1.15 శాతం రెడ్‌‌లో 17,472.50 వద్ద ట్రేడవుతోంది. మన మార్కెట్‌ ఇవాళ గ్యాప్‌ డౌన్‌లో ప్రారంభమవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 


నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


ఎరువుల సెక్టార్‌: ఈ రంగంలోని ప్రభుత్వ రంగ సంస్థలను (PSU‌) ప్రైవేటీకరించే అంశంపై సంకేతాలు రావచ్చు. PSE పాలసీ ప్రకారం... PSUలను ప్రైవేటీకరించడం లేదా మూసివేయడం ద్వారా ఎరువులు, ఉక్కు, పర్యాటకం వంటి వ్యూహేతర రంగాల నుంచి నిష్క్రమించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది.


డ్రీమ్‌ఫోక్స్‌ సర్వీసెస్‌: ఎయిర్‌పోర్ట్ లాంజ్ సేవలను అందించే డ్రీమ్‌ఫోక్స్ సర్వీసెస్ షేర్లు మంగళవారం స్టాక్ మార్కెట్ అరంగేట్రంలో అదరగొట్టాయి. ఐపీవో రేటు (రూ.326‌) కంటే 42 శాతం లాభంతో ముగిశాయి. నిన్న ఈ స్టాక్‌ 69 శాతం పెరిగినా, చివర్లో లాభాల స్వీకరణతో రూ.462.7 వద్ద ముగిసింది. ఈ ముగింపు ధర వద్ద, డ్రీమ్‌ఫోక్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,417 కోట్లుగా ఉంది.


అదానీ గ్రూప్: రుణ భారం మీద మార్కెట్‌లో ఉన్న ఆందోళనలను తగ్గించేందుకు గౌతమ్ అదానీ గ్రూప్‌ ప్రయత్నాలు చేస్తోంది. ఓవర్‌ లీవరేజ్‌పై ఉన్న భయాలను తగ్గించడానికి PSU బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల్లో సగానికి పైగా తగ్గించినట్లు ప్రకటించింది. గ్రూప్‌లోని కంపెనీలను స్థిరంగా డి-లీవర్‌ చేశామని, 'నెట్‌ డెట్‌/ఎబిటా' రేషియో గత తొమ్మిదేళ్లలో 7.6 రెట్ల నుంచి 3.2 రెట్లు తగ్గిందని పేర్కొంది.


పిడిలైట్‌ ఇండస్ట్రీస్: గత మూడు నెలల్లో 'బీఎస్‌ఈ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ ఇండెక్స్‌' సాధించిన 13 శాతం లాభాలతో పోలిస్తే, ఈ స్టాక్‌ ఇదే కాలంలో 30 శాతం లాభపడింది. కన్జ్యూమర్‌ బాస్కెట్‌లో మేజర్‌ ఔట్ పెర్ఫార్మర్‌గా నిలిచింది.


సుజ్లాన్ ఎనర్జీ: రెన్యువబుల్ ఎనర్జీ సొల్యూషన్ ప్రొవైడర్ సెంబ్‌కార్ప్‌కు చెందిన గ్రీన్ ఇన్‌ఫ్రా విండ్ ఎనర్జీ నుంచి, 180.6 మెగావాట్ల విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయడానికి ఒక ఆర్డర్‌ గెలుచుకుంది. ఈ ప్రాజెక్ట్ 2024లో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు.


ఇంటర్‌గ్లోబుల్ ఏవియేషన్ (ఇండిగో): కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) పీటర్ ఎల్బర్స్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. కేఎల్‌ఎం రాయల్ డచ్ ఎయిర్‌లైన్స్‌లో మూడు దశాబ్దాల అనుభవం ఉన్న ఎల్బర్స్, రోనోజోయ్ దత్తా స్థానంలో ఈ టాప్ పోస్ట్‌లోకి వచ్చారు. ఈ సందర్భంగా సిబ్బందికి రాసిన నోట్‌లో, రాబోయే సంవత్సరాలు మీ వృత్తిగత జీవితంలో అత్యంత ఉత్తేజకరంగా ఉంటాయని పేర్కొన్నారు.


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్: దేశంలోని అతి పెద్ద ప్రైవేట్ రంగ రుణదాత అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మంగళవారం రూ.3,000 కోట్ల విలువైన అడిషనల్‌ టైర్-1 (AT-1) బాండ్లను 7.84 శాతం కటాఫ్‌ రేటుతో విక్రయించింది, FY23లో  ఇప్పటివరకు ఏ బ్యాంక్ కూడా ఇంత తక్కువ రేటుకు బాండ్లను అమ్మలేదు.  AT-1 బాండ్లను జారీ చేయడం ద్వారా, డెట్ క్యాపిటల్ మార్కెట్‌ తలుపును ఒక ప్రైవేట్ బ్యాంక్ తట్టడం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇదే మొదటిసారి.


కెనరా బ్యాంక్: ఈ ప్రభుత్వ రంగ బ్యాంకు, బెంచ్‌మార్క్ రేటు MCLRని 0.15 శాతం వరకు పెంచింది. దీంతో, ఇచ్చే రుణాల మీద బ్యాంక్‌ వసూలు చేసే వడ్డీ పెరిగి, ఆదాయం కూడా పెరుగుతుంది. ప్రస్తుత పెంపు తర్వాత, బెంచ్‌మార్క్ రేటు మునుపటి 7.65 శాతం నుంచి 7.75 శాతానికి పెరిగింది.


ఇవాళ F&O నిషేధంలో ఉన్న స్టాక్స్‌: డెల్టా కార్ప్


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.