Personal Loan: కవల కంపెనీలు హెచ్‌డీఎఫ్‌సీ (HDFC), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank) ఒకప్పుడు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల డార్లింగ్స్. తర్వాత, వాటి పరిస్థితి దిగజారి గుదిబండల్లా తయారయ్యాయి. ఈ రెండింటి విలీనం ప్రకటన తర్వాత, పడుతూ, పైకి లేస్తూ ప్రయాణం కొనసాగిస్తున్నాయి.
ఇవాళ్టి (బుధవారం) ట్రేడింగ్‌లో మధ్యాహ్నం 12.30 గంటల సమయానికి ఫ్లాట్‌గా, రూ.1,487.70 దగ్గర హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేరు ధర ట్రేడవుతోంది. గత నెల రోజుల్లో కేవలం 2 శాతం వరకు మాత్రమే ఇది పెరిగింది. గత ఆరు నెలల కాలంలో 12 శాతం లాభపడినా, ఈ ఏడాదిలో ఇప్పటివరకు చూసుకుంటే (YTD), 2 శాతం పైగా నష్టపోయింది.
గత వైభవాన్ని తిరిగి తెచ్చుకోవడానికి తంటాలు పడుతున్న ఈ ప్రైవేటు రంగ రుణదాత, ఇప్పటివరకు తాను అడుగు పెట్టని ఏరియాలోకి ప్రవేశిస్తోంది. అదే.. ఈ బ్యాంక్‌లో ఖాతా లేనివారికి కూడా 10 సెకన్లలో అసురక్షిత వ్యక్తిగత రుణాలు (అన్‌సెక్యూర్డ్ పర్సనల్ లోన్స్) ఇవ్వడం.
క్రెడిట్ స్కోరు లేకున్నా పర్సనల్ లోన్
క్రెడిట్ హిస్టరీ లేదా సిబిల్ స్కోర్ సరిపడా లేకున్నా, అసలు క్రెడిట్ స్కోరు లేకున్నా సరే పర్సనల్ లోన్లు ఇస్తుందట ఈ బ్యాంక్. బ్యాకింగ్ రంగంలో పెరుగుతున్న పోటీని తట్టుకోవడానికి, మెరుగుపడిన డేటా లభ్యతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది. క్రెడిట్‌వర్థీ కాకున్నా, స్వయం ఉపాధి (సెల్ఫ్ ఎంప్లాయ్‌డ్) పొందేవారికి బ్యాంక్ ఈ ఆఫర్ ఇస్తోంది. మొత్తం మార్కెట్‌లో కేవలం 5 శాతంగా ఉన్న సెల్ఫ్ ఎంప్లాయ్‌డ్ కస్టమర్లకు రుణాల లభ్యతను బాగా పెంచాలని బ్యాంక్ చూస్తోంది.
10 సెకన్ల లోన్ ఇప్పుడు తీసుకోవచ్చా?
తమ బ్యాంక్‌లో ఖాతాలు ఉన్నవారికి ఇప్పటికే 10 సెకన్లలో లోన్లను అందిస్తున్నామని, గత ఆరు సంవత్సరాలుగా దీనిని విజయవంతంగా చేస్తున్నామని చెప్పిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్; ఈ ఏడాది చివరి నాటికి దీనిని మొత్తం మార్కెట్‌కు పరిచయం చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించింది.
ఈ బ్యాంక్‌కు, ప్రస్తుతం 12 మిలియన్ల మంది ప్రి-అప్రూవ్డ్ లోన్ కస్టమర్లు ఉన్నారు. అన్ సెక్యూర్డ్ లోన్లు అందించడానికి దేశంలోని 650 జిల్లాల్లో ఇది ఏర్పాట్లు చేసింది.
ఈ ఏడాది జూన్ చివరి నాటికి, బ్యాంక్ ఇచ్చిన మొత్తం రిటైల్ లోన్లలో, ₹1.48 లక్షల కోట్లతో వ్యక్తిగత రుణాలది అత్యధిక వాటా. ఇందులోనూ, 10 సెకన్ల రుణాలదే లార్జెస్ట్ షేర్.
మాతృ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీతో విలీనంపై బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి షరతులతో కూడిన ఆమోదం పొందడంతో, మార్టిగేజ్ బుక్ వాల్యూని పెంచుకోవడానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 2023 సెప్టెంబర్ నాటికి ఈ కవల కంపెనీల విలీనం పూర్తవుతుందని భావిస్తున్నారు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.