GST collection in April: 


వస్తు సేవల పన్ను వసూళ్లలో (GST Collections) భారత్‌ రికార్డులు సృష్టిస్తోంది. తొలిసారి అత్యధిక జీఎస్‌టీ కలెక్షన్లతో చరిత్రను తిరగరాసింది. 2023, ఏప్రిల్‌ నెలలో రూ.1.87 లక్షల కోట్లను రాబట్టింది.


'2023 ఏప్రిల్‌లో స్థూల జీఎస్‌టీ వసూళ్లు జీవిత కాల గరిష్ఠాన్ని తాకాయి. 2022, ఏప్రిల్‌లో వసూలు చేసిన రూ.1,67,540 కోట్లతో పోలిస్తే రూ.19,485 కోట్లు ఎక్కువ ఆదాయం వచ్చింది' అని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మార్చి నెలలో జీఎస్‌టీ వసూళ్లు రూ.1.6 లక్షల కోట్లన్న సంగతి తెలిసిందే.


ఏప్రిల్‌లో వసూలు చేసిన రూ.1,87,035 కోట్లలో కేంద్ర జీఎస్‌టీ వాటా రూ.38,440 కోట్లు. రాష్ట్రాల జీఎస్‌టీ రూ.47,412 కోట్లు. ఐజీఎస్‌టీ కింద రూ.89,158 కోట్లు వసూలు అయ్యాయి. ఇందులో దిగుమతి చేసుకున్న వస్తువులపై రూ.34,972 కోట్లు వచ్చాయి. సెస్‌ రూపంలో రూ.12,025 కోట్లు రాగా అందులో దిగుమతి వస్తువలపై రూ.901 కోట్లు వచ్చాయి.




'గతేడాది ఇదే నెలలోని జీఎస్‌టీ ఆదాయంతో పోలిస్తే 2023, ఏప్రిల్‌లో 12 శాతం ఎక్కువ రాబడి వచ్చింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే స్థానిక లావాదేవీల ద్వారా వచ్చిన ఆదాయం 16 శాతం ఎక్కువగా ఉంది' అని ఫైనాన్స్‌ మినిస్ట్రీ వెల్లడించింది.


దేశ చరిత్రలో జీఎస్‌టీ వసూళ్లు రూ.1.75 లక్షల కోట్ల మైలురాయిని దాటేశాయి. ఇక మార్చిలో 9 కోట్ల ఈ-వే బిల్లులు జనరేట్‌ అయ్యాయి. ఫిబ్రవరిలో నమోదైన 8.1 కోట్ల బిల్లులతో పోలిస్తే 11 శాతం అధికంగా జనరేట్‌ అయ్యాయి. 


మూడు నెలలుగా జీఎస్‌టీ వసూళ్లు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2023 ఫిబ్రవరిలో రూ.1.49 లక్షల కోట్లు, మార్చిలో రూ.1.60 లక్షల కోట్లు, ఏప్రిల్‌లో 1.80 లక్షల కోట్ల రాబడి వచ్చింది. ఇక 2024 ఆర్థిక ఏడాదిలో జీఎస్‌టీ రాబడిలో తమ వాటా 9.56 లక్షల కోట్లుగా ఉంటుందని కేంద్రం అంచనా వేసింది. 2023 ఆర్థిక ఏడాదితో పోలిస్తే ఇది 12 శాతం పెరుగుదల.




Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.