SBI Amrit Kalash Scheme: దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తన ఖాతాదార్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త పథకాలు, మంచి వడ్డీ రేట్లను అమలు చేస్తూనే ఉంటుంది. కొత్త ఖాతాదార్లను ఆకట్టుకోవడానికి నూతన పథకాలను తీసుకురావడంతో పాటు, ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలను ఆకర్షణీయంగా మెరుగుపరిచి మళ్లీ ప్రారంభిస్తుంది. ఈ కోవలో, తన వినియోగదార్ల కోసం పాత పథకాన్ని మళ్లీ విడుదల చేసింది స్టేట్‌ బ్యాంక్‌. ఆ పథకం పేరు అమృత్‌ కలశ్‌ (SBI Amrit Kalash Scheme).


ఇది ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ (special fixed deposit scheme). ఏప్రిల్ 12 నుంచి అమృత్‌ కలశ్‌ పథకం పునఃప్రారంభం అయింది, జూన్ 30 వరకు కొనసాగుతుంది. ఇది పరిమిత కాల ఆఫర్‌. ఆకర్షణీయమైన వడ్డీ ఆదాయం కోసం చూస్తున్నట్లయితే, ఈ పథకంలో FD చేయవచ్చు. ఇంతకుముందు, ఈ పథకాన్ని ఫిబ్రవరి 15, 2023 నుంచి మార్చి 31, 2023 వరకు ఎస్‌బీఐ అమలు చేసింది.


అమృత్‌ కలశ్‌ ఫథకంపై వడ్డీ రేటు
SBI అమృత్‌ కలశ్‌ పథకం కాల వ్యవధి 400 రోజులు. ఈ డిపాజిట్‌ పథకంలో పెట్టుబడి పెట్టే సీనియర్‌ సిటిజన్లకు (60 సంవత్సరాలు లేదా ఆ వయస్సు దాటిన వాళ్లు) ఏటా 7.6 శాతం వడ్డీని స్టేట్‌ బ్యాంక్‌ చెల్లిస్తుంది. సాధారణ పౌరులకు (60 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వాళ్లు) ఏడాదికి 7.1 శాతం వడ్డీ రేటును బ్యాంక్‌ జమ చేస్తుంది. 


వడ్డీ రేటుపై ఒక ఉదాహరణను పరిశీలిస్తే... ఎస్‌బీఐ అమృత్‌ కలశ్‌లో ఒక సీనియర్‌ సిటిజన్‌ ఒక 5 లక్ష రూపాయలు డిపాజిట్‌ చేస్తే, 7.6 శాతం వడ్డీ రేటు ప్రకారం 400 రోజులకు రూ. 43,000 వడ్డీ వస్తుంది. రూ. 5 లక్షల డిపాజిట్‌కు 7.6 శాతం వడ్డీ రేటు ప్రకారం, ఒక సాధారణ పౌరుడికి లభించే వడ్డీ మొత్తం 40,085 రూపాయలు.


అమృత్‌ కలశ్‌ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
మీకు దగ్గరలో ఉన్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాఖకు మీరు స్వయంగా వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. అక్కడి వరకు వెళ్లేంత సమయం మీకు లేకపోతే ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, ఎస్‌బీఐ యోనో (SBI YONO) యాప్‌ ద్వారా కూడా ఈ స్కీం కోసం అప్లై చేసుకోవచ్చు.


ఈ స్కీమ్‌ను మెచ్యూరిటీ తేదీ కంటే ముందుగానే రద్దు చేసుకునే సదుపాయం ఉంది. దీంతో పాటు, ఈ డిపాజిట్‌ను మీద బ్యాంక్‌ లోన్‌ కూడా వస్తుంది.


అమృత్‌ కలశ్‌ పథకంపై మీరు తీసుకునే వడ్డీపై TDS కట్‌ అవుతుంది. ఇలా కట్‌ అయిన మొత్తాన్ని, మీరు ఆదాయ పన్ను పత్రాలు దాఖలు చేసే సమయంలో క్లెయిమ్‌ చేసుకోవచ్చు. 


ఎవరు ప్రయోజనం పొందుతారు?
రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాల్లో ఉండే దేశీయ రిటైల్ టర్మ్ డిపాజిట్లు, NRI రూపాయి టర్మ్ డిపాజిట్లు రెండింటికీ ఈ పథకం వర్తిస్తుంది. కొత్తగా డిపాజిట్‌ చేయడంతో పాటు, పాత డిపాజిట్‌ను కూడా రెన్యూవల్ చేసుకోవచ్చు. ఇందులో, టర్మ్ డిపాజిట్ & స్పెషల్‌ టర్మ్ డిపాజిట్ సౌకర్యం కూడా ఖాతాదార్లకు అందుబాటులో ఉంది.