Gratuity Ceiling To Be Increased: కేంద్ర బడ్జెట్ సందర్భంగా, 01 ఫిబ్రవరి 2025న, ప్రైవేట్ లేదా పబ్లిక్ సెక్టార్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది. ట్రేడ్ యూనియన్ల సూచనలను కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే, 5 సంవత్సరాలు నిరంతరాయంగా పని చేసి రిటైర్మెంట్ లేదా రాజీనామా చేసిన ఉద్యోగి మరింత ఎక్కువ గ్రాట్యుటీని పొందే ఛాన్స్ లభిస్తుంది. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman)తో జరిగిన ప్రి-బడ్జెట్ సమావేశంలో, సెంట్రల్ ట్రేడ్ యూనియన్‌లు (Central Trade Unions) గ్రాట్యుటీ గణన నిబంధనలను ప్రస్తావించాయి. పాత రూల్స్‌ను మార్చాలని, కార్మికులు & ఉద్యోగులు పదవీ విరమణ సమయంలో ఇంకా ఎక్కువ గ్రాట్యుటీని పొందేలా మార్పులు చేయాలని యూనియన్ లీడర్లు డిమాండ్ చేశారు.
గ్రాట్యుటీ లెక్కింపులో మార్పు కోసం..
ఫిబ్రవరి 1, 2025న సమర్పించే బడ్జెట్‌కు సంబంధించి, కేంద్ర కార్మిక సంఘాలు తమ డిమాండ్లను ఆర్థిక మంత్రికి సమర్పించాయి. గ్రాట్యుటీ లెక్కింపు నిబంధనలను (Gratuity Calculation Rules) ప్రభుత్వం సమీక్షించాలని డిమాండ్ చేశాయి. కార్మికులు, ఉద్యోగులు పదవీ విరమణ సమయంలో ఎక్కువ గ్రాట్యుటీ పొందేందుకు వీలుగా.. గ్రాట్యుటీ చెల్లింపుల గణనను (Gratuity Calculation Formula) 15 రోజుల జీతానికి బదులుగా ఒక నెల జీతానికి పెంచాలని ఆర్థిక మంత్రిని కోరాయి. అంతే కాదు, గ్రాట్యుటీ చెల్లింపు కోసం రూ. 20 లక్షల నిర్ణీత పరిమితిని (Gratuity Ceiling) తొలగించాలని కూడా కేంద్ర కార్మిక సంఘాలు నిర్మలమ్మను అభ్యర్థించాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం, గ్రాట్యుటీ చెల్లింపు గరిష్ట పరిమితి రూ. 20 లక్షలుగా ఉంది. ఈ మొత్తంపై ఆదాయ పన్ను (Income Tax On Gratuity) చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే, గ్యాట్యుటీ మొత్తం పూర్తిగా పన్ను రహితం.
గ్రాట్యుటీ అంటే ఏమిటి?
ఉద్యోగులు తమ యాజమాన్యానికి అందించిన సేవలకు ప్రతిఫలంగా పొందే మొత్తమే గ్రాట్యుటీ. ఇది జీతానికి అదనం. ఉద్యోగి పదవీ విరమణ లేదా 5 సంవత్సరాల వ్యవధి తర్వాత కంపెనీని విడిచిపెట్టినప్పుడు, ఆ సంస్థలో అతని దీర్ఘకాలిక సేవలకు కృతజ్ఞతగా గ్రాట్యుటీ ఇస్తారు. గ్రాట్యుటీ అనేది ఉద్యోగి స్థూల జీతంలో ఒక భాగమే అయినప్పటికీ దానిని నెలనెలా చెల్లించరు. ఉద్యోగి కంపెనీని విడిచిపెట్టినప్పుడు ఒకేసారి చెల్లిస్తారు.
గ్రాట్యుటీ ఎలా లెక్కిస్తారు?
గ్రాట్యుటీని ఉద్యోగి లేదా కార్మికుడి జీతం ఆధారంగా లెక్కిస్తారు. కంపెనీ పాలసీ ప్రకారం ప్రతి ఉద్యోగికి ఈ మొత్తం వేర్వేరుగా ఉంటుంది. గ్రాట్యుటీ పొందాలంటే, ఒక కంపెనీలో కనీసం 5 సంవత్సరాల పాటు నిరంతరాయంగా సేవలు అందించాలి. అయితే, ఉద్యోగి మరణం లేదా వైకల్యం విషయంలో ఈ నియమం వర్తించదు. 5 సంవత్సరాల కాలానికి గ్రాట్యుటీని లెక్కించడానికి, సంవత్సరంలో 240 రోజులు పని దినాలుగా లెక్కలోకి తీసుకుంటారు.
గ్రాట్యుటీ లెక్కింపు సూత్రం (Gratuity Calculation Formula In India):
(15 x గత నెల జీతం x మొత్తం సర్వీస్ సంవత్సరాల సంఖ్య) / 26
గత నెల జీతంలో బేసిక్ శాలరీతో పాటు డీఏ కూడా కలిసి ఉంటుంది. 26 అంటే, నెలలో నాలుగు ఆదివారాలు మినహాయించగా వచ్చిన రోజుల సంఖ్య
గ్రాట్యుటీ ఎప్పుడు ఇస్తారు?
సర్వీస్ నుంచి ఉద్యోగి పదవీ విరమణ చేసినప్పుడు
పదవీ విరమణకు అర్హత ఉన్నప్పుడు
5 సంవత్సరాల పాటు ఒకే కంపెనీకి నిరంతరం సేవలు అందించిన తర్వాత రాజీనామా చేస్తే
ఉద్యోగి మరణం లేదా అనారోగ్యం లేదా ప్రమాదం కారణంగా దివ్యాంగుడు అయితే
మరో ఆసక్తికర కథనం: 15 మినిట్స్ గేమ్‌లోకి స్విగ్గీ - జొమాటోకు పోటీగా 'స్నాక్', ఇక మీకు పండగే