Swiggy Launches Standalone App Snacc: ఫుడ్ అండ్ గ్రోసరీ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ కొత్త యాప్‌ను లాంచ్ చేసింది. ఈ యాప్ పేరు స్నాక్‌ (SNACC). స్విగ్గీతో సంబంధం లేకుండా ఇదొక స్వతంత్ర యాప్‌లా పని చేస్తుంది. స్నాక్‌ యాప్‌ ద్వారా తాజా ఆహారం, పానీయాలు, క్విక్‌ బైట్స్‌ (Fresh food, Drinks, Quick bites) వంటి స్నాక్స్‌ను కేవలం 15 నిమిషాల్లో మీ ఇంటి వద్దకే అందజేస్తుంది. ఫుడ్‌ డెలివెరీలో పెరుగుతున్న పోటీని తట్టుకునేందుకు స్విగ్గీ ఈ యాప్‌ను లాంచ్‌ చేసింది. ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store), యాపిల్ యాప్ స్టోర్‌ (Apple App Store) నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
 
జనవరి 07 నుంచి లైవ్‌లోకి వచ్చిన SNACC
SNACC యాప్‌ జనవరి 07, మంగళవారం నుంచి లైవ్‌లోకి (వినియోగంలోకి) వచ్చినట్లు తెలుస్తోంది. ఈ యాప్‌ ప్రకాశవంతమైన ఫ్లోరోసెంట్ గ్రీన్‌ బ్యాక్‌గ్రౌండ్‌తో, దానిపై ముదురు నీలం రంగు టెక్ట్స్‌తో కనిపిస్తోంది. యాజర్లను ఆకట్టుకునేందుకు, కొన్ని ప్రారంభ ఆఫర్లను స్నాక్‌ ప్రకటించినట్లు తెలుస్తోంది.


స్విగ్గీకి చెందిన బోల్ట్ (Swiggy's Bolt) సర్వీస్‌కు పోటీగా.. Snacc ఫాస్ట్ ఫుడ్, తయారు చేసిన భోజనం, పానీయాలను విక్రయిస్తుంది. అంటే, బోల్ట్‌కు సమాంతరంగా స్నాక్ పని చేస్తుంది. అయితే, బోల్డ్‌ సర్వీస్‌లను స్విగ్గీ ఎప్పటికప్పుడు పెంచుతోంది. ప్రస్తుతం, స్విగ్గీకి వస్తున్న మొత్తం ఫుడ్ డెలివరీ ఆర్డర్‌లలో బోల్ట్‌ కింద 5% పైగా ఆర్డర్‌లు ఉన్నాయి.


Swiggy SNACC ఎక్కడ ప్రారంభమైంది?
స్విగ్గీ, తన స్నాక్‌ యాప్ సేవలను తన హోమ్ సిటీ, అంటే బెంగళూరు నుంచి ప్రారంభించింది. దీనిని అతి త్వరలోనే దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించాలని క్విక్‌ కామర్స్‌ (Quick Commerce) కంపెనీ భావిస్తోంది.


15 నిమిషాల సర్వీస్‌లో జొమాటో
జనవరి 07న, స్విగ్గీ ప్రధాన ప్రత్యర్థి జొమాటో (Zomato) కూడా తన ప్రధాన యాప్ ద్వారా, బోల్డ్‌ తరహాలోనే 15 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ సర్వీస్‌ను అందించడం ప్రారంభించింది. 


జొమాటో ఆధ్వర్యంలో పని చేసే క్విక్‌ కామర్స్‌ ప్లాట్‌ఫామ్ బ్లింకిట్ (Blinkit) కూడా బిస్ట్రో (Bistro) సర్వీస్‌ను స్వతంత్ర యాప్ రూపంలో ప్రారంభించింది. ఈ రంగంలో ఇప్పటికే జెప్టో కేఫ్‌ (Zepto Cafe) కూడా గట్టి పోటీదారుగా ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో, రూ.1,000 కోట్ల యాన్యువలైజ్డ్‌ రెవెన్యూ రన్ రేట్ (ARR)ను సాధించేందుకు జెప్టో తన కేఫ్ బిజినెస్‌ను పెంచుతున్నట్లు తెలుస్తోంది.


ఫుడ్ డెలివరీ వ్యాపారాన్ని విడిగా...
క్విక్‌ కామర్స్‌ బిజినెస్‌ చేస్తున్న బ్లింకిట్‌, జెప్టో, స్విష్‌ (Swish) వంటి పెద్ద కంపెనీలంతా తమ యాప్‌లను విభజించడం లేదా విస్తరించడం చేస్తున్నాయి. ముఖ్యంగా.. ఫుడ్ డెలివరీ వ్యాపారాన్ని క్విక్‌ కామర్స్‌ నుంచి వేరు చేస్తున్నాయి. ఈ రంగంలో పెరుగుతున్న వినియోగదారుల సంఖ్యను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు, క్విక్‌ కామర్స్‌ కంపెనీలు వీలైనంత త్వరగా ర్యాపిడ్ ఫుడ్ డెలివరీ మార్కెట్లో తమ ఉనికిని చాటాలని చూస్తున్నాయి. తద్వారా, ఫుడ్ డెలివరీ వ్యాపారాన్ని విభిన్నంగా నిర్వహించడం & వ్యాపారాన్ని పెద్ద ఎత్తున విస్తరించడం లక్ష్యంగా పని చేస్తున్నాయి.


మరో ఆసక్తికర కథనం: రూ.50 కోట్లకు అధిపతిగా రిటైర్‌ అవ్వండి - మీకు ఎవరూ చెప్పని ఆర్థిక సూత్రం ఇది!