Physical VS Digital Gold: ఒకప్పుడు బంగారం అంటే నగలు లేదా బిస్కట్ల రూపం మాత్రమే ప్రజలకు తెలుసు. దీనిని భౌతిక బంగారం అంటారు. కొన్ని సంవత్సరాలుగా డిజిటల్ గోల్డ్‌ పైనా ప్రజల్లో ఆసక్తి పెరిగింది. అంటే, ఈ బంగారం డిజిటల్‌ రూపంలో మాత్రమే ఉంటుంది, దీనికి భౌతిక రూపం ఉండదు. కానీ, మీకు కావాలంటే భౌతిక రూపంలోకి మార్చుకోవచ్చు.


అయితే... బంగారం ఏ రూపంలో ఉన్నా బంగారమే. ప్రజలనే కాదు రకరకాల పన్నులనూ ఇది ఆకర్షిస్తుంది. డిజిటల్ బంగారంపై విధించే పన్నుల (Tax On Digital Gold) గురించి ఇప్పటికీ చాలా మందికి తెలియదు. భౌతిక బంగారం తరహాలోనే, డిజిటల్ బంగారం పైనా వివిధ రకాల టాక్సులు చెల్లించాలి. ఇంకా వివరంగా చెప్పాలంటే... బంగారం డిజిటల్ రూపంలో ఉన్నా, భౌతిక రూపంలో ఉన్నా పన్ను కట్టాల్సిందే.


మూలధన లాభాలపై పన్ను ఇలా..
మీరు, డిజిటల్ బంగారాన్ని కొన్న తేదీ నుంచి 3 సంవత్సరాల లోపు విక్రయించడం ద్వారా వచ్చే లాభాన్ని స్వల్పకాలిక మూలధన లాభంగా పరిగణనిస్తారు. ఈ లాభంపై విధించే పన్నును స్వల్పకాలిక మూలధన లాభంపై పన్నుగా పిలుస్తారు. ఈ మూలధన లాభం మీ మొత్తం ఆదాయానికి యాడ్‌ అవుతుంది, ఆదాయ పన్ను స్లాబ్ రేట్‌ ప్రకారం మీరు పన్ను కట్టాల్సి ఉంటుంది. డిజిటల్ బంగారాన్ని మీరు కొన్న తేదీ నుంచి 3 సంవత్సరాల తర్వాత విక్రయిస్తే వచ్చే లాభాన్ని దీర్ఘకాలిక మూలధన లాభంగా పరిగణిస్తారు. ఇండెక్సేషన్ బెనిఫిట్‌ తర్వాత దీనిపై 20 శాతం పన్ను ‍‌(Long-term capital gain tax) విధిస్తారు.


బంగారం కొనుగోలుపై GST 
మరోవైపు, డిజిటల్ బంగారం కొనుగోలుపై 3 శాతం GST కట్టాలి. మీరు గూగుల్‌ పే (Google Pay), పేటీఎం ‍(Paytm), ఫోన్‌ పే ‍(PhonePe) మొదలైన ఫ్లాట్‌ఫాంల ద్వారా డిజిటల్ బంగారం కొనుగోలు చేసిన ప్రతిసారీ GST చెల్లించాలి. డిజిటల్ బంగారాన్ని ఆభరణాలుగా మార్చుకోవడానికి మేకింగ్ ఛార్జ్, డెలివరీ ఫీజు చెల్లించాల్సి వస్తుంది.


పేపర్‌ గోల్డ్‌పై పన్ను
డిజిటల్ గోల్డ్‌, ఫిజికల్‌ గోల్డ్‌ కాకుండా, బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఉన్న మరొక మార్గం పేపర్ గోల్డ్‌. సావరిన్ గోల్డ్ బాండ్‌లు (SGBs) మినహా గోల్డ్ ETFs, గోల్డ్ మ్యూచువల్ ఫండ్‌ యూనిట్ల అమ్మకంపై భౌతిక బంగారంతో సమానమైన పన్నును మీరు చెల్లించాల్సి ఉంటుంది.


బాండ్ల విషయంలో నియమాలు భిన్నం
సావరిన్ గోల్డ్ బాండ్ల విషయంలో పన్ను నియమాలు ‍‌(Gold Tax Rules) భిన్నంగా ఉంటాయి. ఇందులో, పెట్టుబడిదారు సంవత్సరానికి 2.5% వడ్డీని పొందుతాడు, ఇది పెట్టుబడిదారు ఆదాయానికి యాడ్‌ అవుతుంది. ఆదాయ పన్ను స్లాబ్ రేట్‌ ప్రకారం పన్ను కట్టాల్సి ఉంటుంది. గోల్డ్ బాండ్ మెచ్యూరిటీ వ్యవధి 8 సంవత్సరాలు. మెచ్యూరిటీ వరకు మీరు ఆ పెట్టుబడిని కొనసాగిస్తే, దీనిపై వచ్చే మూలధన లాభాలపై పన్ను ఉండదు.
 
సావరిన్‌ గోల్డ్‌ బాండ్లను కాల పరిమితికి ముందే (ప్రీ-మెచ్యూర్‌), అంటే 5 సంవత్సరాల తర్వాత పెట్టుబడిదార్లు రిడీమ్ చేసుకోవచ్చు. ఈ బాండ్‌ను 5 నుంచి 8 సంవత్సరాల మధ్య విక్రయిస్తే, దానిపై లాభాన్ని దీర్ఘకాలిక మూలధన లాభంగా పరిగణిస్తారు. ఇండెక్సేషన్ బెనిఫిట్‌ తర్వాత దీనిపై 20 శాతం పన్ను చెల్లించాలి. 


డీమ్యాట్ ఖాతాలో ఉన్నప్పుడు, గోల్డ్‌ బాండ్లను స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడ్ చేయవచ్చు. హోల్డింగ్ పీరియడ్‌పై ఆధారపడి దీర్ఘకాలిక & స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను వాటికి వర్తిస్తుంది.