Bank of Baroda Loan Rate Reduced: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) తన రెపో రేటును నిరంతరం పెంచడంతో, దేశంలోని అన్ని బ్యాంకులు కూడా తాము ఇచ్చే రుణాల మీద వడ్డీ రేట్లను పెంచాయి. గృహ రుణాలు, వాహన రుణాలు, వ్యక్తిగత రుణాలు సహా అన్ని రకాల అప్పులు ఇప్పుడు ఖరీదుగా మారాయి. 


అయితే, పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటి మాత్రం, హోలీకి ముందు, ప్రజలకు పండుగ కానుకను ప్రకటించింది, చౌక ధరకే రుణాలను బహుమతిగా ఇస్తోంది. ఆ బ్యాంక్... బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda). 


గృహ రుణాలపై వడ్డీ రేటును బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (BoB) తగ్గించింది. ఆదివారం (05 మార్చి 2023) ఈ నిర్ణయాన్ని ప్రకటించింది, అదే రోజు నుంచి కొత్త రేటు అమలులోకి వచ్చింది. గృహ రుణ వడ్డీ రేటును 40 బేసిస్‌ పాయింట్లు లేదా 0.40 శాతం మేర ఈ బ్యాంక్ తగ్గించింది. దీనివల్ల బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా గృహ రుణ రేటు 8.50 శాతానికి దిగి వచ్చింది. 


దీంతో పాటు, MSME రుణాలపై కూడా వడ్డీ రేటును కూడా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తగ్గించింది. MSME రుణాలపై, ఈ బ్యాంక్‌ కొత్త వడ్డీ రేటు 8.40 శాతం నుంచి ప్రారంభం అవుతుంది.


ప్రాసెసింగ్ ఫీజులోనూ పూర్తి మినహాయింపు
అంతేకాదు, గృహ రుణాలపై వసూలు చేసే ప్రాసెసింగ్ ఫీజును బ్యాంక్ ఆఫ్ బరోడా పూర్తిగా మాఫీ చేసింది. MSME రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులో 50% డిస్కౌంట్‌ ప్రకటించింది.


చౌక రుణ అవకాశం ఎంత కాలం?
బ్యాంక్ ఆఫ్ బరోడా వడ్డీ రేట్ల విషయంలో జరిగిన రెండు మార్పులు మార్చి 05, 2023 నుంచి అమల్లోకి వచ్చాయి, ఈ నెలాఖరు వరకు, మార్చి 31, 2023 వరకు మాత్రమే అమలులో ఉంటాయి. ఈ మేరకు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఒక ప్రకటన విడుదల చేసింది. అంటే, ప్రజలు ఈ చౌక రుణ రేట్లను సద్వినియోగం చేసుకోవాలనుకుంటే, ఈ నెల 31వ తేదీ లోగా రుణం తీసుకోవలసి ఉంటుంది. బ్యాంకింగ్‌ పరిశ్రమలో ఇవి అతి తక్కువ & అత్యంత పోటీ వడ్డీ రేట్లు అని బ్యాంక్ తన ప్రకటనలో పేర్కొంది. 


చౌక రుణాల ఆఫర్‌పై బ్యాంక్‌ ఇంకా ఏం చెప్పింది?
రుణాల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే 8.5 శాతం గృహ రుణ రేటును అందిస్తామని బ్యాంక్ ఆఫ్‌ బరోడా తన ప్రకటనలో పేర్కొంది. అంతేకాదు, ఈ చౌక రుణాలను బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్‌, అప్‌గ్రెడేషన్‌ కింద కూడా తీసుకోవచ్చు. కొత్త రేట్లు రుణగ్రహీత క్రెడిట్ స్కోర్‌పై ఆధారపడి ఉంటాయని బ్యాంక్ తెలిపింది. సొంతింటి కల ఉన్నవారు, వర్ధమాన పారిశ్రామికవేత్తలు తమ లక్ష్యాన్ని సాధించడానికి ఇదొక సదవకాశంగా వివరించింది.


బ్యాంక్ ఆఫ్ బరోడా లోన్ కావాలంటే.. ఆ బ్యాంక్‌ మొబైల్ యాప్ లేదా వెబ్‌సైట్ వంటి డిజిటల్ మార్గాల ద్వారా లోన్ తీసుకోవచ్చు. ఇది కాకుండా, బ్యాంకు శాఖను సందర్శించడం ద్వారా కూడా చౌక రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.