Gold-Silver Latest Prices Today: బంగారం రేటు రూ.లక్ష దాటుతుందా? 10 గ్రాముల పసిడి కోసం కోసం లక్షల్లో ఖర్చు పెట్టాలా?. బంగారం ధర కొత్త రికార్డ్‌ స్థాయికి చేరిన ప్రతిసారీ ఈ ప్రశ్న తలెత్తుతుంది. అమెరికా సుంకాలపై అనిశ్చితి, అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు, ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధానాన్ని సడలించవచ్చనే అంచనాల నడుమ ప్రపంచ మార్కెట్లలో సేఫ్‌ హెవెన్‌ (బంగారం) వైపు అడుగులు బలంగా పడుతున్నాయి. ఈ ధోరణి కారణంగా, ఇండియన్‌ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు కొత్త గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.


'ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్' డేటా ప్రకారం, 99.9 శాతం స్వచ్ఛత కలిగిన (24 కేరెట్లు) పుత్తడి ధర 10 గ్రాములకు రూ. 1,300 పెరిగి రూ. 90,750కి చేరుకుంది. గత ట్రేడింగ్ సెషన్‌లో 10 గ్రాములకు రూ. 89,450 వద్ద ముగిసింది. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు ‍‌(2025 జనవరి 01 నుంచి మార్చి 18వ తేదీ వరకు), ఈ రెండున్నర నెలల్లో గోల్డ్‌ మెగా ర్యాలీ చేసింది. మూడు నెలల కన్నా తక్కు సమయంలోనే 10 గ్రాముల స్వర్ణం ధర 14.31 శాతం లేదా రూ. 11,360 లేదా పెరిగింది. జనవరి 01వ తేదీన 10 గ్రాముల గోల్డ్‌ రూ. 79,390 వద్ద ఉంది. 


ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు & ప్రపంచ ఆర్థిక అస్థిరతతో బంగారం సహా విలువైన లోహాలు రికార్డు స్థాయిలో ర్యాలీ చేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య, ఆర్థిక విధానాల కారణంగా సురక్షితమై పెట్టుబడి సాధనాలకు డిమాండ్ పెరిగింది. 


లక్ష రూపాయల పైనే తిష్ట వేసిన వెండి
లక్ష రూపాయలు దాటినప్పటికీ వెండి మెరుపు చెక్కుచెదరకుండా ఉంది, చాలా రోజులుగా రూ.లక్ష మార్క్‌ నుంచి దిగి రావడం లేదు. 'ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్' డేటా ప్రకారం, ఈ రోజు కిలో వెండి ధర కూడా రూ. 1,300 పెరిగి రూ. 1,02,500 కు చేరుకుంది. ఇది కూడా కొత్త ఆల్ టైమ్ గరిష్ట స్థాయి (Silver Hits All Time High). గత సెషన్‌లో వెండి కిలోకు రూ.1,01,200 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో స్పాట్ గోల్డ్‌ ఔన్సుకు (31.10 గ్రాములు) దాదాపు 27 డాలర్లు పెరిగి 3,033 డాలర్లకు చేరుకుంది. ఇది కూడా కొత్త గరిష్ట స్థాయి.


తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ (మంగళవారం, 18 మార్చి 2025) 10 గ్రాముల ప్యూర్‌ గోల్డ్‌ (పన్నులతో కలుపుకుని) రూ. 91,200 పలుకుతోంది. కిలో వెండి రేటు రూ.1,04,000 వద్ద ఉంది.


"ద్రవ్యోల్బణం తగ్గుతున్న కారణంగా యుఎస్ ఫెడరల్ రిజర్వ్ (US FED) వడ్డీ రేట్లను మరింత తగ్గిస్తుందనే అంచనాలు పెరిగాయి, దీంతో బంగారం ధరలు రికార్డు స్థాయిలో ఉన్నాయి" అని అబాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చింతన్ మెహతా వెల్లడించారు. యెమెన్ హూతీలు ఎర్ర సముద్రంలో ఓడలపై దాడి చేయడం ఆపే వరకు వారిపై దాడులు కొనసాగిస్తామని అమెరికా ధృవీకరించడంతో, ఆ ప్రాంతంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగాయి, బులియన్ ధరలను బలోపేతం చేశాయని మెహతా చెప్పారు. 


మెరుస్తున్న ప్లాటినం
మరో విలువైన లోహం 'ప్లాటినం' కూడా మెరుపులు మెరిపిస్తోంది. మన దేశంలో, 10 గ్రాముల ప్లాటినం ధర ఇవాళ రూ. 260 పెరిగి రూ. 28,000 మార్క్‌ను అందుకుంది.