Education Loan Interest Rates Of Top 10 Banks: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనేది చాలా మంది కల. కానీ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రికార్డ్ స్థాయిలో తగ్గడం వల్ల, ట్యూషన్ ఫీజు చెల్లించడం సంపన్న కుటుంబాలకు కూడా అతి పెద్ద భారంగా మారింది. ఈ పరిస్థితుల్లో, విద్యా రుణం తీసుకోవడం మంచి ఆప్షన్ కావచ్చు. మీరు ఈ ఏడాదిలోనే విద్యా రుణం తీసుకుని ఉన్నత చదువు కోసం విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే, దానికంటే ముందు తక్కువ వడ్డీ రేటుకు రుణం అందించే బ్యాంక్‌ను వెతికి పట్టుకోవడం ముఖ్యం. అయితే, మీకు ఆ శ్రమ తగ్గించడానికి, ఎడ్యుకేషన్ లోన్‌పై కొన్ని బ్యాంక్‌లు వసూలు చేస్తున్న వడ్డీ రేట్ల వివరాలను మేమే ఈ కథనంలో అందిస్తున్నాం.
గుర్తుంచుకోవాల్సిన విషయాలు
అంతర్జాతీయ చదువుల కోసం వెళ్లే విద్యార్థులకు ప్రత్యేక విద్యా రుణ కార్యక్రమాలను అందించే బ్యాంకులు చాలా ఉన్నాయి. ట్యూషన్ ఫీజ్‌ల నుంచి ల్యాప్‌టాప్, పుస్తకాలు, విమాన ప్రయాణం మొదలైన అనేక ఖర్చులు ఈ ప్రత్యేక లోన్‌లో భాగమై ఉంటాయి. విద్యా రుణం తీసుకునేటప్పుడు వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజ్‌లు, రీపేమెంట్ రూల్స్, రుణం కాల వ్యవధి, మారటోరియం కాలం వంటి కొన్ని విషయాలను తెలుసుకోవాలి.
బ్యాంక్‌బజార్ (Bankbazaar.com) డేటా ప్రకారం.. మన దేశంలో చాలా బ్యాంకులు 8.60 శాతం నుంచి 13.70 శాతం వడ్డీ రేటుతో 7 సంవత్సరాల కాలానికి (Education Loan Tenure) రూ. 50 లక్షల వరకు విద్యా రుణాలు అందిస్తున్నాయి.
ICICI బ్యాంక్ & యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI)
విద్యా రుణంపై ఈ బ్యాంక్‌ల వార్షిక వడ్డీ రేటు 9.25 శాతం నుంచి ప్రారంభమవుతుంది. ఏడు సంవత్సరాల కాల పరిమితితో రూ. 50 లక్షల రుణానికి EMI రూ. 81,081 అవుతుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB)
విద్యా రుణంపై BOB వడ్డీ రేటు 9.45 శాతం నుంచి ప్రారంభమవుతుంది. 50 లక్షల రూపాయల వరకు రుణంపై ఏడు సంవత్సరాల కాలానికి ప్రతి నెలా రూ. 81,592 EMI చెల్లించాలి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)
SBI విద్యా రుణాలపై వడ్డీ రేటు 10.15 శాతం నుంచి ప్రారంభమవుతుంది. ఏడు సంవత్సరాల కాలానికి రూ. 50 లక్షల వరకు విద్యా రుణంపై నెలవారీ EMI రూ. 83,394 గా ఉంటుంది.
ఇండియన్ బ్యాంక్
విద్యా రుణంపై ఇండియన్ బ్యాంక్ అతి తక్కువ వడ్డీ రేటు 8.60 శాతం వసూలు చేస్తోంది. ఏడు సంవత్సరాల పాటు రూ. 50 లక్షల విద్యా రుణంపై నెలవారీ EMI రూ. 79,434 అవుతుంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇచ్చే విద్యా రుణంపై వడ్డీ రేటు 10 శాతం నుంచి ప్రారంభమవుతుంది. ఏడు సంవత్సరాల కాల పరిమితి కలిగిన రూ. 50 లక్షల రుణంపై EMI రూ. 83,006 గా ఉంటుంది.
కెనరా బ్యాంక్
దీని వడ్డీ రేటు 10.25 శాతం నుంచి స్టార్ట్ అవుతుంది. ఏడు సంవత్సరాల కాల పరిమితి కలిగిన రూ. 50 లక్షల విద్యా రుణంపై EMI రూ.83,653 గా ఉంటుంది.
యాక్సిస్ బ్యాంక్
యాక్సిస్ బ్యాంక్ విద్యా రుణంపై వడ్డీ రేటు 13.70 శాతం నుంచి మొదలవుతుంది. ఏడు సంవత్సరాల కాల పరిమితితో రూ. 50 లక్షల ఎడ్యుకేషన్ లోన్‌పై రూ. 92,873 EMI చెల్లించాలి.
బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI)
బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫర్ చేస్తున్న విద్యా రుణంపై వడ్డీ రేటు 11.60 శాతం నుంచి ప్రారంభమవుతుంది. 50 లక్షల రూపాయల రుణంపై ఏడు సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ. 87,198 EMI కట్టాలి.
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB)
ఎడ్యుకేషన్ లోన్ విషయంలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వడ్డీ రేటు 11 శాతం నుంచి ప్రారంభమవుతుంది. ఏడు సంవత్సరాల కాల పరిమితి కలిగిన రూ. 50 లక్షల రుణంపై EMI రూ. 85,612 గా ఉంటుంది.