Tata Motors, Hyundai, Mahindra, Kia Car Price Hike: దేశంలో అతి పెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి కార్ల రేట్లు ఏప్రిల్ 2025 నుంచి పెరగబోతున్నాయి. తన వాహనాల ధరలను 4 శాతం వరకు పెంచాలని ఆ కంపెనీ నిర్ణయించింది. వాహన తయారీకి అవసరమయ్యే ముడి వస్తువుల ధరలు & నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నందున, వాహనాల ధరలను పెంచాలని నిర్ణయించినట్లు మారుతి సుజుకి ఇండియా తెలిపింది. మోడల్‌ను బట్టి రేటు పెంపు మారుతుందని వెల్లడించింది. దీంతోపాటు, ఇంకా చాలా కంపెనీలు కూడా కార్‌ ధరలు పెంచాయి.


కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి అమలు
కంపెనీపై పడుతున్న వ్యయాల భారాన్ని ఇప్పటి వరకు తామే భరించామని, ఇకపై, పెరిగిన వ్యయంలో కొంత భాగాన్ని వినియోగదారులకు కూడా బదిలీ చేయడం తప్పడం లేదని మారుతి సుజుకి ఇండియా తెలిపింది. ముడి వస్తువుల ధరలు & లాజిస్టిక్స్ ఖర్చులు పెరగడం వల్ల వాహన రంగం ఇప్పటికే ఒత్తిడిలో ఉంది. ఈ నేపథ్యంలో మారుతి సుజుకి ఈ నిర్ణయం తీసుకుంది. కంపెనీ నిర్ణయం ప్రకారం, కార్‌ మోడల్‌ను బట్టి దాని ధర గరిష్టంగా 4 శాతం వరకు పెరుగుతుంది. కొత్త రేట్లు నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే 01 ఏప్రిల్‌ 2025 నుంచి అమల్లోకి వస్తాయి.


ప్రస్తుతం, ఎంట్రీ లెవెల్‌ Alto K10 నుంచి Invicto వరకు వివిధ మోడళ్లను రూ. 4.23 నుంచి రూ. 29.22 లక్షల (ఎక్స్‌షోరూం, దిల్లీ) రేంజ్‌లో మారుతి సుజుకి విక్రయిస్తోంది.


ఇప్పటికే ధరలు పెంచిన మారుతి
దీనికి ముందు కూడా, ఈ ఏడాది జనవరిలో మారుతి సుజుకి తన కార్ల రేట్లను 4 శాతం వరకు పెంచింది. అప్పుడు, కార్‌ మోడల్‌ను ధరలను రూ. 1,500 నుంచి రూ. 32,500 వరకు పెంచింది. ఈ కంపెనీ, గత ఏడాది డిసెంబర్ ప్రారంభంలో కూడా ధరల పెంపును ప్రకటించింది. ఫిబ్రవరిలోనూ రేట్లు పెరిగాయి, ఇప్పుడు ఏప్రిల్‌లోనూ ధరలు పెరుగుతాయి. 


ఎప్పటికప్పుడు పెరుగుతున్న వాహనాల ధరలు ఆటోమోటివ్ పరిశ్రమ కష్ట సమయాల్లో ప్రయాణిస్తోందని సూచిస్తున్నాయి. పెరిగిన ధరల ప్రభావాన్ని వినియోగదారులపై తగ్గించడానికి కంపెనీ కట్టుబడి ఉంది, అయితే కొంత ఖర్చు భారం మార్కెట్లకు కూడా బదిలీ చేయబడుతుంది. 


ఈ కంపెనీలు కూడా ధరలు పెంచాయి
టాటా మోటార్స్ కూడా తన వాహనాల రేట్లు పెంచింది ‍‌(Tata Motors Car Price Hike). టాటా మోటార్స్‌ వాణిజ్య వాహన ధరలు 2 శాతం వరకు పెరుగుతాయి. వ్యయాలను నియంత్రిస్తున్నప్పటికీ, కస్టమర్లపై కొంత భారం మోపకతప్పడం లేదని ఈ కంపెనీ తెలిపింది.       


ఇంకా... హ్యుందాయ్ (Hyundai), మహీంద్రా (Mahindra), కియా (Kia), స్కోడా (Skoda), జీప్ (Jeep), సిట్రోయెన్ (Citroen), మెర్సిడెస్ బెంజ్ (Mercedes Benz), ఎంజీ మోటార్‌ (MG Motor), బీఎమ్‌డబ్ల్యూ (BMW), ఆడి (Audi) కూడా ఈ సంవత్సరం వాహనాల ధరలను పెంచాలని నిర్ణయించాయి. వీటిలో చాలా కంపెనీలు ఈ ఏడాది జనవరిలో కూడా 2 శాతం నుంచి 4 శాతం వరకు రేట్లు పెంచాయి.