Dhanteras 2024: ప్రపంచ దేశాల్లో, ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా పుత్తడి మెరుపు ఎప్పటికప్పుడు పెరుగుతోంది. ఇప్పుడు దీపావళి, ధన్‌తేరస్‌ సమీపిస్తున్నాయి. ఈ తరుణంలో, పసిడి ధర కొత్త రికార్డులు సృష్టిస్తుందని భావిస్తున్నారు. గత ఏడాది ధన్‌తేరస్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం (24K Gold Rate) ధర రూ. 60,000 వద్ద ఉండగా, ఈ ఏడాది ఇప్పటికే రూ. 81,000 సమీపంలో ఉంది. గత దీపావళి నుంచి ఇప్పటి వరకు ఇది దాదాపు 35 శాతం పెరిగింది. 10 గ్రాముల ప్యూర్‌ గోల్డ్‌ రేటు లక్ష రూపాయలను కూడా తాకొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, దీని కోసం కొంతకాలం ఓపికగా వెయిట్‌ చేయాలి.


ధన్‌తేరస్‌లో భారీగా బంగారం, వెండి కొనుగోళ్లు
మార్కెట్ ట్రెండ్‌ను పరిశీలిస్తే, ఈ దీపావళి & ధన్‌తేరస్‌ పర్వదినాల్లో కూడా బంగారం, వెండిలో భారీ కొనుగోళ్లు జరిగే అవకాశం ఉంది. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) డేటా ప్రకారం, 2023 దీపావళి నుంచి ఇప్పటి వరకు బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. ఇది, స్టాక్‌ మార్కెట్‌లోని నిఫ్టీ50 ఇండెక్స్ ఇచ్చిన 28 శాతం రాబడి కంటే గోల్డ్‌ ఇన్వెస్టర్లకు ఎక్కువ ప్రయోజనాలను ఇచ్చింది. ఈ క్యాలెండర్‌ (2024) సంవత్సరంలోనే బంగారం ధర దాదాపు 23 శాతం పెరిగింది, ఇది ఈక్విటీ ‍‌(స్టాక్‌ మార్కెట్‌) రాబడుల కంటే ఎక్కువ. బిజినెస్ టుడే రిపోర్ట్‌ ప్రకారం, ఈ ఏడాది సెన్సెక్స్ కేవలం 11 శాతం రాబడిని మాత్రమే ఇవ్వగలిగింది. 


ఈ దీపావళికి రూ.80,000 పైనే..
ప్రపంచ పరిస్థితులను బట్టి చూస్తే, బంగారం ధరలు 80,000 మార్క్ నుంచి తగ్గే సూచనలు కనిపించడం లేదు. గోల్డ్‌ రేట్లు అధిక స్థాయిలో ఉన్నప్పటికీ, ఈ పండుగ సీజన్‌లో బంగారానికి డిమాండ్ తగ్గకపోవచ్చని IBJA రిపోర్ట్‌ చెబుతోంది. ధన్‌తేరస్‌లో, 10 గ్రాముల గోల్డ్‌ రేట్‌ రూ. 80,000 కంటే ఎక్కువే ఉండొచ్చు. ప్రపంచంలోని తీవ్రమైన పరిస్థితుల కారణంగా, పెట్టుబడిదార్లు ఎల్లో మెటల్‌ను సురక్షితమైన పెట్టుబడి సాధనంగా పరిగణిస్తున్నారు. లిక్విడిటీని కలిగి ఉండడంతో పాటు, ద్రవ్యోల్బణం ప్రభావాల నుంచి కూడా ఇది ఇన్వెస్టర్లను రక్షిస్తుంది. ప్రపంచంలోని ప్రతి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో బంగారం కొనుగోళ్లు ఏటికేడు పెరుగుతున్నాయి.


2025 దీపావళి నాటికి రూ.లక్ష పైనే..
బంగారంతో పాటు గోల్డ్ ఈటీఎఫ్‌లు ‍‌(Gold ETFs), సావరిన్ గోల్డ్ బాండ్లలో (SGBs) కూడా పెట్టుబడి పెట్టవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీపావళి 2025ను దృష్టిలో పెట్టుకుని బంగారంలో పెట్టుబడులు (Investment in gold) పెట్టేందుకు ఇది సరైన సమయమని భావిస్తున్నారు. ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్న ప్రకారం, 2025 దీపావళి & ధన్‌తేరస్ నాటికి లక్ష రూపాయల లక్ష్యంతో బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. 2025 దీపావళి నాటికి 10 గ్రాముల 24K గోల్డ్‌ రేటు రూ. 1,03,000కి చేరుతుందని అంచనా. 


గత ఐదేళ్లలో పసిడి ధర దాదాపు రెండింతలు పెరిగింది. గత 10 ఏళ్లలో 10 రెట్లు జంప్ చేసింది. భవిష్యత్తులోనూ ఈ ట్రెండ్‌ కొనసాగుతుందని మార్కెట్‌ ఎక్స్‌పర్ట్స్‌ అంచనా వేస్తున్నారు.


మరో ఆసక్తికర కథనం: రూ.5 వేలతో 20 ఏళ్లు 'సిప్‌' చేస్తే దాని వాల్యూ ఎంత పెరుగుతుందో మీరు ఊహించలేరు