Rs 5,000 Monthly SIP For 20 Years: డబ్బును ఆదా చేయడమే కాదు, స్పష్టమైన లక్ష్యాల కోసం ఆ డబ్బును పెట్టుబడిగా పెట్టాలి. ఇలా చేసినోడే కాలంతో పోటీపడి గెలుస్తాడు, హీరోగా నిలుస్తాడు. పిల్లల చదువుల కోసమైనా, పెళ్లిళ్ల కోసమైనా, పదవీ విరమణ ప్లానింగ్‌ కోసమైనా.. నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరడానికి చేసే సరైన పెట్టుబడి సరైన మార్గాన్ని చూపుతుంది. "ఆదాయం - పొదుపు = ఖర్చులు" ఈ సూత్రాన్ని తూ.చా. తప్పకుండా పాటించాలన్నది ఆర్థిక నిపుణుల మాట. దురదృష్టం ఏంటంటే, చాలామంది ఈ ఫార్ములాను రివర్స్‌లో వాడుతున్నారు. మొదట ఖర్చు చేస్తున్నారు, మిగిలినదాన్ని ఆదా చేస్తున్నారు. ఇది కరెక్ట్‌ పద్ధతి కాదు.


"ఆదాయం - పొదుపు = ఖర్చులు" సూత్రాన్ని తాకరమంత్రంగా పఠించి, పాటించి, పెట్టుబడులు పెడితే.. మీరు సృష్టించే సంపద కుప్పలుతెప్పలుగా పేరుకుపోతుంది. ఆ మ్యాజిక్‌ చూసి మీ కళ్లను మీరే నమ్మలేకపోవచ్చు.


నెలవారీ రూ.5,000 సిప్‌తో..


ఉదాహరణకు, 12 శాతం వార్షిక రాబడి ఇవ్వగల ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో నెలవారీ SIP (Systematic Investment Plan) రూ. 5,000 చొప్పున 20 ఏళ్లు పెట్టుబడి పెట్టారనుకోండి. 20 సంవత్సరాల తర్వాత ఆ మొత్తం రూ. 50 లక్షలకు పెరుగుతుంది. ఇందులో మీ పెట్టుబడి రూ. 12 లక్షలు కాగా, మిగిలిన రూ. 38 లక్షలు లాభమే. 


పెట్టుబడి కాలాన్ని మార్చకుండా మరో ఉదాహరణ చూద్దాం - అదే 12 శాతం రాబడితో, నెలకు రూ. 10,000 చొప్పున 20 ఏళ్ల పాటు సిప్‌ చేయగలిగితే, చివరిలో మీరు దాదాపు 1 కోటి రూపాయలు రాబట్టొచ్చు.


పెట్టుబడి కాలాన్ని మార్చి చూద్దాం. 12 శాతం వృద్ధి రేటును అంచనాతో, మంత్లీ SIP 5,000 రూపాయలను 25 ఏళ్ల పాటు కొనసాగిస్తే సుమారు రూ. 95 లక్షల్లోకి అది మారుతుంది. నెలనెలా రూ. 10,000 చొప్పున 25 ఏళ్లు పెట్టుబడి పెడితే రూ. 1.9 కోట్ల సంపదను మీరు సృష్టించొచ్చు.


12% యాన్యువల్‌ రిటర్న్‌తో, నెలవారీ రూ. 3,000 SIPను 30 సంవత్సరాలు కొనసాగిస్తే 1 కోటి రూపాయల కంటే ఎక్కువ మొత్తం మీకు తిరిగి రావచ్చు. 


ద్రవ్యోల్బణం - కాలపరిమితి


పెట్టుబడిని ప్రారంభించే ముందు, ద్రవ్యోల్బణాన్ని & మీ ఆర్థిక లక్ష్యాల కాలపరిమితిని కూడా గుర్తు పెట్టుకోవాలి. 20 ఏళ్లలో మీ పిల్లల చదువుకు రూ. 25 లక్షలు అవసరమని మీరు లెక్కలు వేస్తే... ద్రవ్యోల్బణం కారణంగా 20 ఏళ్ల తర్వాత ఆ అవసరం రూ. 35 లక్షలకు పెరగొచ్చు. కాబట్టి, ద్రవ్యోల్బణం, కాలం రెండింటినీ కలగలిపి ఇన్వెస్ట్‌మెంట్‌ స్టార్ట్‌ చేయాలి. ఈ కేస్‌లో, రూ. 25 లక్షల కోసం కాకుండా రూ. 35 లక్షల టార్గెట్‌తో మదుపు చేయాలి.


ఎంత పెట్టుబడి పెడితే ఎంత కాలంలో కోటీశ్వరుడిగా మారొచ్చన్న విషయాన్ని "SIP కాలిక్యులేటర్‌" ద్వారా ఈజీగా కనిపెట్టొచ్చు. 


క్రమశిక్షణతో కూడిన పొదుపును అలవాటుగా మార్చుకోవడానికి, మార్కెట్‌ ఒడుదొడుకులను తట్టుకోవడానికి 2-3 మ్యూచువల్ ఫండ్ పథకాల్లో SIP చేయాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. 


SIP స్టార్ట్‌ చేయడానికి మీ దగ్గర వేలకువేలు ఉండాల్సిన అవసరం లేదు, నెలకు రూ.500 ఉన్నా చాలు. అయితే, ఎంత పెద్ద మొత్తాన్ని ఇన్వెస్ట్‌ చేస్తే అంత పెద్ద మొత్తంలో సంపద సృష్టి జరుగుతుందని గుర్తుంచుకోండి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: ధన్‌తేరస్‌ సందర్భంగా నగలు కొనేప్పుడు ఈ టిప్స్‌ పాటించండి, మీకు డబ్బు కలిసొస్తుంది!