Import Tax On Gold: పెరుగుతున్న ఆర్థిక లోటు, ద్రవ్యోల్బణం, రూపాయి పతనాన్ని అడ్డుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఉదయం పెట్రోలు, డీజిల్, వైమానిక ఇంధనపై ఎగుమతి పన్ను విధించింది. మధ్యాహ్నం భారతీయులకు అత్యంత ఇష్టమైన బంగారంపై దిగుమతి పన్ను పెంచేసింది.
కరెంట్ ఖాతా లోటు (CAD)ని అడ్డుకొనేందుకు 10.75 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని నేడు 15 శాతానికి పెంచుతూ నోటిపై చేసింది. జూన్ 30 నుంచే ఈ మార్పులు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. అంతకు ముందు బంగారంపై సాధారణ కస్టమ్స్ డ్యూటీ 7.5 శాతంగా ఉండగా ఇప్పుడది 12.5 శాతానికి పెరిగింది. దాంతో పాటు వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సుంకం (AIDC) 2.5 శాతాన్నీ పెంచడంతో మొత్తంగా పుత్తడిపై కస్టమ్స్ డ్యూటీ 15 శాతానికి చేరుకుంది.
Also Read: పెట్రోల్, డీజిల్‌పై మరో పన్ను పెంచిన కేంద్రం! సామాన్యుడి పరిస్థితి ఏంటి?
'హఠాత్తుగా బంగారం దిగుమతులు పెరిగాయి. మే నెలలో 107 టన్నుల పుత్తడి దిగుమతి చేశారు. జూన్‌లో ఇంకా పెరిగింది. బంగారం దిగుమతుల వల్ల కరెంటు ఖాతా లోటుపై ఒత్తిడి ఎక్కువైంది' అని ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరించింది.
దాదాపుగా భారతదేశపు బంగారపు అవసరాలన్నీ దిగుమతి ద్వారానే తీరుతాయి. అయితే ఎక్కువగా దిగుమతి చేసుకోవడం వల్ల రూపాయి బలహీనం అవుతోంది. ఇప్పటికే జీవిత కాల కనిష్ఠానికి పడిపోయింది. అందుకే పుత్తిడి దిగుమతుల్ని కట్టడి చేయాలని కేంద్రం నిర్ణయించింది. శుక్రవారం ఆశ్చర్యకర రీతిలో దిగుమతి పన్ను పెంచేసింది.
కరోనా మహమ్మారితో ధరలు తగ్గడంతో గతేడాది నుంచి దేశంలో బంగారం దిగుమతులు పెరిగాయి. పదేళ్లలోనే ఎన్నడూ లేనంతగా 2021లో భారత్ బంగారాన్ని దిగుమతి చేసుకుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. అప్పట్లో దిగుమతులు నియంత్రించకపోవడం ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ రికవరీకి ఇబ్బందిగా మారింది. మేలో ట్రేడ్ ఇంబాలెన్స్ 24.3 బిలియన్ డాలర్లకు చేరుకోవడం కఠిన చర్యలు మొదలు పెట్టింది.
ప్రస్తుతం భారత కరెంట్ ఖాతా లోటు జీడీపీలో 1.2 శాతంగా ఉంది. 2021లో కరెంటు ఖాతా మిగులు 0.9 శాతంగా ఉండటం గమనార్హం. గతేడాది 102.2 బిలియన్ డాలర్లుగా ఉన్న ట్రేడ్ ఇంబాలెన్స్ ఇప్పుడు 189.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. 2023లో ఈ లోటు జీడీపీలో 3.1 శాతానికి పెరిగే ప్రమాదం ఉందని ఫిచ్ హెచ్చరించింది.
Also Read: గుడ్ న్యూస్-కమర్షియల్ సిలిండర్ ధర తగ్గింది, ఎంతంటే?