Floating Rate FDs:


ఆర్బీఐ విధాన రేట్ల సమీక్ష అనగానే బ్యాంకుల్లో అప్పులు తీసుకున్నోళ్ల గుండెలు గుభేల్‌ అంటున్నాయి! సమావేశం జరిగిన ప్రతిసారీ రెపోరేట్లు పెంచుతుండటంతో ఉసూరుమంటున్నారు. ఇంకెన్నిసార్లు వడ్డీరేట్ల మోత మోగిస్తారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్లోటింగ్‌ వడ్డీరేటుతో రుణం తీసుకోకుంటే బాగుండేదేమోనని భావిస్తున్నారు. ఆర్బీఐ అలా ప్రకటించిందో లేదో బ్యాంకులు వెంటనే ఈఎంఐల పెంచేస్తాయి. 


అందుకే.. ఇదే పెంపు విధానం ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఉంటే బాగుండు కదా అనుకుంటున్నారు చాలామంది! అలా రెపోరేటు పెంచగానే వెంటనే ఎఫ్‌డీ వడ్డీరేట్లు పెంచాలని మీరూ కోరుకుంటున్నారా! ఫ్లోటింగ్‌ వడ్డీరేట్లు అమలయ్యే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఎంచుకోవడమే ఇందుకు పరిష్కారం! ఇంతకీ ఏంటి ఎఫ్‌డీలు? ఏ బ్యాంకులు ఆఫర్‌ చేస్తున్నాయి? లాభనష్టాలేంటి? మీకోసం..!


కొనసాగుతున్న రేట్ల పెంపు


ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలోకి తీసుకొచ్చేందుకు ఆర్బీఐ రెపోరేట్లను వరుసగా పెంచుతోంది. బ్యాంకింగ్‌ వ్యవస్థలో లిక్విడిటీని తగ్గించేస్తోంది. గత ఎనిమిది నెలల్లోనే వడ్డీరేటును 2.25 శాతం పెంచేసింది. ఫలితంగా ఫ్లోటింగ్‌ రేటు ఆధారిత రుణాల వడ్డీరేట్లు భారీగా పెరిగాయి. ఇదే సమయంలో బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీని పెంచుతున్నాయి. రెపోరేటు స్థాయిలో లేకున్నా త్వరలోనే శిఖర స్థాయికి వడ్డీరేట్లు చేరతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటిపై అధిక రాబడి పొందాలంటే ఫ్లోటింగ్‌ రేట్‌ ఎఫ్‌డీల్లో ఇన్వెస్ట్‌ చేయడం మంచిదని వారు సూచిస్తున్నారు. రెపోరేట్ల పెంపు సమయంలో ఇవే బెస్ట్‌ అంటున్నారు.


ఆఫర్‌ చేస్తున్న బ్యాంకులు


ప్రస్తుతానికి కేవలం రెండు బ్యాంకులు మాత్రమే ఫ్లోటింగ్‌ రేట్‌ ఆధారిత ఎఫ్‌డీలను ఆఫర్‌ చేస్తున్నాయి. ఐడీబీఐ బ్యాంక్‌, యెస్‌ బ్యాంకు వీటిని అందిస్తున్నాయి. వీటిలో పెట్టుబడి పెట్టేముందు రాబడి ఎలా వస్తుందో గమనించడం ముఖ్యం. రెపోరేట్లు పెంచుతున్నప్పుడు వీటిపై ఎక్కువ రాబడి వస్తుందని, తగ్గిస్తున్నప్పుడు లాభంలో కోత ఉంటుందని అంటున్నారు. బ్యాంకులు ఎంచుకుంటున్న బెంచ్‌మార్క్‌ లెండింగ్‌ రేట్‌, దానికి జత చేస్తున్న స్ప్రెడ్‌ రేట్‌ను అనుసరించి ఇది ఉంటుంది. ఉదాహరణకు రెపోరేటు 6.25 శాతం ఉందనుకోండి. దానిపై స్ప్రెడ్‌ రేటు 2 శాతం ఇచ్చారనుకోండి మొత్తంగా ఎఫ్‌డీపై వచ్చే రేటు 8.25 శాతంగా ఉంటుంది.


ఎంత లాభం - ఎంత నష్టం?


ఐడీబీఐ బ్యాంకు 2018, నవంబర్‌ 1 వరకు 364 రోజుల ట్రెజరీ బిల్‌ ఆధారిత ఫ్లోటింగ్‌ రేట్‌ ఎఫ్‌డీని ఆఫర్‌ చేసింది. అప్పట్లో ఇన్వెస్ట్‌ చేసిన వారికి ఇప్పుడు 7.75 శాతం వడ్డీ వస్తోంది. ఇప్పుడు 91 రోజులు ట్రెజరీ బిల్లు బెంచ్‌మార్క్‌ ఆధారిత ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను మాత్రమే అందిస్తోంది. వీటిపై స్ప్రెడ్‌ 0.5 శాతంగా ఉంది. ప్రస్తుత రేట్ల ప్రకారం ఈ ఎఫ్‌డీలపై 6.63 శాతం వడ్డీ వస్తుంది. కానీ ప్రస్తుతం కొన్ని బ్యాంకులు 7.05 శాతం వడ్డీరేటుకు స్పెషల్‌ ఎఫ్‌డీలు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇక యెస్‌ బ్యాంకైతే రెపోరేటునే బెంచ్‌మార్క్‌గా తీసుకుంది. 18 నెలలకు మించి కాలపరిమితి గల ఎఫ్‌డీలపై 1.6 శాతం వరకు స్ప్రెడ్‌ ఇస్తోంది. అంటే కస్టమర్‌కు 7.85 శాతం వరకు రాబడి లభిస్తుంది. గరిష్ఠ కాలపరిమితి 3 ఏళ్లే కావడం వీటి పరిమితి.


అన్నీ పరిగణనలోకి తీసుకున్నాకే!


ఫ్లోటింగ్‌ రేట్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టేముందు జాగ్రత్తగా ఆలోచించుకోవాలని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే రెపోరేట్ల పెంపు ఎంత కాలం కొనసాగుతుందో ఎవరికీ తెలియదు. ఈఎంఐల భారం ఎక్కువగా ఉందనిపిస్తే ఆర్బీఐ పెంపు నిలిపివేసే ప్రమాదం ఉంది. ఒకవేళ ఆర్థిక వ్యవస్థ చక్కబడి, ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తే రెపోరేట్లు తగ్గిస్తారు. అందుకే 1-3 ఏళ్ల ఫ్లోటింగ్‌ ఎఫ్‌డీల్లో ఇన్వెస్ట్‌ చేయడం మంచిదని విశ్లేషకులు సూచిస్తున్నారు. కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు, చిన్న బ్యాంకులు  7-8 శాతం వరకు డిపాజిట్లపై  వడ్డీ ఇస్తున్న సంగతిని పరిగణనలోకి తీసుకోవాలని అంటున్నారు.