ICICI Bank FD Interest Rates: దేశంలోని ప్రముఖ ప్రైవేట్ సెక్టార్‌ బ్యాంక్ అయిన ICICI బ్యాంక్, బల్క్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FD) వడ్డీ రేట్లను సవరించింది. కొత్త వడ్డీ రేట్లు గురువారం (అక్టోబర్ 5, 2023) నుంచి అమలులోకి వచ్చాయి. అక్టోబర్ 6న RBI పాలసీ డెసిషన్స్‌కు ఒక రోజు ముందు ఐసీఐసీఐ బ్యాంక్‌ ఈ నిర్ణయం తీసుకుంది. 


రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్ల లోపు ఉన్న డిపాజిట్లను బల్క్ డిపాజిట్లు అంటారు. కొత్త రేట్ల ప్రకారం... సాధారణ ప్రజలు, సీనియర్ సిటిజన్లు ఇద్దరూ గరిష్టంగా 7.25% వరకు వడ్డీ ప్రయోజనం పొందుతారు.


ఐసీఐసీఐ బ్యాంక్ బల్క్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కొత్త వడ్డీ రేట్లు: 


ICICI బ్యాంక్‌ వెబ్‌సైట్ ప్రకారం, బ్యాంక్ బల్క్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో అత్యధిక వడ్డీ రేటు 7.25%. 1 సంవత్సరం నుంచి 15 నెలల కాల వ్యవధికి ఈ రేటును బ్యాంక్‌ ఆఫర్‌ చేస్తోంది. 15 నెలల 1 రోజు నుంచి 18 నెలల టైమ్‌ పిరియడ్‌ కోసం 7.05% వడ్డీ ఆదాయం అందిస్తోంది. 18 నెలల 1 రోజు నుంచి 2 సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధిలో 7% వడ్డీ చెల్లిస్తోంది.


ఇవి కాకుండా... 271 రోజుల నుంచి 1 సంవత్సరం వరకు ఉండే మెచ్యూరిటీలపై 6.75% వడ్డీ రేటు కస్టమర్లకు అందుతుంది. 2 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాల వరకు ఉన్న టెన్యూర్స్‌ మీద కూడా ఇదే రేటు వరిస్తుంది.


185 రోజుల నుంచి 270 రోజుల కాల వ్యవధి డిపాజిట్లకు 6.65%, 91 రోజుల నుంచి 184 రోజుల కాల వ్యవధి డిపాజిట్లకు 6.50%, 61 రోజుల నుంచి 90 రోజుల కాల వ్యవధి డిపాజిట్లకు 6% రేటును ICICI బ్యాంక్‌ చెల్లిస్తుంది.


షార్ట్‌ టైమ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ విషయానికి వస్తే... 46 రోజుల నుంచి 60 రోజుల వరకు 5.75% వడ్డీ రేటు, 30 రోజుల నుంచి 45 రోజుల వరకు 5.5% వడ్డీ రేటు, 7 రోజుల నుంచి 29 రోజుల వ్యవధి మధ్య 4.75% వడ్డీ రేటును బ్యాంక్‌ ఫిక్స్‌ చేసింది.


బల్క్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మీద సీనియర్‌ సిటిజన్స్‌ కోసం ప్రత్యేకంగా ఎలాంటి ప్రీమియం రేట్లను ఐసీఐసీఐ బ్యాంక్‌ ఆఫర్‌ చేయడం లేదు. సాధారణ ప్రజలకు ఇచ్చే వడ్డీ శాతాన్నే సీనియర్ సిటిజన్‌లకు కూడా వర్తింపజేసింది. 


టర్మ్స్‌ అండ్‌ కండిషన్స్‌
బ్యాంక్‌ నిబంధనలు & షరతుల ‍‌(terms and conditions) ప్రకారం, ICICI బ్యాంక్ FD వడ్డీ రేట్లు ముందస్తు నోటీసు లేకుండా మారవచ్చు. కాబట్టి, FD వాల్యూ డేట్‌లో వడ్డీ రేటు డిసైడ్‌ అవుతుంది. అలాగే, ఆదాయ పన్ను చట్టం ప్రకారం, ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ ఆదాయం మీద TDS ‍‌(Tax Deducted at Source) కట్‌ అవుతుంది.


ICICI బ్యాంక్ FD రూల్స్‌ ప్రకారం.... డబ్బును డిపాజిట్ చేసిన తేదీ నుంచి 7 రోజులలోపు ఆ FD మొత్తాన్ని డిపాజిటర్ విత్‌డ్రా చేస్తే ఒక్క రూపాయి కూడా వడ్డీ ఆదాయాన్ని బ్యాంక్‌ చెల్లించదు. దేశీయ & NRO టర్మ్ డిపాజిట్ల కోసం కనీస కాల వ్యవధి 7 రోజులు. NRE టర్మ్ డిపాజిట్లకు కనీస కాల వ్యవధి 1 సంవత్సరం. డిపాజిట్ తేదీ నుంచి 1 సంవత్సరం లోపు NRE టర్మ్ డిపాజిట్‌ను విత్‌డ్రా చేస్తే (prematurely withdrawn), ఆ డిపాజిట్‌కు కూడా బ్యాంక్‌ వడ్డీని చెల్లించదు.


కొత్త డిపాజిట్లకు, ఇప్పటికే ఉన్న టర్మ్ డిపాజిట్లకు ఈ కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయి.


సాధారణంగా, ఫిక్స్‌డ్ డిపాజిట్లు రిస్క్ లేనివి & హామీతో కూడిన రాబడిని (guaranteed returns) ఇస్తాయి. సురక్షితమైన, సంప్రదాయ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్లలో FD ఒకటి. రిస్క్ తీసుకోవడం ఇష్టం లేని ఇన్వెస్టర్లకు ఈ పెట్టుబడి మార్గం ఉత్తమం. ఈ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్‌ను, మన దేశంలో సాధారణ ప్రజల నుంచి సంపన్నుల వరకు దశాబ్దాలుగా ఫాలో అవుతున్నారు. 


మరో ఆసక్తికర కథనం: కీలక రేట్లపై కాసేపట్లో నిర్ణయం, మార్కెట్‌ ఊహాగానాలకు తెర దించనున్న దాస్‌


Join Us on Telegram: https://t.me/abpdesamofficial