RBI Monetary Policy: రిజర్వ్‌ బ్యాంక్‌ రెపో రేటు ఈసారి కూడా మారకపోవచ్చు. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఉదయం 10 గంటల తర్వాత మీడియా ముందుకు వస్తారు. దాస్‌ అధ్యక్షతన ఈ నెల 4-6 తేదీల్లో సమావేశమైన ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (MPC), కీలక రేట్లపై తీసుకున్న నిర్ణయాలను దాస్‌ వెల్లడిస్తారు. 


నాలుగోసారీ యథాతథంగా రెపో రేటు?
ఒక జాతీయ మీడియా విభాగం నిర్వహించిన 25 మంది ఎకనమిస్ట్‌ల పోల్ ప్రకారం, రెపో రేటును 6.50% వద్ద యథాతథంగా ఆర్‌బీఐ ఉంచే అవకాశం ఉంది. ఇదే జరిగితే, రెపో రేటు వరుసగా నాలుగోసారి కూడా 6.50% వద్దే స్థిరంగా కొనసాగుతుంది. 


గత రెండు సంవత్సరాలుగా రెడ్‌ జోన్‌లో ఉన్న ద్రవ్యోల్బణాన్ని కిందికి దించడానికి ప్రపంచంలోని ప్రధాన కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. తాజాగా, భారత్‌లో CPI ద్రవ్యోల్బణం ఊహించిన దాని కంటే మెరుగ్గా ఉంది. జులైలోని గరిష్ట స్థాయి 7.4% నుంచి ఆస్టులో 6.8%కు ఇన్‌ఫ్లేషన్‌ తగ్గింది. అయితే, ఇప్పటికీ RBI టాలరెన్స్ అప్పర్‌ బ్యాండ్‌ 6% కంటే పైనే ఉంది. ద్రవ్యోల్బణం తగ్గుతోంది కాబట్టి, FY25లో రెపో రేటును తగ్గించే అవకాశం ఉందని మార్కెట్‌ ఊహిస్తోంది. 


మొత్తం 25 మంది ఆర్థికవేత్తల్లో 24 మంది, అక్టోబర్ పాలసీ మీటింగ్‌లో రెపో రేటులో ఎలాంటి మార్పు ఉండదని అంచనా వేశారు. ఇండియన్‌ రూపాయి బలహీనత, పెరుగుతున్న ఆహార ద్రవ్యోల్బణం, బాండ్‌ ఈల్డ్స్‌ గ్యాప్‌ను పరిగణనలోకి తీసుకుని 30-50 bps పరిధిలో రేటు పెంపు ఉండొచ్చని ఫిలిప్ క్యాపిటల్ భావిస్తోంది. మొత్తం 25 మంది ఎకనమిస్ట్‌ల సగటు అంచనాల ప్రకారం... 2024-25 Q1 నుంచి 25 bps నుంచి 100 bps రేటు తగ్గించే అవకాశం ఉంది.


ఆందోళన కలిగిస్తున్న ఆహార ద్రవ్యోల్బణం
ఈ ఏడాది ఆగస్తులో CPI ఇన్‌ఫ్లేషన్‌ మార్కెట్లు అంచనా వేసిన దానికంటే చాలా మెరుగ్గా 6.83%కి తగ్గింది. ఆహార ద్రవ్యోల్బణం, ముఖ్యంగా కూరగాయల ధరల్లో భారీ తగ్గుదల కారణంగా ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గింది. అలాగే, కోర్‌ ఇన్‌ఫ్లేషన్‌ మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగా 4.8% వద్ద ఉంది. కూరగాయల ధరలు బాగా తగ్గినప్పటికీ, తృణధాన్యాలు, పప్పుధాన్యాల రేట్లు బాగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.


కూరగాయల ధరలు తగ్గినా తృణధాన్యాలు, పప్పుల ధరలు ఇంకా పెరుగుతూనే ఉండొచ్చన్న అంచనా కూడా మార్కెట్‌లో ఉంది. అసమాన, సరిపోని రుతుపవనాలు పంటల సీజన్‌ను దెబ్బకొట్టడంతో ఆహార ద్రవ్యోల్బణానికి రిస్క్‌ కొనసాగుతోంది. ఇటీవల 1 సంవత్సరాల గరిష్ఠ స్థాయికి చేరుకున్న ముడి చమురు ధరలు ద్రవ్యోల్బణంపై మళ్లీ ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది. కాబట్టి, రెపో రేటును నిర్ణయించేటప్పుడు ఈ విషయాలన్నీ ఆర్‌బీఐ దృష్టిలో ఉంటాయి.


ప్రస్తుతం, RBI రెపో రేటు 6.50% వద్ద ఉంది. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (SDF) రేటు 6.25% వద్దే మారకుండా ఉంది. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF) రేటు, బ్యాంక్ రేటు 6.75% వద్ద ఉన్నాయి. FY24 కోసం CPI ద్రవ్యోల్బణం 5.4%గా ఉంటుందని సెంట్రల్ బ్యాంక్ అంచనా వేయవచ్చు. 


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial