New Tax Regime: 2024-25 ఆర్థిక సంవత్సరం ఈ రోజు (01 ఏప్రిల్‌ 2024) నుంచి ప్రారంభమైంది. క్యాలెండర్‌లో కొత్త నెలకు మారడానికి కేవలం ఒక నిమిషం ముందు, అర్ధరాత్రి సమయంలో, భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్ చేసింది. తద్వారా, సామాజిక మాధ్యమాల్లో అపోహలు రేకెత్తించే పోస్టుల గురించి ప్రజలను హెచ్చరించింది. కొత్త ఆదాయ పన్ను విధానానికి సంబంధించిన తప్పుడు సమాచారం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అలెర్ట్‌ చేసింది. అలాంటి అబద్ధపు పోస్టులను నమ్మొద్దని సూచించింది. 


దేశంలోని పన్ను చెల్లింపుదార్ల (Taxpayers) కోసం 2024 ఏప్రిల్ 01 నుంచి ఎలాంటి కొత్త మార్పులు తీసుకురావడం లేదని, పన్ను విధానంలో కొత్తగా ఏదీ మారలేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో కనిపిస్తున్న తప్పుదారి పట్టించే సమాచారాన్ని నమ్మొద్దని తన ట్వీట్‌లో ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.


సెక్షన్‌ 115BAC(1A) కింద, ప్రస్తుతం ఉన్న పాత పన్ను విధానం స్థానంలో కొత్త పన్ను విధానాన్ని (మినహాయింపులు లేకుండా) ఆర్థిక చట్టం 2023లో ప్రవేశపెట్టారు. 


కొత్త పన్ను విధానం ఫైనాన్షియల్‌ ఇయర్‌ 2023-24 లేదా అసెస్‌మెంట్ ఇయర్‌ 2024-25 నుంచి కంపెనీలు, సంస్థలతో పాటు వ్యక్తులందరికీ (Individuals) డీఫాల్ట్‌గా వర్తిస్తుంది. 


కొత్త పన్ను విధానంలో పన్ను రేట్లు (శ్లాబుల్) చాలా తక్కువగా ఉన్నాయి.  స్టాండర్డ్‌ డిడక్షన్‌ 50,000, ఫ్యామిలీ పెన్షన్‌ 15,000 మినహా.. పాత పన్ను విధానంలో వర్తించే మినహాయింపులు & తగ్గింపుల ప్రయోజనాలేవీ కొత్త పన్ను విధానంలో ఉండవు.


కొత్త పన్ను విధానం డిఫాల్ట్‌గా కనిపిస్తుంది. అయితే, పన్ను చెల్లింపుదార్లు తమకు ప్రయోజనకరమని భావించే పన్ను విధానాన్ని (పాత లేదా కొత్త) ఎంచుకోవచ్చు.


2024-25 అసెస్‌మెంట్ సంవత్సరానికి రిటర్న్ ఫైల్ చేసే వరకు కొత్త పన్ను విధానం నుంచి తప్పుకునే అవకాశం ఉంటుంది. ఎలాంటి వాణిజ్య/ వ్యాపార ఆదాయం లేని అర్హత కలిగిన పన్ను చెల్లింపుదారు, ప్రతి ఆర్థిక సంవత్సరంలో తనకు నచ్చిన పన్ను విధానాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. అంటే, ఒక ఆర్థిక సంవత్సరానికి ITR ఫైల్‌ చేసే సమయంలో కొత్త పన్ను విధానం లేదా మరొక ఏడాది పాత పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు.


సెక్షన్‌ 115BAC(1A) కింద, కొత్త పన్ను విధానంలో ఉన్న పన్ను శ్లాబ్‌లు:


రూ.3 లక్షల ఆదాయం వరకు 0% పన్ను
రూ.3 లక్షల ఒక రూపాయి నుంచి రూ.6 లక్షల ఆదాయం వరకు 5% పన్ను
రూ.6 లక్షల  ఒక రూపాయి నుంచి రూ.9 లక్షల ఆదాయం వరకు 10% పన్ను
రూ.9 లక్షల ఒక రూపాయి నుంచి రూ.12 లక్షల ఆదాయం వరకు 15% పన్ను
రూ.12 లక్షల ఒక రూపాయి నుంచి రూ.15 లక్షల ఆదాయం వరకు 20% పన్ను
రూ.15 లక్షలు దాటిన ఆదాయంపై 30% పన్ను 


పాత పన్ను విధానంలో ఉన్న పన్ను శ్లాబ్‌లు:


రూ.2.5 లక్షల వరకు 0% పన్ను
రూ.2.5 లక్షల ఒక రూపాయి నుంచి రూ.5 లక్షల ఆదాయం వరకు 5% పన్ను
రూ.5 లక్షల ఒక రూపాయి నుంచి రూ.10 లక్షల ఆదాయం వరకు 20% పన్ను
రూ.10 లక్షలు దాటిన ఆదాయంపై 30% పన్ను


2023-24 ఆర్థిక సంవత్సరం లేదా 2024-25 మదింపు సంవత్సరానికి ఈ రోజు నుంచి రిటర్న్‌లు దాఖలు చేయవచ్చు.


మరో ఆసక్తికర కథనం: కొత్త గరిష్టానికి ఎగబాకిన స్వర్ణం, జనానికి ఏడుపొక్కటే తక్కువ