Pension From Anywhere From 01st January 2025: ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ (EPS) కింద పెన్షన్ పొందుతున్న పింఛనుదార్లకు చాలా పెద్ద శుభవార్త. EPS పెన్షనర్‌లు దేశంలోని ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ మూలన ఉన్నా, వారికి సమీపంలో ఏ బ్యాంక్ బ్రాంచ్ నుంచి అయినా పెన్షన్ పొందవచ్చు. ఈ వెసులుబాటు వచ్చే ఏడాది ప్రారంభం (01 జనవరి 2025) నుంచి అందుబాటులోకి వస్తుంది. కేంద్ర కార్మిక & ఉపాధి కల్పన శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఈ శుభవార్తను ప్రకటించారు.


78 లక్షల ఈపీఎస్ పెన్షనర్లకు ప్రయోజనం
దేశంలో ఎక్కడి నుంచైనా, ఏ బ్యాంక్‌ బ్రాంచ్‌ నుంచైనా పింఛను తీసుకునేలా కేంద్ర ప్రభుత్వ తీసుకొస్తున్న మార్పుతో దాదాపు 78 లక్షల మంది ఈపీఎస్ పెన్షనర్లు ప్రయోజనం పొందుతారు. ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ 1995 కోసం "కేంద్రీకృత పింఛను చెల్లింపు వ్యవస్థ" (Centralized Pension Payment System లేదా CPPS)ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, EPF చైర్‌పర్సన్ ఆమోదించినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. జాతీయ స్థాయిలో కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థను రూపొందించడంతో, భారతదేశంలోని ఏ మూలలోనైనా, ఏ బ్యాంకు శాఖ నుంచి అయినా పెన్షనర్లకు పెన్షన్ అందుతుంది. 


తగ్గనున్న పెన్షనర్ల సమస్యలు
ఇదొక చారిత్రాత్మక నిర్ణయమన చెప్పిన కేంద్ర కార్మిక & ఉపాధి మంత్రి, EPFO ఆధునికీకరణలో 'సెంట్రలైజ్డ్‌ పెన్షన్‌ పేమెంట్‌ సిస్టమ్‌'కు లభించిన ఆమోదం ఒక కీలక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. దేశంలో ఎక్కడైనా, ఏ బ్యాంకు బ్రాంచి నుంచి అయినా పెన్షనర్లకు పింఛను ఇవ్వడం వల్ల, వాళ్లు చాలా కాలంగా ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం లభిస్తుంది.


పెన్షన్ పేమెంట్‌ ఆర్డర్ బదిలీ అవసరం ఉండదు
కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థ అమల్లోకి వస్తే, దేశంలో పెన్షన్ పంపిణీ మరింత సులభంగా మారుతుంది. దీని కోసం పెన్షన్ పేమెంట్‌ ఆర్డర్‌ను (PPO) ట్రాన్స్‌ఫర్‌ చేయాల్సిన అవసరం ఉండదు. ఇంతకుముందు, పెన్షనర్లు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి మారినప్పుడు లేదా బ్యాంకులు లేదా బ్యాంక్‌ శాఖలను మార్చినప్పుడు పెన్షన్ పేమెంట్‌ ఆర్డర్‌ను జారీ చేయించుకోవాలి. పదవీ విరమణ తర్వాత సొంత ఊర్లకు వెళ్లే పింఛనుదార్లు లేదా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మారేవారు గతంలో కొంత ఇబ్బంది పడేవాళ్లు. కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థతో ఆ ఇబ్బంది నుంచి పూర్తిగా ఉపశమనం లభిస్తుంది. 


ప్రస్తుతం, EPFO జోనల్‌ లేదా ప్రాంతీయ కార్యాలయాలు కేవలం నాలుగైదు బ్యాంక్‌లతోనే ఒప్పందాలు కలిగి ఉన్నాయి. పింఛనుదార్లు ఈ బ్యాంక్‌ల నుంచే పెన్షన్‌ తీసుకోవాల్సి వచ్చేది. పెన్షన్‌ ప్రారంభ సమయంలో, వ్యక్తిగత దృవీకరణ కోసం బ్యాంక్‌కు వెళ్లాల్సి వచ్చేది. CPPS అమల్లోకి వస్తే, ఇకపై బ్యాంక్‌కు వెళ్లాల్సిన పని కూడా తప్పుతుంది. పెన్షన్‌ రిలీజ్‌ కాగానే, ఆ డబ్బు వెంటనే పెన్షనర్‌ బ్యాంక్‌ అకౌంట్‌లోకి వస్తుంది.


తదుపరి దశలో, కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థలో ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ (Aadhaar based payment system)ను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర మంత్రి మాండవీయ వెల్లడించారు.


మరో ఆసక్తికర కథనం: ఇన్సూరెన్స్‌ పాలసీదారులకు గుడ్ న్యూస్ - ఈ నెలలోనే కేంద్రం కీలక ప్రకటన!