Telugu News: ఈ నెల 09న (09 September 2024) జీఎస్టీ కౌన్సిల్‌ భేటీ జరగనున్న వేళ... జీవిత బీమా పాలసీల ప్రీమియంపై వస్తు & సేవల పన్నును (GST) రద్దు చేయాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. జీఎస్టీ మండలి భేటీలో దీనిపై కీలక నిర్ణయం వెలువడే ఛాన్స్‌ ఉందని సమాచారం. ముఖ్యంగా, టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌లను జీఎస్టీ పరిధి నుంచి తప్పించే అవకాశం ఉంది. జీఎస్టీ మండలిలో కేంద్రం, రాష్ట్రాలు సభ్యులుగా ఉన్నాయి.


ప్రస్తుతం ఆరోగ్య బీమా (Health insurance), టర్మ్‌ ఇన్సూరెన్స్‌పై 18% జీఎస్టీని (GST on term insurance) పాలసీహోల్డర్లు చెల్లిస్తున్నారు.


సాధారణంగా, యూనిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్స్‌ (ULIPs), ఇతర సంప్రదాయ జీవిత బీమా పాలసీలు పొదుపు/ పెట్టుబడులతో ముడిపడి ఉంటాయి. పాలసీ సమయంలో పాలసీదారుకు ఏమీ కాకపోతే, పాలసీహోల్డర్‌ కట్టిన డబ్బుకు పాటు బోనస్‌ వంటి మెచ్యూరిటీ బెనిఫిట్స్‌ కలిపి ఇన్సూరెన్స్‌ కంపెనీ తిరిగి చెల్లిస్తుంది. అంటే, అసలుపై అదనంగా కొంత ప్రతిఫలం లభిస్తుంది. ఈ విధంగా పాలసీహోల్డర్లు ఆదాయం సంపాదిస్తారు కాబట్టి, ఈ తరహా పాలసీలకు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వకపోవచ్చు. 


చవగ్గా మారనున్న టర్మ్‌ ఇన్సూరెన్స్‌లు!
టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు సంప్రదాయ జీవిత బీమా పాలసీలకు కొంత విరుద్ధంగా ఉంటాయి. దీనిలో డెత్‌ బెనిఫిట్‌ తప్ప ఇతర రిటర్న్స్‌ ఉండవు. పాలసీ సమయంలో పాలసీదారుకు ఏమీ కాకపోతే అప్పటి వరకు కట్టిన డబ్బు తిరిగి రాదు. ఈ తరహా పాలసీలు సంపూర్ణంగా జీవిత బీమాకే కట్టుబడి ఉంటాయి, అదనపు ప్రతిఫలం ఇవ్వవు. కాబట్టి, టర్మ్‌ ఇన్సూరెన్స్‌లను జీఎస్‌టీ నుంచి మినహాయించే అవకాశం కనిపిస్తోందని ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి చెప్పినట్లు మనీ కంట్రోల్‌ నివేదించింది. ఒకవేళ ఇదే నిజమై, టర్మ్‌ ఇన్సూరెన్స్‌పై జీఎస్‌టీని పూర్తిగా మినహాయిస్తే, ప్రీమియంలు చవగ్గా మారతాయి. సామాన్య ప్రజలపై కొంతయినా ఆర్థిక భారం తగ్గుతుంది. 


అయితే, ఆరోగ్య బీమా పాలసీలను జీఎస్టీ పరిధి నుంచి మినహాయించకపోవచ్చు.


జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీలసై పన్ను తొలగించాలంటూ కేంద్ర మంత్రి గడ్కరీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌కు ఇటీవల ఒక లేఖ రాశారు. దీంతో, బీమా పాలసీలపై జీఎస్టీ మినహాయించాలంటూ ఎంతోకాలం పరిశ్రమ వర్గాలు చేస్తున్న డిమాండ్లకు బలం దొరికినట్లైంది. నిజానికి, తనకు వచ్చిన ఓ విజ్ఞప్తి గురించి నితిన్‌ గడ్కరీ తన లేఖలో రాశారు. విపక్షాలు మాత్రం ఈ విషయాన్ని గట్టిగా పట్టుకున్నాయి, జీఎస్టీ రద్దు చేయాలన్న డిమాండ్‌తో సోషల్‌ మీడియాను హోరెత్తిస్తున్నాయి. 


లైఫ్‌ ఇన్సూరెన్స్‌, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియంలపై GST తొలగించాలంటూ డిమాండ్లు వినిపిస్తున్న వేళ.. ఆరోగ్య బీమాకు సంబంధించిన ఆసక్తికర లెక్కలను కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్‌కు సమర్పించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 8,262.94 కోట్ల రూపాయలు జీఎస్టీ రూపంలో ఖజానాలోకి వచ్చినట్లు వెల్లడించింది. 2022-23లో రూ.7,638 కోట్లు, 2021-22లో రూ.5,354 కోట్లు వచ్చినట్లు ప్రకటించింది. 


టర్మ్‌ ఇన్సూరెన్స్‌లను జీఎస్‌టీ నుంచి తప్పించడం వల్ల ప్రభుత్వానికి సుమారు రూ.200 కోట్ల మేర ఆదాయం తగ్గే అవకాశం ఉందన్నది విశ్లేషకుల లెక్క. అయితే, పాలసీలు చవగ్గా మారి ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది కాబట్టి, మరింతమంది బీమా పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది.


మరో ఆసక్తికర కథనం: వరద నీళ్లలో కారు మునిగితే ఎంత ఇన్సూరెన్స్‌ వస్తుంది? ఎలా క్లెయిమ్‌ చేయాలి?