Health Insurance Premium: ప్రతి ఒక్కరికి ఆరోగ్య బీమా అవసరం అన్నంతగా కాలం మారింది. అయితే, మన దేశంలో ఇప్పటికీ చాలామంది లేదా చాలా కుటుంబాలు హెల్త్ ఇన్సూరెన్స్‌కు దూరంగా ఉన్నాయి. దీనికి కారణం అధిక ప్రీమియం.
ఆరోగ్య బీమా అంటే కేవలం ఆరోగ్యానికే కాదు, మన ఆర్థిక పరిస్థితికి కూడా చాలా ముఖ్యమైనది. కరోనా తర్వాత దీని ప్రాముఖ్యత మరింత పెరిగింది. వాస్తవానికి ఫిట్‌నెస్ - హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంది. మీ ఆరోగ్యమే మీ డిస్కౌంట్ కూపన్.
ప్రీమియం తగ్గింపు ఫార్ములా
ఒక వ్యక్తి వయస్సు, ఆరోగ్య చరిత్ర, BMI (Body mass index), దైనందిన అలవాట్లు (స్మోకింగ్, డ్రింకింగ్) వంటి అనేక అంశాల ఆధారంగా బీమా కంపెనీలు ప్రీమియంను నిర్ణయిస్తాయి. మీరు ఫిట్‌గా ఉండటానికి వ్యాయామం చేస్తే, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే, అనారోగ్యకర అలవాట్లకు దూరంగా ఉంటే, ఆసుపత్రి పాలయ్యే అవకాశాలు తగ్గుతాయి. అప్పుడు, ఆరోగ్య బీమా క్లెయిమ్ చేసే అవకాశం కూడా తగ్గుతుంది. ఇలాంటి వాళ్లకు తక్కువ ప్రీమియంకు పాలసీలను అమ్ముతాయి బీమా కంపెనీలు.
BMI ఒక ముఖ్యమైన అంశం
బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఊబకాయాన్ని తనిఖీ చేయడానికి ప్రజలు ఉపయోగించే ఒక పద్ధతి. శరీర పొడవుకు తగ్గట్లుగా బరువు ఉందో, లేదో ఇది చెబుతుంది. BMI 18.5 నుంచి 24.9 మధ్య ఉంటే సాధారణ బరువు ఉన్నట్లు లెక్క. 18.5 కంటే తక్కువ BMI అంటే తక్కువ బరువుతో ఉన్నారని అర్ధం. BMI 25 నుంచి 29.9 మధ్య ఉండటం అంటే అధిక బరువుతో ఉన్నారని, BMI 30 కంటే ఎక్కువ ఉంటే ఊబకాయంతో ఉన్నారని అర్ధం. ఆన్‌లైన్‌లో కనిపించే BMI కాలిక్యులేటర్ సాయంతో, మీరు కూడా మీ స్కోర్‌ను తనిఖీ చేసుకోవచ్చు.
అధిక బరువు లేదా ఊబకాయం ఉన్నవారి విషయంలో బీమా కంపెనీలు జాగ్రత్తగా ఉంటాయి. ఎందుకంటే, ఎక్కువ BMI స్కోర్ ఉన్నవారికి బీపీ, షుగర్, గుండె సంబంధిత సమస్యలు వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అంటువంటి వాళ్లు ఆరోగ్య బీమాను క్లెయిమ్ చేసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. బీమా కంపెనీలు, సాధారణ BMI ఉన్న వారి కంటే అధిక BMI ఉన్న వ్యక్తుల నుంచి అధిక ప్రీమియంలను వసూలు చేయడానికి ఇదే కారణం.
ఫిట్‌గా ఉంటే బోలెడన్ని రివార్డ్స్
ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI), ఆరోగ్య బీమా రంగంలో వెల్‌నెస్ & ఫిట్‌నెస్‌ను ప్రోత్సహించడానికి గైడ్‌లైన్స్ జారీ చేసింది. ఆ మార్గదర్శకాల ప్రకారం, ఆరోగ్యవంతమైన అలవాట్లు, శారీరక వ్యాయామం చేసే పాలసీదార్లకు బీమా కంపెనీలు రివార్డ్ పాయింట్లు ఇవ్వవచ్చు. ఇది కాకుండా, డిస్కౌంట్ కూపన్స్, హెల్త్ చెకప్, డయాగ్నసిస్ వంటి ఆఫర్స్ కూడా అందించవచ్చు.
ఫిట్‌నెస్‌ను ప్రోత్సహించడానికి, బీమా కంపెనీలు వాటి హెల్త్ పాలసీలకు కొత్త కొత్త ఫీచర్‌లను జోడిస్తున్నాయి. వాని ద్వారా ప్రజలు ఫిట్‌నెస్ యాక్టివిటీస్‌తో కనెక్ట్ అవుతారు. మీరు ఎంత ఫిట్‌గా ఉంటే అన్ని ఎక్కువ రివార్డ్స్ గెలుచుకుంటారు. వాటితో ప్రీమియం తగ్గించుకోవడం, జిమ్‌లో మెంబర్‌షిప్, పాలసీ రెన్యువల్ సమయంలో డిస్కౌంట్ లేదా పాలసీ మొత్తం పెంచుకోవడం వంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.
ఉదాహరణకు... ఒక పాలసీదారు ప్రతిరోజూ 10,000 అడుగుల చొప్పున ఏడాది పాటు నడవడం వంటి టాస్క్‌లను కంప్లీట్ చేస్తే, కొన్ని బీమా కంపెనీలు కొత్త ఏడాది ప్రీమియంపై 100 శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నాయి. ఫిట్‌నెస్ బ్యాండ్స్ లేదా మొబైల్ యాప్ వంటి స్మార్ట్‌వేర్ డివైజ్‌ల ద్వారా ఫిట్‌నెస్ రికార్డ్‌లు దాచుకోవచ్చు. వివిధ బీమా కంపెనీల రివార్డ్ పాలసీలు వేర్వేరుగా ఉంటాయని గుర్తుంచుకోండి. ఇవి పాలసీదారుడి రిస్క్ ప్రొఫైల్‌పై కూడా ఆధారపడి ఉంటాయి.
మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ: వీక్ మార్కెట్‌లోనూ వండ్రఫుల్ ర్యాలీ, షేక్ చేసిన టోరెంట్ ఫార్మా