Health Insurance Rules: కరోనా టైమ్‌లో ఆస్పత్రి బిల్లులు కట్టలేక జనం బెంబేలెత్తారు. ఆ తర్వాత నుంచి మన దేశంలో జీవిత బీమా (Life Insurance), ఆరోగ్య బీమా (Health Insurance) పాలసీలకు ప్రాధాన్యత పెరిగింది. అయితే, లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు తీసుకున్నంత వేగంగా, ఎక్కువగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం లేదు. ఇప్పటికీ, కోట్లాది మందికి హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండానే గడిపేస్తున్నారు.
"నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నా ఆరోగ్యానికి మరో పదేళ్ల వరకు గ్యారెంటీ ఉంది, ఇప్పుడు పాలసీ తీసుకుని డబ్బు వృథా చేయడం ఎందుకు?" చాలా మంది ఆరోగ్య బీమా తీసుకోకపోవడానికి ఇవే కారణాలు.
ఒకవైపు వైద్య ద్రవ్యోల్బణం (Medical inflation) పెరుగుతోంది. ఆసుపత్రి పాలైతే, బిల్లులు కట్టడానికి ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది. హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటే, మీరు మానసికంగా, ఆర్థికంగా సేఫ్ సైడ్‌లో ఉంటారు. ఒకవిధంగా చూస్తే... హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అంటే డబ్బు ఆదా చేయడమే.
ఆరోగ్య బీమా తీసుకునే సమయంలో, పాలసీ నిబంధనలు & షరతులను (Terms & Conditions of Policy) నిశితంగా చదివి, అర్ధం చేసుకోవాలి. లేకపోతే, క్లెయిమ్ సమయంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది.
కో-పేమెంట్, డిడక్టబుల్ అంటే ఏంటి?
ఆరోగ్య బీమా ప్లాన్‌లో.. కో-పేమెంట్, డిడక్టబుల్ రూల్స్ ఉంటాయి.
కో-పేమెంట్ అంటే, పాలసీహోల్డర్ కచ్చితంగా చెల్లించాల్సిన డబ్బు. ఆసుపత్రి బిల్లులో ఎంత మొత్తం/శాతాన్ని పాలసీహోల్డర్ చెల్లించాలో కో-పేమెంట్ నిర్ణయిస్తుంది. పాలసీ క్లెయిమ్ సమయంలో, బిల్లులో నిర్ణీత మొత్తం/శాతాన్ని పాలసీదారు భరిస్తే, మిగిలిన డబ్బును బీమా కంపెనీ కడుతుంది. కో-పేమెంట్ మొత్తం/శాతాన్ని పాలసీహోల్డర్ నిర్ణయించుకోవచ్చు. దానిని బట్టి ప్రీమియం మారుతుంది. ఇది తప్ప మిగిలిన టర్మ్స్ &కండిషన్స్ మారవు.
ఎక్కువ కో-పేమెంట్ పెట్టుకుంటే, కట్టాల్సిన ప్రీమియం తగ్గుతుంది. తక్కువ కో-పేమెంట్ పెట్టుకుంటే ప్రీమియం పెరుగుతుంది. ప్రీమియం తగ్గుతుంది కదాని తక్కువ కో-పేమెంట్‌కు వెళితే, ఆసుపత్రిలో చేరిన సమయంలో పాలసీదారు ఎక్కువ డబ్బును చేతి నుంచి పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి, తక్కువ కో-పేమెంట్ ఆప్షన్ తీసుకోవడం బెటర్.
డిడక్టబుల్ అంటే, మొత్తం వైద్య ఖర్చులో కొంత మొత్తాన్ని పాలసీహోల్డర్ భరించాలి. ఆ తర్వాతే బీమా పాలసీ వర్తిస్తుంది. అంటే, ఆస్పత్రి బిల్లు పాలసీహోల్డర్ కట్టాల్సిన నిర్ణీత మొత్తాన్ని దాటితేనే ఆ పాలసీ అమల్లోకి వస్తుంది. డిడక్టబుల్ ఎంత ఉండాలన్న విషయాన్ని పాలసీదారు నిర్ణయించుకోవచ్చు లేదా కంపెనీ నిర్ణయిస్తుంది. తక్కువ డిడక్టబుల్‌కు ఎక్కువ ప్రీమియం చెల్లించాలి, ఎక్కువ డిడక్టబుల్ పెట్టుకుంటే తక్కువ ప్రీమియం కట్టాలి.
కో-పేమెంట్ తరహాలోనే తక్కువ డిడక్టబుల్ నిర్ణయించుకోవడం మంచిది. లేదంటే ఆసుపత్రిలో చేరాక మీ చేతి నుంచి ఎక్కువ డబ్బు కట్టాల్సి ఉంటుంది.
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకునేటప్పుడు, మీకు డౌట్ ఉన్న/అర్ధం కాని ప్రతి విషయాన్ని కంపెనీ ప్రతినిధిని అడిగి తెలుసుకోండి. మీ ఆరోగ్యం, అలవాట్ల గురించి ఏ ఒక్క విషయాన్నీ దాచకుండా బీమా కంపెనీకి చెప్పండి. అప్పుడే, ఎలాంటి చిక్కులు లేకుండా క్లెయిమ్ చేసుకోవడం (Claiming) సాధ్యపడుతుంది.
మరో ఆసక్తికర కథనం: జియో ఫిన్‌కు లార్జ్ క్యాప్, టాటా టెక్‌కు మిడ్ క్యాప్ - ఈ కంపెనీలకు కూడా ప్రమోషన్