Diwali 2024 Top Stock Picks: ఈ వారం భారతీయ స్టాక్ మార్కెట్‌కు చాలా ప్రత్యేకమైనది. ఈ వారంలో, 01 నవంబర్ 2024న స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ముహూరత్‌ ట్రేడింగ్ జరుగుతుంది. హిందూ క్యాలెండర్‌ ప్రకారం, ఆ రోజు నుంచి సంవత్ 2081 (సంవత్సరం 2081) ప్రారంభం అవుతుంది, 2025లో వచ్చే దీపావళితో ముగుస్తుంది. ముహూరత్‌ ట్రేడ్‌లో షేర్లు కొనడం స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్లు, ట్రేడర్లకు సెంటిమెంట్‌గా కొనసాగుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, సంవత్ 2081 & ముహూరత్‌ ట్రేడ్‌ కోసం హాట్‌ షేర్ల లిస్ట్‌ను విడుదల చేసింది. ఇవి, ఏడాది కాలంలోనే పెట్టుబడిదార్లకు బలమైన రాబడిని అందించగలవని బ్రోకింగ్‌ కంపెనీ గట్టిగా నమ్ముతోంది. 


ఏంజెల్ వన్ (Angel One) - ఇది సంవత్ 2081లో 43 శాతం రాబడిని ఇస్తుందని మోతీలాల్ ఓస్వాల్ చెబుతోంది. రూ.4100 టార్గెట్‌ ప్రైస్‌తో ఈ స్టాక్‌ను కొనుగోలు చేయాలని బ్రోకరేజ్ హౌస్ సూచించింది. 


జొమాటో (Zomato) - ఈ స్టాక్ కూడా స్టాక్‌ మార్కెట్‌ షాపింగ్ లిస్ట్‌లోకి చేరింది. మోతీలాల్ ఓస్వాల్ జొమాటో షేర్లను రూ.330 ప్రైస్‌ టార్గెట్‌ లేదా 30 శాతం అప్‌సైడ్‌ను దృష్టిలో పెట్టుకుని కొనలచ్చని సలహా ఇచ్చింది.


టైటన్‌ (Titan) - మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిస్ట్‌లో ఉన్న టైటన్‌ స్టాక్‌ను రూ. 4300 లేదా 29 శాతం వృద్ధి అంచనాలతో కొనుగోలు చేయాలని బ్రోకింగ్‌ హౌస్‌ సిఫార్సు చేసింది.


హెచ్‌చ్‌ఎల్‌ టెక్ (HCL Tech) - ఐటీ ఇండస్ట్రీకి చెందిన ఈ స్టాక్‌పై బ్రోకరేజ్ హౌస్ చాలా సానుకూలంగా ఉంది. ఈ దిగ్గజ ఐటీ స్టాక్‌ను రూ. 2300 టార్గెట్ ధర లేదా 25 శాతం అప్‌సైడ్‌ కోసం బయ్‌ చేయాలని సూచించింది. 


లార్సెన్ & టూబ్రో (L&T) - ఈ కంపెనీ షేర్లను రూ. 4250 టార్గెట్ ధరతో లేదా 23 శాతం పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని పోర్ట్‌ఫోలియోలో చేర్చమని సలహా ఇచ్చింది. 


ఇప్కా ల్యాబొరేటరీస్ ‍(IPCA Laboratorie) - ఫార్మా కంపెనీ ఐపీసీఏ ల్యాబొరేటరీస్ స్టాక్‌ను 23 శాతం అప్‌సైడ్ లేదా రూ. 1950 టార్గెట్‌తో కొనొచ్చంటూ మోతీలాల్‌ ఓస్వాల్‌ బయ్‌ రేటింగ్‌ ఇచ్చింది.


అంబర్ ఎంటర్‌ప్రైజెస్ (Amber Enterprises) - సంవత్ 2081 టాప్‌ పిక్స్‌ లిస్ట్‌లో అంబర్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ షేర్లను కూడా మోతీలాల్ ఓస్వాల్ చేర్చింది. టార్గెట్ ధరను రూ. 7350గా చెప్పింది. ఈ స్టాక్‌ ప్రస్తుత స్థాయి నుంచి 18 శాతం ర్యాలీ చేస్తుందని ఈ టార్గెట్‌ ప్రైస్‌ అర్ధం. 


ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) - బ్యాంకింగ్‌ రంగంలో ఆకర్షణీయంగా ఉన్న ఈ స్టాక్‌ను రూ. 1400 టార్గెట్‌ లేదా 12 శాతానికి అప్‌సైడ్‌ కోసం కొనుగోలు చేయొచ్చట. 


జెన్ టెక్నాలజీస్ (Zen Technologies) - ఈ కంపెనీ షేర్లు ఏడాదిలోగా 8 శాతం ర్యాలీ చేస్తాయి లేదా రూ. 1900 స్థాయికి చేరుకుంటాయని చెప్పిన మోతీలాల్‌ ఓస్వాల్‌, ఈ స్టాక్‌కు బయ్‌ రేటింగ్‌ సిఫార్సు చేసింది. 


అద్భుతంగా గడిచిన 'సంవత్ 2080' 
ఈ దీపావళితో (Diwali 2024) ముగియనున్న సంవత్ 2080 భారతీయ స్టాక్ మార్కెట్‌లో చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది. నిఫ్టీ50 ఇండెక్స్‌ 24 సెప్టెంబర్ 2024న రికార్డు గరిష్ట స్థాయి 26,277ను తాకింది. ఈ ఇండెక్స్‌ 14 నవంబర్ 2023 నుంచి 24 అక్టోబర్ 2024 వరకు, సంవత్ 2080లో 26 శాతం రాబడిని ఇచ్చింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 38 శాతం పెరిగితే, నిఫ్టీ స్మాల్ క్యాప్ 37 శాతం వృద్ధి చెందింది. కార్పొరేట్ల మెరుగైన ఆర్థిక పనితీరు, రాజకీయ స్థిరత్వం, FIIల పెట్టుబడులు పెరగడం, ప్రపంచ సవాళ్లను అధిగమించడం వంటివి స్టాక్ మార్కెట్‌లో ఈ బలమైన పెరుగుదలకు కారణంగా చెప్పవచ్చు. ద్రవ్యోల్బణం తగ్గడం, కీలకమైన ప్రపంచ కేంద్ర బ్యాంక్‌లు వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాల నుంచి కూడా మార్కెట్‌ లబ్ధి పొందింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: ధన్‌తేరస్‌ గోల్డ్‌ షాపింగ్‌లో ఈ ఒక్కటీ చూడకపోతే మీ పని సున్నా!