Gold Purchase Tips: ఐదు రోజుల దీపావళి వేడుకల్లో మొదటి రోజున వస్తుంది "ధన్‌తేరస్ లేదా ధనత్రయోదశి" పండుగ. ఈ రోజు (మంగళవారం, 29 అక్టోబర్ 2024), ధనత్రయోదశిని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.హిందూ సంప్రదాయంలో.. ధనత్రయోదశి నాడు బంగారం, వెండి కొనుగోలు చేయడం ఆచారంగా వస్తోంది. ఇవి మాత్రమే కాదు... వంటగది సామగ్రి, ఎలక్ట్రానిక్ వస్తువులు, వాహనాలను కూడా ధన్‌తేరస్ సందర్భంగా ప్రజలు కొంటున్నారు. ఈ రోజున, దేశంలో వేల కోట్ల రూపాయల విలువైన వస్తువుల కొనుగోళ్లు - అమ్మకాలు జరుగుతాయి. ఇదే అదనుగా మోసగాళ్లు కూడా పేట్రేగిపోతుంటారు. ఈ రోజు, మీరు కూడా బంగారం లేదా వెండి వస్తువులను కొనుగోలు చేయబోతున్నట్లయితే, కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. తద్వారా నకిలీ లేదా నాణ్యత లేని ఆభరణాలు లేదా ఇతర నాసిరకం వస్తువులను కొనుగోలు చేయకుండా సేఫ్ సైడ్‌లో ఉంటారు.
BIS హాల్‌మార్క్ ఉండాలి
బంగారాన్ని కొనుగోలు చేసేటప్పుడు, ఆ నగపై BIS హాల్‌మార్క్ ఉందా, లేదా అనేది తప్పనిసరిగా చెక్ చేయాలి. ఎందుకంటే, ఆభరణాల స్వచ్ఛత విషయంలో 6 అంకెలతో (6-digit Alphanumeric HUID code) కూడిన హాల్‌మార్కింగ్ మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఏప్రిల్ 2023 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) గుర్తు కూడా ఆ నగపై ఉండాలి.
బంగారం స్వచ్ఛత
బంగారం స్వచ్ఛత చాలా కీలకమైన విషయాల్లో ఒకటి. బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో కొలుస్తారు. బంగారం అత్యధిక స్వచ్ఛత ప్రమాణం 24 క్యారెట్ (24K). ఇది 99.99% స్వచ్ఛమైన బంగారం, దీనిలో ఇతర లోహాల కల్తీ ఉండదు. అయితే, 24 కేరెట్ల బంగారంలో మెత్తదనం కారణంగా ఆభరణాలు తయారు చేయడం కష్టం. కాబట్టి, 22 క్యారెట్ల (22K) బంగారాన్ని నగల తయారీ కోసం ఉపయోగిస్తారు. దీనిలో 91.67% గోల్డ్ ఉంటుంది, మిగిలిన మొత్తంలో వెండి లేదా రాగి మిశ్రమం ఉంటుంది. 22K గోల్డ్‌ను 916 గోల్డ్ అని కూడా పిలుస్తారు. వీటితోపాటు 18K, 16K, 14K ఆభరణాలు కూడా మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. కేరెట్ల తగ్గే కొద్దీ బంగారం స్వచ్ఛత తగ్గుతుంది.
మేకింగ్ ఛార్జీలు
మీరు బంగారు నాణెం, బిస్కెట్ లేదా బార్ కొనుగోలు చేస్తే మేకింగ్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే మాత్రమే మేకింగ్ ఛార్జీలు చెల్లించాలి. మేకింగ్ ఛార్జీల మొత్తం నగ డిజైన్‌ను బట్టి, ఆభరణాల వ్యాపారిని బట్టి మారుతూ ఉంటుంది. తక్కువ మేకింగ్ ఛార్జీలు లేదా జీరో మేకింగ్ ఛార్జీలు ఉన్న దగ్గర నగలు కొంటే మీకు డబ్బు మిగులుతుంది.
బంగారాన్ని మీరే పరీక్షించుకోవచ్చు
మీ నగపై ఉన్న ఆరు అంకెల బీఐఎస్ 'హాల్‌మార్క్ యూనిట్ ఐడెంటిఫికేషన్ నంబర్' (HUID)ను "బీఐఎస్ కేర్ యాప్" (BIS Care App)లో ఎంటర్ చేస్తే చాలు. మీ దగ్గర ఉన్న నగ స్వచ్ఛత వివరాలన్నీ మీ కళ్ల ముందు ప్రత్యక్షం అవుతాయి.
మరో ఆసక్తికర కథనం: ధన్‌తేరస్ ఫీవర్‌తో ధనాధన్ పెరిగిన పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ