Gold-Silver Prices Today 29 Oct: ఈ రోజు (2024 అక్టోబర్ 29, మంగళవారం) ధనత్రయోదశి పండుగ. ఉత్తరాది ప్రజలు ధన్‌తేరస్‌గా పిలుస్తారు. మన దేశంలో, బంగారం కొనుగోళ్లు లేదా పెట్టుబడులకు ఈ పండుగ ప్రసిద్ధి చెందింది. ధనత్రయోదశి నాడు బంగారంతో పాటు వెండిని కూడా ప్రజలు కొంటారు. ధన్‌తేరస్ సందర్భంగా, 'బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్' (Bureau of Indian Standards) ప్రజలకు ఒక సూచన జారీ చేసింది. హాల్‌మార్క్ ఉన్న బంగారం, వెండిని మాత్రమే కొనుగోలు చేయాలని వినియోగదారులకు విజ్ఞప్తి చేసింది. బంగారం, వెండి కొనుగోలు చేసేటప్పుడు వినియోగదార్లు మరింత జాగ్రత్తగా ఉండాలని బీఐఎస్ సూచించింది.
'కేంద్ర వినియోగదార్ల వ్యవహారాల మంత్రిత్వ శాఖ' (Ministry of Consumer Affairs, Food & Public Distribution) ఆధ్వర్యంలో 'బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్' (BIS) పని చేస్తుంది.
పసిడిలో పెట్టుబడులకు ధనత్రయోదశి పండుగ ఒక మంచి సెంటిమెంట్. తరతరాలుగా భారతీయుల్లో సాంప్రదాయకంగా వస్తున్న ఆచారం ఇది. బంగారంలో పెట్టుబడి పెట్టి అదృష్టం, సంపద, ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రార్థించే సందర్భం ఇది. ధన్‌తేరస్ నాడు పసిడి క్రయవిక్రయాలు విపరీతంగా జరుగుతాయి కాబట్టి మోసాలకు కూడా ఆస్కారం ఏర్పడుతుంది. హాల్‌మార్క్ ఉన్న బంగారం & వెండి ఆభరణాలను మాత్రమే కొనుగోలు చేయడం ద్వారా ఈ మోసాలను అడ్డుకోవచ్చంటూ BIS వినియోగదారుల్లో అవగాహన పెంచుతోంది. మీరు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా, హాల్‌మార్కింగ్ లేని పిచ్చి నగలను కొనాల్సివస్తుంది తస్మాత్ జాగ్రత్త.
హాల్‌మార్కింగ్‌లో 3 భాగాలు
బంగారు ఆభరణాల్లో హాల్‌మార్కింగ్ 3 భాగాలుగా ఉంటుంది. అవి - బీఐఎస్ స్టాండర్డ్ మార్క్ (BIS Standard Mark), క్యారెట్లలో బంగారం స్వచ్ఛత & సున్నితత్వం (Purity of Gold in carats & fineness), 6 అంకెల ఆల్ఫాన్యూమరిక్ HUID కోడ్ (6-digit Alphanumeric HUID code).
"ధన్‌తేరస్ సమయంలోనైనా, ఆ తర్వాత ఎప్పుడైనా కూడా BIS HUID ఆధారిత హాల్‌మార్క్ ఉన్న నగలనే ప్రజలు కొనాలి, స్వచ్ఛతకు హామీ ఇచ్చే అలాంటి పసిడిలోనే పెట్టుబడులు పెట్టాలి. బీఐఎస్ హాల్‌మార్క్ & బీఐఎస్ కేర్ యాప్‌తో హాల్‌మార్క్ ఉన్న ఆభరణాల స్వచ్ఛతను సులభంగా తనిఖీ చేయవచ్చు. దీని కోసం, మీరు బీఐఎస్ కేర్ యాప్‌లో (BIS Care App) 'Verify HUID' సెక్షన్‌లోకి వెళ్లి మీ ఆభరణంపై ఉన్న HUID నంబర్‌ను ఎంటర్ చేయాలి. అప్పుడు మీ నగ స్వచ్ఛత వివరాలన్నీ అక్కడ కనిపిస్తాయి" - BIS డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ తివారీ
నామమాత్రపు ఫీజ్‌తో స్వచ్ఛత తనిఖీ
బంగారు ఆభరణాల హాల్‌మార్కింగ్‌ను చెక్ చేయడానికి, ఒక్కో ఆర్టికల్‌కు కేవలం రూ.45 + ప్రత్యేక పన్ను చెల్లిస్తే చాలు. కేవలం రూ.200 టెస్టింగ్ ఛార్జీతో, వినియోగదారులు ఏదైనా BIS గుర్తింపు పొందిన AHC (Assaying and Hallmarking Centres)లో హాల్‌మార్క్ ఉన్న ఆభరణాలను పరీక్షించుకోవచ్చు.
2021 జూన్ 23 నుంచి భారతదేశంలోని 256 జిల్లాల్లో గోల్డ్ హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేశారు.
మరో ఆసక్తికర కథనం: ధన్‌తేరస్ ఫీవర్‌తో ధనాధన్ పెరిగిన పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ