Debit, Credit card rule change:  డిజిటలైజేషన్‌ పుణ్యామా అని బ్యాంకింగ్‌ లావాదేవీల తీరుతెన్నులే మారిపోయాయి. గతంలో నగదు బదిలీ చేయాలన్నా, ఇతరులకు డబ్బులు చెల్లించాలన్నా బ్యాంకులకు వెళ్లి గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. డిజిటల్‌ లావాదేవీల వల్ల ఇప్పుడా పని సులువైపోయింది. ఈ-కామర్స్‌ వెబ్‌సైట్ల నుంచి సాధారణ దుకాణాల్లోనూ కస్టమర్లు ఆన్‌లైన్‌ పేమెంట్‌ చేసేస్తున్నారు. అలాగే డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల వినియోగం పెరిగింది. తాజాగా వీటి వాడకంలో రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మార్పులు తెస్తోంది. 2022, జులై 1 నుంచే కొత్త నిబంధనలు అమలు చేస్తోంది.


ముగిసిన టోకెనైజేషన్‌ గడువు


వచ్చే నెల నుంచి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు డెబిట్‌, క్రెడిట్‌ కార్డు టోకెనైజేషన్‌ను అమలు చేయాల్సి ఉంటుంది. గతేడాది నుంచీ ఆర్బీఐ, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఈ ఫ్రేమ్‌వర్క్‌పై కసరత్తు చేస్తున్నాయి. జనవరి 1 నుంచే అమలు చేయాల్సి ఉండగా బ్యాంకుల కోరిక మేరకు మరో ఆరు నెలలు గడువు పొడగించారు. ఇప్పుడది పూర్తవ్వడంతో కొత్త రూల్స్‌ అమల్లోకి రాబోతున్నాయి.


నోటిఫికేషన్‌ జారీ


టోకెనైజేషన్‌ అమలు గురించి 2020, మార్చి 17న ఆర్‌బీఐ మర్చంట్స్‌, బ్యాంకులకు తెలియజేసింది. ఇందుకు సంబంధించి గతేడాది డిసెంబర్‌ 23న కొత్త నోటిఫికేషన్‌ జారీ చేసింది. '2022, జూన్‌ 30 నుంచి క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల సమాచారం భద్రపరచడాన్ని నిషేధిస్తున్నాం. పేమెంట్‌ అగ్రిగేటర్లు, పేమెంట్‌ గేట్‌వేలు, నాన్‌ బ్యాంక్‌ పేమెంట్‌ అగ్రిగేటర్లు, మర్చంట్స్‌కు మార్గదర్శకాలు జారీ చేస్తున్నాం. పరిశ్రమలోని భాగస్వాముల విజ్ఞప్తి మేరకు తుది గడువును 2021, డిసెంబర్‌ 31 నుంచి పొడగిస్తున్నాం' అని ఆర్‌బీఐ పేర్కొంది.


టోకెనైజేషన్‌ ఏంటి? 


మీరు లావాదేవీలు చేపట్టేటప్పుడు డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డు వివరాలను నమోదు చేస్తుంటారు. కార్డు మీదున్న 16 అంకెలు, కార్డు ఎక్స్‌పైరీ డేట్‌, సీవీవీ, ఓటీపీ, పిన్‌ వివరాలు ఎంటర్‌ చేస్తుంటారు. అవన్నీ సరిగ్గా ఉంటేనే లావాదేవీ చెల్లుతుంది. ఈ ప్రకియనంతా ఇకపై టోకెనైజేషన్‌ భర్తీ చేస్తుంది. ఇందుకు మీ కార్డు వివరాలు నమోదు చేయాల్సిన అవసరం లేదు. బదులుగా మీ కార్డుకు సంబంధించిన టోకెన్‌ను నమోదు చేస్తే చాలు.


కార్డులు టోకెనైజ్ ఎలా?


మొదట కస్టమర్లు తమ కార్డులను టోకెన్ రిక్వెస్టర్ అందించే ఒక ప్రత్యేక యాప్ ద్వారా టోకెనైజ్ చేసుకోవాలి. ఈ టోకెన్ రిక్వెస్టర్ వినియోగదారుడి అభ్యర్థనను కార్డ్ నెట్‌వర్క్‌కు పంపుతుంది. కార్డు జారీచేసిన సంస్థ అనుమతితో ఆఖర్లో టోకెన్‌ జారీ అవుతుంది. కాంటాక్ట్‌లెస్ కార్డు లావాదేవీలు, క్యూఆర్ కోడ్‌లు, యాప్‌ల ద్వారా చెల్లింపులకు టోకెనైజేషన్‌ను అనుమతించారు. వీసా, మాస్టర్ కార్డ్ లాంటి కంపెనీలు టోకెన్ సర్వీస్ ప్రొవైడర్లుగా (టీఎస్‌పీ) వ్యవహరిస్తాయి. ఇవి మొబైల్ చెల్లింపులు లేదా ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌కు టోకెన్‌లను అందిస్తాయి.