Multibagger stock 2022 EKI Energy share gives 70 lakh retruns for 1 lakh in a year : చాలామంది ఈక్విటీ మార్కెట్లను జూదం అనుకుంటారు! సెంటిమెంటుతో నడుస్తాయని తప్పుడు భావనతో ఉంటారు. ఒకరో ఇద్దరో లాభపడతారు తప్ప మిగతా వాళ్లంతా నష్టపోతారని ఫీలవుతారు. అదే సమయంలో తమ డబ్బుకు తగిన రాబడినిచ్చేది స్టాక్‌ మార్కెటేనని మరికొందరు భావిస్తారు. మంచి కంపెనీలు, ఫండమెంటల్‌గా బలంగా ఉన్న షేర్లలో పెట్టుబడి పెట్టి కోట్లు ఆర్జిస్తుంటారు. ఆ మల్టీబ్యాగర్‌ షేర్లను చూసి మురిసిపోతారు. ఈకేఐ ఎనర్జీ షేరు (EKI Energy) అలాంటిదే.


6900% పెరిగిన EKI Energy


ఈకేఐ ఎనర్జీ సర్వీసెస్‌ 2021, మార్చిలో పబ్లిక్‌ ఇష్యూకు వచ్చింది. రూ.102 ధరకు షేర్లను ఆఫర్ చేసింది. 2021, ఏప్రిల్‌ 7న బీఎస్‌ఈలో రూ.140 ప్రీమియంతో నమోదయ్యాయి. ఇన్వెస్టర్లకు అదే రోజు 37 శాతం లాభాన్ని అందించాయి. అప్పట్నుంచి ఈ షేరు తగ్గేదే లే! అన్నట్టుగా పైపైకి ఎగిసింది. ప్రస్తుతం రూ.7,200కు చేరుకుంది. ఇష్యూ ధరతో పోలిస్తే 6,900 శాతం ర్యాలీ అయింది. ఇన్వెస్టర్లకు బంఫర్‌ ప్రాఫిట్‌ను ఇచ్చింది.


EKI Energy హిస్టరీ


తొలిరోజే 37 శాతం లాభం అందించిన ఈకేఐ ఎనర్జీ షేరు అదే ఊపులో పెరిగింది. 2022, జనవరిలో జీవితకాల గరిష్ఠమైన రూ.12,599కి చేరుకుంది. ఆ తర్వాత కన్సాలిడేషన్‌కు గురైంది. చివరి నెలలో 6 శాతం తగ్గింది. జనవరి నుంచి ఇప్పటి వరకు 30 శాతం నష్టపోయింది. ఇక చివరి 6 నెలల్లో రూ.5450 నుంచి రూ.7,200కు పెరిగింది. అంటే 32 శాతం ర్యాలీ అయింది. మొత్తంగా ఇష్యూ నుంచి ఏడాది కాలంలో రూ.102 నుంచి రూ.7200కు వచ్చింది. 


EKI Energy రూ.70 లక్షల లాభం


ఈకేఐ ఎనర్జీ షేర్లలో నెల రోజుల క్రితం లక్ష రూపాయలు ఇన్వెస్ట్‌ చేసుకుంటే ఇప్పుడవి రూ.94,000 అయ్యేవి. జనవరి నుంచి అయితే రూ.70,000కు తగ్గేది. అదే 6 నెలల క్రితం లక్ష పెట్టుంటే రూ.1.32 లక్షలు అందించేది. ఇష్యూ ధర నుంచి హోల్డ్‌ చేసుంటే జస్ట్‌ ఏడాది కాలంలోనే రూ.లక్షకు రూ.70 లక్షలు చేతికి వచ్చేవి. జీవితకాల గరిష్ఠ ధర వద్ద అమ్మేసుకుంటే ఏకంగా రూ.86 లక్షలకు పైగా రాబడి వచ్చేది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌లో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.