Gpay Account Multiple IDs: యునిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌. సింపుల్‌గా యూపీఐ (UPI). భారత ఆర్థిక వ్యవస్థను డిజిటల్‌ వైపు నడిపించిన వ్యవస్థ. ప్రస్తుతం దేశంలో ఆన్‌లైన్‌ లావాదేవీల్లో ఎక్కువ శాతం యూపీఐ ఆధారంగానే జరుగుతున్నాయి. నగదు బదిలీ (Cash Transfer), చెల్లింపుల పరంగా ఇంతకన్నా హిట్టైన వ్యవస్థ మరొకటి లేదు. పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు గూగుల్‌ పేలో (Google Pay) ఎక్కువగా యూపీఐ పేమెంట్లే జరిగాయి. ఎందుకంటే సింపుల్‌గా ఒక ఐడీ క్రియేట్‌ చేసుకొని కూరగాయాల నుంచి విమాన టికెట్ల వరకు అన్నీ కొనుగోలు చేసుకోవచ్చు.


చాలా మందికి తెలియని విషయం ఏంటంటే గూగుల్‌ పేలో ఒకటి కన్నా ఎక్కువ యూపీఐ ఐడీలను (UPI IDs) క్రియేట్‌ చేసుకోవచ్చు. ఎక్కువ మంది ఈ యాప్‌లో ఒకే యూపీఐ ఐడీ క్రియేట్‌ చేసుకుంటారు. దాంతో బ్యాంకు సర్వర్లు, నెట్‌వర్క్‌ బిజీగా ఉన్నప్పుడు చెల్లింపులు ఆలస్యమవ్వడం లేదా నగదు ఇరుక్కుపోవడం వంటి సమస్యలో ఇబ్బంది పడతారు. అలాంటప్పుడు ఒకటి కన్నా ఎక్కువ యూపీఐ ఐడీలుంటే సాఫీగా పని కానివ్వొచ్చు. ఒక యూపీఐ రూట్‌ బిజీగా ఉన్నప్పుడు రెండోది ఉపయోగించుకోవచ్చు.


గూగుల్‌ పేలో యూపీఐ ఐడీ క్రియట్‌ చేసే పద్ధతి


Step 1: మీ ఆండ్రాయిడ్‌ లేదా ఐఓఎస్‌ డివైజ్‌లోని గూగుల్‌ పే యాప్‌ మీద ట్యాప్‌ చేయండి.
Step 2: స్క్రీన్‌ కుడివైపు మీద ఉన్న ఫొటోను క్లిక్‌ చేయండి.
Step 3: 'పేమెంట్‌ మెథడ్‌' ఆప్షన్‌ను ఎంచుకోండి.
Step 4: కొత్త యూపీఐ ఐడీ కోసం మీ బ్యాంకు ఖాతాను ఎంచుకోండి.
Step 5: డ్రాప్‌డౌన్‌ ఆప్షన్‌లో 'మేనేజ్‌ యూపీఐ ఐడీ'పై ట్యాప్ చేయండి.
Step 6:  కొత్త ఐడీని సృష్టించేందుకు లేదా జనరేట్‌ చేసేందుకు యూపీఐ ఐడీ పక్కనే ఉన్న + సింబల్‌ను ఎంచుకోండి.
Step 7: ఇప్పుడు మీరు డబ్బులు చెల్లించాలనుకుంటున్న ఖాతా ఆప్షన్‌లో మీకు నచ్చిన యూపీఐ ఐడీని సెలక్ట్‌ చేసుకోండి.
Step 8: 'యాడ్‌ న్యూ' ఆప్షన్‌ ఎంచుకోండి. అప్పుడు అదనపు యూపీఐ ఐడీకి సంబంధించి గూగుల్‌ పే మీకు ఓ సందేశం పంపిస్తుంది.
Step 9: ఆ తర్వాత గూగుల్‌ పే నుంచి సులువుగా చెల్లింపులు చేసుకోవచ్చు.


నెలకు రూ.10 లక్షల కోట్లు


యూపీఐ రాకతో చెల్లింపుల ప్రక్రియ మంచినీళ్ల ప్రాయంగా మారిపోయింది. క్షణాల్లో అవతలి వారికి నగదు పంపించడం మొదలైంది. మొదట్లో యూపీఐ ఐడీ (UPI ID) ఎంటర్‌ చేయాల్సి వచ్చేది. క్రమంగా యూపీఐ స్కానింగ్‌ కోడ్స్‌ వచ్చేశాయి. రూపాయి నుంచి లక్ష రూపాయల విలువైన లావాదేవీలను రెప్పపాటు సమయంలో ఉచితంగా చేపట్టొచ్చని తెలియడంతో జనాలు విపరీతంగా వాడేయడం ఆరంభించారు. మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (MDR) ఛార్జీలు లేకపోవడంతో కిరాణా కొట్లు, వస్త్ర దుకాణాలు, స్టోర్లు, వ్యాపారులు యూపీఐనే ప్రోత్సహించారు. అంతకు ముందు క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు వాడితే ఆ లావాదేవీకి అయ్యే ఖర్చు మర్చంట్లే భరించాల్సి వచ్చేది. ఇక్కడేమో అంతా ఉచితమే. అందుకే 2016, జులై నాటికి నెలకు రూ.38 లక్షల విలువైన లావాదేవీలుంటే 2022, జులై నాటికి ఇది రూ.10 లక్షల కోట్ల విలువకు చేరుకుంది.