Stock Market News: మార్కెట్ విలువ ‍(క్యాపిటలైజేషన్) పరంగా, మహీంద్ర & మహీంద్ర (M&M) టాటా మోటార్స్‌ను ‍‌(Tata Motors) అధిగమించింది, రెండో అత్యంత విలువైన ఆటోమొబైల్ కంపెనీగా నిలిచింది.


గురువారం నాటి ట్రేడ్‌లో 3 శాతం పెరిగిన మహీంద్ర & మహీంద్ర షేర్లు, కొత్త గరిష్ట స్థాయి రూ.1,331.25 కి చేరాయి. ఈ నెల 2 నాటి మునుపటి గరిష్ట స్థాయి రూ.1,330.30 ని అధిగమించాయి. దీంతో, కంపెనీ మార్కెట్‌ విలువ కూడా 
రూ.1.65 లక్షల కోట్లకు చేరింది. ఇదే సమయంలో టాటా మోటార్స్‌, టాటా మోటార్స్ డీవీఆర్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.1.59 లక్షల కోట్లుగా ఉంది. దీంతో, టాటా మోటార్స్‌ని ఓవర్‌టేక్‌ చేసి మార్కెట్‌ క్యాప్‌ రేసులో రెండో స్థానానికి M&M షేరు దూసుకెళ్లింది. ఆ తర్వాత షేరు ధర తగ్గడంతో, మార్కెట్‌ క్యాప్‌ కూడా తగ్గింది.


రూ.2.67 ట్రిలియన్ల మార్కెట్ క్యాప్‌తో, మారుతి సుజుకి ఇండియా పీర్స్‌కు చాలా దూరంగా, అగ్రస్థానంలో ఉంది.


గత మూడు నెలల్లో, M&M మార్కెట్ ప్రైస్‌ 27 శాతం మేర పెరగ్గా, టాటా మోటార్స్ షేరు 2 శాతం లాభాన్ని నమోదు చేసింది. ఇదే కాలంలో BSE సెన్సెక్స్ 8 శాతం ర్యాలీ చేసింది.


ఆటోమోటివ్, వ్యవసాయ పరికరాలు, ట్రక్‌లు, బస్సులను M&M తయారు చేస్తుండగా; ప్యాసింజర్ వెహికల్స్‌ (‌PVలు) లేదా కార్లు, ట్రక్కులు, వ్యాన్లు, కోచ్‌లు, బస్సులు, లగ్జరీ కార్లు, స్పోర్ట్స్ కార్లు, నిర్మాణ సామగ్రిని టాటా మోటార్స్ ఉత్పత్తి చేస్తోంది.


ఆగస్టు నెలలో.. ప్యాసింజర్‌, కార్గో విభాగాలు రెండింటిలోనూ బలమైన డిమాండ్‌తో వాణిజ్య వాహనాలు (CVలు) బలమైన వృద్ధి వేగాన్ని కొనసాగించాయి. భారీ ఆర్డర్ బుక్, పెరిగిన ఉత్పత్తి కారణంగా ప్యాసింజర్ వెహికల్ (PV) వాల్యూమ్స్‌లో రెండంకెల వృద్ధి కనిపించింది.


OEMలు, డీలర్‌ల నుంచి వచ్చిన ఇనిషియల్‌ ఫీడ్‌బ్యాక్ ప్రకారం... ఈ పండుగ సీజన్‌లో PV సెగ్మెంట్‌ వాల్యూమ్ గ్రోత్ సానుకూలంగా ఉందని, భారీగా అమ్మకాలు ఉండొచ్చని ఆటో సెక్టార్ అప్‌డేట్‌లో ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (Emkay Global Financial Services) తెలిపింది.


FY23కి సంబంధించి, మొత్తం ఆటో సెక్టార్‌ మీద ఈ బ్రోకరేజ్‌ బుల్లిష్‌గా ఉంది. PV అమ్మకాల్లో 26 శాతం, CVల్లో 20 శాతం, టూ వీలర్లలో 14 శాతం, ట్రాక్టర్ల అమ్మకాల్లో 3 శాతం వృద్ధిని ఆశిస్తోంది.


మహీంద్ర & మహీంద్ర స్టాక్‌ టెక్నికల్‌ వ్యూ


బయాస్‌: పాజిటివ్‌, కన్సాలిడేషన్‌ ఉండొచ్చు
సపోర్ట్‌: రూ.1,280, ఆ తర్వాత రూ.1,220
టార్గెట్: రూ.1,400


ఈ ఏడాది మార్చి నుంచి ఈ స్టాక్‌ పాజిటివ్‌ బయాస్‌లో ట్రేడవుతోంది, ఈ కాలంలో దాదాపు 74 శాతం రాణించింది. ఆగస్ట్ ప్రారంభం వరకు వేగంగా ఆరోహణ తర్వాత, స్టాక్ ఆ తర్వాత క్రమంగా పైకి కదిలింది.


ప్రైస్-టు-మూవింగ్ యావరేజ్స్ ప్రకారం.. ఈ స్టాక్ ప్రైస్‌ దాని కీలక మూవింగ్ యావరేజ్‌ల కంటే పైన, బలంగా ట్రేడ్ అవుతోంది. కాబట్టి, మొత్తం సానుకూల ధోరణలో ఉంది. అయితే, కొన్ని మొమెంటం ఓసిలేటర్ల ప్రకారం, ఇది పరుగును కొంతకాలం పక్కనబెట్టి అలసట తీర్చుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. అందువల్ల, సమీప కాలంలో స్టాక్ కన్సాలిడేట్‌ కావచ్చు.


స్టాక్‌కు సమీప కాల మద్దతు రూ.1,280 వద్ద ఉంది. ఈ స్థాయి కంటే పడిపోతే దిగువన రూ.1,220 స్థాయి దగ్గర పట్టు దొరకవచ్చు. అప్‌సైడ్‌లో, రూ.1,400 స్థాయికి చేరుకోవాలంటే రూ.1,330 కంటే పైన స్ట్రాంగ్‌గా నిలదొక్కుకోవాలి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.