Stock Market News: ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPI) మన స్టాక్‌ మార్కెట్‌లో ప్రతిరోజూ వేల కోట్ల రూపాయల షేర్లను కొంటారు, అమ్ముతుంటారు. మార్కెట్‌ను మూవ్‌ చేసే శక్తి వీళ్ల చేతుల్లో ఉంది. FPIలు నెట్‌ సెల్లర్స్‌గా ఉన్నారా లేదా నెట్‌ బయ్యర్స్‌గా ఉన్నారా అన్న అంశం మీదే ఆ రోజు మార్కెట్‌ డైరెక్షన్‌ ఉంటుంది.


రకరకాల లెక్కల ఆధారంగా, వివిధ రంగాల్లోని కంపెనీల షేర్లను FPIలు కొంటుంటారు. వాళ్ల వ్యూ ఆధారంగా వాటిని షార్‌టర్మ్‌ లేదా లాంగ్‌టర్మ్‌ కోసం హోల్డ్‌ చేస్తారు.


ఇక, గత నెలలో (ఆగస్టు) మార్కెట్లలోకి వచ్చిన విదేశీ నగదు ప్రవాహాల్లో (ఫారిన్‌ ఇన్‌ఫ్లో) దాదాపు సగం మొత్తం ఆర్థిక (బ్యాంకులు సహా), ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) విభాగాల్లోని స్టాక్స్‌లోకి వెళ్లాయి.


ఆర్థిక రంగం దాదాపు $1.6 బిలియన్ల ఇన్‌ఫ్లోలను ఆకర్షించింది. 2021 ఫిబ్రవరిలో,  ఫైనాన్షియల్ స్టాక్స్‌లోకి FPIలు అత్యధికంగా $1.96 బిలియన్లను పంప్‌ చేశారు. ఆ తర్వాత, గత నెలలోనే ఆ స్థాయిలో కొన్నారు.


ఆగస్టులో, కన్స్యూమర్ స్టాక్స్‌ $1.4 బిలియన్ల పెట్టుబడులు పొందాయి. ఫార్మాస్యూటికల్ స్టాక్స్ కూడా $1 బిలియన్ల FPI డబ్బును అందుకున్నాయి. 


ఆగస్టులో, FPIలు మొత్తం $6.4 బిలియన్ల (రూ.51,204 కోట్లు) విలువైన షేర్లను కొనుగోలు చేశారు. 2020 డిసెంబర్ నుంచి చూస్తే ఇది అత్యధిక మొత్తం. బలమైన ఇన్‌ఫ్లోస్‌ కారణంగా చాలా రంగాలు పాజిటివ్‌ నెట్‌ ఇన్‌ఫ్లోస్‌ను చూశాయి, గత నెలల్లోని నష్టాల నుంచి కోలుకున్నాయి.


గత ఆరు నెలల్లో $6.38 బిలియన్లు, గత ఒక సంవత్సరంలో $2.4 బిలియన్ల విలువైన కొనుగోళ్ల తర్వాత, మళ్లీ భారీ ఇన్‌ఫ్లో మొదలైంది.


ఈ ఏడాది ప్రారంభం నుంచి బ్యాంకింగ్ క్రెడిట్ వృద్ధి స్థిరంగా మెరుగుపడింది. ఆర్థిక రంగంలో వాల్యుయేషన్లు ఇప్పటికీ పెరగలేదు. సర్దుబాటు చేసిన పుస్తక విలువతో ప్రస్తుత ధరను పోలిస్తే, చాలా బ్యాంకింగ్ స్టాక్స్‌ వాటి హిస్టారికల్‌ హైస్‌ కంటే డిస్కౌంట్‌లో ట్రేడవుతున్నాయని ఈక్వినామిక్స్ రీసెర్చ్‌ వెల్లడించింది. 


ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడల్లా FMCG స్టాక్స్‌ మోస్ట్‌ డిఫెన్సివ్‌ బెట్స్‌గా మారతాయి. లేమాన్ సంక్షోభం సమయంలో కూడా, ఇతర రంగాలతో పోలిస్తే FMCG స్టాక్స్‌లో పతనం చాలా తక్కువగా ఉంది. అందుకే వీటి మీద FPIలు ఎక్కువ బెట్స్‌ వేశారు.


ఆటో స్టాక్స్‌, క్యాపిటల్ గూడ్స్‌లోకి ఇన్‌ఫ్లో (వీటిలో FPIలు $0.42 బిలియన్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు) 2021 జనవరి తర్వాత మళ్లీ ఇప్పుడు రెండో అత్యధికం. 


ఆటో రంగానికి FPI కేటాయింపులు 5.6 శాతం వద్ద ఉన్నాయి, 2019 మార్చి నుంచి ఇది అత్యధికం.


క్యాపిటల్ గూడ్స్ కేటాయింపులు 2.5 శాతం వద్ద ఉన్నాయి, వరుసగా నాలుగో నెల కూడా ఈ రేషియో పెరుగుతూనే ఉంది. 


ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) రంగం కేవలం 50 మిలియన్ డాలర్ల విలువైన నికర కొనుగోళ్లను చూసింది. గత 11 నెలల అమ్మకాల పరంపరకు ఇక్కడ బ్రేక్‌ పడినప్పటికీ, IT రంగం సైజ్‌తో పోలిస్తే, ఈ కేటాయింపులు చాలా తక్కువ. గత ఆరు నెలల్లో, $4.7 బిలియన్ల విలువైన IT స్టాక్స్‌ను ఫారినర్లు అమ్మేశారు. గత ఒక సంవత్సరంలో $10.8 బిలియన్లను వెనక్కు తీసుకున్నారు. ఆర్థిక రంగం తర్వాత ఇదే రెండో అత్యధిక ఔట్‌ ఫ్లో.


ప్రస్తుతానికి సానుకూల ప్రవాహాలు ఉన్నప్పటికీ, ఐటీలో కేటాయింపులు వరుసగా ఐదో నెలలోనూ తగ్గి, 10.7 శాతానికి చేరాయి. 2018 మార్చి తర్వాత ఇది కనిష్ట స్థాయి.


పవర్ స్టాక్స్‌కు ఎఫ్‌పీఐల కేటాయింపులు పెరిగి, 5.5 శాతానికి చేరాయి. 2018 జనవరి నుంచి ఇది అత్యధికం. ఈ సెక్టార్‌లోకి కేటాయింపులను, గత ఒక సంవత్సరం కాలంలో 2.6 శాతం పెంచారు. 


లాజిస్టిక్స్ స్టాక్స్‌కు కేటాయించింది 1.7 శాతం. 2018 జనవరి నుంచి చూస్తే ఇది గరిష్ట స్థాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.