Tamilnad Mercantile Bank IPO: తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ (TMB) ఇనీషియల్‌ పబ్లిక్ ఆఫర్ (IPO) ముగిసింది, దాదాపు మూడు రెట్ల స్పందన వచ్చింది. సోమవారం ప్రారంభమైన ఈ IPO బుధవారం (నిన్న) ముగిసింది.


IPOలో, ఒక్కో షేరుకు రూ.500 - 525 ప్రైస్‌ బ్యాండ్‌ను; 28 షేర్లను ఒక్క లాట్‌గా నిర్ణయించారు. బిడ్‌ వేసిన వాళ్లు 28 చొప్పున షేర్లకు ఒక బిడ్‌ చొప్పున సబ్‌స్క్రైబ్‌ చేసుకున్నారు. ఈ ప్రకారం ఒక్కో లాట్‌కు రూ.14,000 - 14,700 వరకు చెల్లించారు.


సబ్‌స్క్రిప్షన్స్‌
ఈ ఇష్యూలో, క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్‌ (QIB) విభాగం 1.62 రెట్లు, హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్‌ (HNI) విభాగంలో 2.94 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. రిటైల్ పోర్షన్‌లో గట్టి స్పందన కనిపించింది, చిన్న ఇన్వెస్టర్ల నుంచి 6.5 రెట్ల బిడ్లు వచ్చాయి.


ఈ మూడు నెలల్లో మార్కెట్‌లోకి వచ్చిన గత రెండు IPOలతో పోలిస్తే, దీనికి వచ్చిన ప్రతిస్పందన తక్కువగా ఉంది. 


IPO ప్రారంభానికి ముందున్న వర్కింగ్‌ డే రోజున (శుక్రవారం), ఒక్కో షేరును రూ.510 చొప్పున, 71,28,000 ఈక్విటీ షేర్లను 10 యాంకర్ ఇన్వెస్టర్లకు జారీ చేసింది. తద్వారా ₹363.53 కోట్లను సమీకరించింది. ఈ షేర్లకు లాక్‌ ఇన్‌ పిరియడ్‌ ఉంటుంది కాబట్టి, షేర్ల లిస్టింగ్‌ రోజున వాటిని యాంకర్‌ ఇన్వెస్టర్లు అమ్మలేరు.


లిస్టింగ్‌ తేదీ
ప్రస్తుత ఆఫర్ ద్వారా మొత్తం 15.84 మిలియన్ (1,58,40,000) తాజా షేర్లను TMB జారీ చేస్తుంది. ఈ కంపెనీ షేర్లు ఈ నెల 15న (గురువారం) రెండు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో (BSE, NSE‌) లిస్ట్ అవుతాయని భావిస్తున్నారు. 


ప్రైస్ బ్యాండ్‌లోని టాప్ ఎండ్‌ రూ.525 ప్రకారం, ఈ బ్యాంక్ రూ.832 కోట్లను సమీకరించగలదు. దీనివల్ల బ్యాంక్‌ విలువ రూ.8,314 కోట్లకు చేరుతుంది.


తన టైర్-I క్యాపిటల్ బేస్‌ను పెంచుకోవడానికి IPO ఆదాయాన్ని ఉపయోగించాలని TMB యోచిస్తోంది. భవిష్యత్ మూలధన అవసరాలను తీర్చడానికి ఈ మొత్తం సాయపడుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించిన మూలధన సమృద్ధికి (క్యాపిటల్‌ అడిక్వసి) సంబంధించిన విధానాలను కూడా కూడా ఇది భర్తీ చేస్తుంది.


గత ఆర్థిక సంవత్సరం (2021-22) ముగింపు ‍నాటికి, రూ.44,930 కోట్ల డిపాజిట్లు, రూ.33,490 కోట్ల అడ్వాన్సులను TMB ప్రకటించింది. FY22లో రూ.822 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.


యాక్సిస్ సెక్యూరిటీస్ ప్రకారం... తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ నికర లాభం 2020 మార్చి - 2022 మార్చి మధ్య దాదాపు 42 శాతం CAGR వద్ద పెరిగింది. ఈ కాలంలో, డిపాజిట్లు 10.5 శాతం CAGR వద్ద వృద్ధి చెందాయి. అడ్వాన్సులు 9.9 శాతం పెరిగాయి.


దేశవ్యాప్త ఉనికి
ఈ బ్యాంకుకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 509 శాఖలు ఉన్నాయి. తమిళనాడులో 369 శాఖలతో బలమైన ఉనికిని కలిగి ఉంది. బ్యాంక్‌ మొత్తం ఆదాయంలో ఈ 369 శాఖల నుంచే 70 శాతం వస్తోంది. 15 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లో మిగిలిన శాఖలు విస్తరించి ఉన్నాయి.


నాడార్ బ్యాంక్‌ పేరిట 1921లో దీనిని స్థాపించారు, ప్రారంభమై ఇప్పటికి 101 సంవత్సరాలైంది. ప్రాథమికంగా.. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, వ్యవసాయం, రిటైల్ కస్టమర్లకు లోన్లు ఇస్తోంది. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.