Defence Sector Firms: రక్షణ రంగానికి (Defence sector) సంబంధించిన కంపెనీల స్టాక్స్‌ ఇప్పుడు ఫైర్‌ మీదున్నాయి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన "ఓకల్‌ ఫర్‌ లోకల్‌" విధానం ఆయా స్టాక్స్‌ను రాకెట్లలా మార్చాయి.


జూన్ త్రైమాసికంలో బలమైన పనితీరు, స్వదేశీకరణ (indigenisation) జాబితా పెంపు, ఎగుమతుల్లో వృద్ధికి అవకాశం, వాల్యుయేషన్లు లిస్టెడ్ డిఫెన్స్‌ సెక్టార్‌ కంపెనీలకు సానుకూల ట్రిగ్గర్లు. ఈ స్టాక్‌లు గత సంవత్సరం కాలంలో రీ-రేట్‌ చూశాయి. ఈ కాలంలో, భారత్ ఎలక్ట్రానిక్స్ (BEL), హిందుస్థాన్ ఏరోనాటిక్స్ (HAL) షేరు ధరలు 68-72 శాతం పెరిగాయి. భారత్ డైనమిక్స్ (BDL) స్టాక్‌ ఇదే కాలంలో రెట్టింపు అయింది. ప్రస్తుతమున్న పాజిటివ్‌ ట్రిగ్గర్లను బట్టి, ఈ ఊపు కొనసాగుతుందని మార్కెట్‌ ఎక్స్‌పర్ట్స్‌ భావిస్తున్నారు.


ఓకల్‌ ఫర్‌ లోకల్‌


"ఓకల్‌ ఫర్‌ లోకల్‌" విధానంలో భాగంగా, రక్షణ రంగ దిగుమతులను తగ్గిస్తూ, దేశీయంగా విడి భాగాల తయారీని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా దేశీయ వస్తువుల జాబితాలోని పరికరాల సంఖ్యను గత వారం మరింత పెంచింది. ఇది ఈ స్టాక్స్‌కు  తక్షణ ట్రిగ్గర్. ఇది, వివిధ విడి భాగాలు, ఉప వ్యవస్థలు, లైన్ రీప్లేస్‌మెంట్ యూనిట్లతో కూడిన 780 అంశాలున్న ఆరో జాబితా. రక్షణ మంత్రిత్వ శాఖ, గత రెండు సంవత్సరాల్లో 310 ప్లాట్‌ఫామ్‌లు లేదా పరికరాలను ఈ జాబితాలో చేర్చింది. వీటిలో కంబాట్, యుటిలిటీ హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు, జలాంతర్గాములు, కార్వెట్‌లు, క్షిపణి వ్యవస్థలు ఉన్నాయి.


ఈ లిస్ట్‌లో ఉన్నవాటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకోరు లేదా దిగుమతులను తగ్గిస్తారు. దేశీయంగా తయారీని ప్రోత్సహిస్తారు, దేశీయంగా తయారైన భాగాల కొనుగోళ్లను పెంచుతారు. అందువల్లే, రక్షణ రంగ స్టాక్స్‌లో ఊపు పెరిగింది.


భారత్ ఎలక్ట్రానిక్స్


మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం అతి పెద్ద లిస్టెడ్ డిఫెన్స్ ప్లేయర్ అయిన BEL, ఇండిజెనైజేషన్‌ డ్రైవ్ నుంచి భారీగా లాభపడుతోంది. మల్టిపుల్‌ మిస్సైల్‌ స్టిస్టమ్స్‌కు సంబంధించి ఈ సంస్థ ఆర్డర్ పైప్‌లైన్ రూ.50,000 కోట్లకు పైగా ఉంది. వచ్చే మూడేళ్ల వరకు, ఏటా రూ.20,000 కోట్ల ఆర్డర్ ఇన్‌ఫ్లో వస్తుందని అంచనా వేస్తోంది. దీనివల్ల కంపెనీ ఆదాయం ఏటా 15 శాతం మెరుగయ్యే ఛాన్స్‌ ఉంది.


స్థానికీకరణ వల్ల, BEL సమీకరించే ముడి పదార్థాల్లో దిగుమతుల శాతం 35 శాతం నుంచి 15-20 శాతానికి తగ్గుతుంది. ఈ మేరకు దేశీయంగానే సమీకరించే అవకాశం వస్తుంది. ఫలితంగా నిర్వహణ లాభాల మార్జిన్‌ 100-200 బేసిస్ పాయింట్ల వరకు పెరుగుతుందని భావిస్తున్నారు. FY23లో ఎగుమతులు రెట్టింపు అవుతాయని, తర్వాతి కాలంలో మరింత పెరుగుతాయని, కంపెనీ ఆర్డర్ బుక్ $270 మిలియన్లకు చేరుతుందని భావిస్తున్నారు. 


ఇతర కంపెనీల్లో...


స్వదేశీ క్షిపణి అభివృద్ధి కార్యక్రమం, ఎగుమతుల్లో పెరుగుతున్న వృద్ధి అవకాశాల వల్ల BDL మార్కెట్‌ దృష్టిని ఆకర్షిస్తోంది. భారత సాయుధ దళాలకు 'ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణులు', టార్పెడోలు, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్స్‌ను సరఫరా చేసే ఏకైక సంస్థ BDL. CY26 నాటికి $24.5 బిలియన్లకు చేరుకోగల క్షిపణులు & టార్పెడో విభాగం ద్వారా ఇది ప్రయోజనం పొందుతుందని అంచనా. FY22-24 కాలంలో 27 శాతం వార్షిక రెవెన్యూ గ్రోత్‌, 26 శాతం ఎర్నింగ్స్‌ గ్రోత్‌ను యాంటిక్ స్టాక్ బ్రోకింగ్ సంస్థ అంచనా వేస్తోంది. 


పెద్ద PSUలతో పాటు, వాల్యూ చైన్‌లో ఉన్న చిన్న కంపెనీలు కూడా లాభపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. డేటా ప్యాటర్న్స్, ఎంటీఏఆర్ టెక్నాలజీస్, పారస్ డిఫెన్స్, ఆస్ట్రా మైక్రోవేవ్, డైనమాటిక్ టెక్నాలజీస్, తనేజా ఏరోస్పేస్ వంటివాటిని కీలక లబ్ధిదారులుగా ఎలారా సెక్యూరిటీస్‌ నమ్ముతోంది.


సెమీకండక్టర్ల కొరత, ఎగ్జిక్యూషన్‌ జాప్యాలు మార్చి త్రైమాసికంలో కొన్ని రక్షణ రంగ PSUలను ప్రభావితం చేశాయి. ఆ పరిస్థితి నుంచి కోలుకుని, జూన్‌ త్రైమాసికం ఆదాయాల్లో గణనీయమైన పెరుగుదలకు అవి నివేదించాయి. BDL ఆదాయం YoYలో 5 రెట్లు పెరిగింది. ఆ తర్వాతి స్థానాల్లో HAL (124 శాతం YoY వృద్ధి) మరియు BEL, మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్, గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ (80-90 శాతం YoY వృద్ధి) ఉన్నాయి.


గత ఏడాది కాలంలో HAL, BEL, BDL స్టాక్స్‌ రీ-రేట్‌ అయినా, FY24 ఆదాయాల అంచనాల ప్రకారం వాటి వాల్యుయేషన్లు (PE) 16-24 రెట్ల వద్ద ఇప్పటికీ ఆకర్షణీయంగా ఉన్నాయని ఐసీఐసీఐ డైరెక్ట్‌ వెల్లడించింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.