Cooking oil prices to fall with Indonesia set to lift export ban : వంట నూనె ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు శుభవార్త! మరికొద్ది రోజుల్లో మంచినూనె ధర తగ్గే అవకాశం ఉంది. ఇండోనేషియా పామాయిల్ ఎగుమతులపై నిషేధం ఎత్తివేయడమే ఇందుకు కారణం. మే 23 నుంచి నిషేధం ఎత్తివేత అమల్లోకి వస్తుంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధమూ ఆఖరి దశకు చేరుకోవడంతో పొద్దుతిరుగుడు నూనె ఎగుమతులూ పెరగనున్నాయి. జూన్ నెల నుంచి కస్టమర్లకు ఉపశమనం లభించనుంది.
భారత్ ప్రధానంగా పామాయిల్‌ను ఇండోనేషియా, పొద్దుతిరుగుడు నూనెను ఉక్రెయిన్, రష్యా నుంచి దిగుమతి చేసుకొనే సంగతి తెలిసిందే. ఇండోనేషియా ఏటా 46 మిలియన్ టన్నుల పామ్ ఆయిల్‌ను ఉత్పత్తి చేస్తుంది. అందులో 9 మిలియన్ టన్నులను ఆహారం, మరో 9 మిలియన్ టన్నులను బయో డీజిల్ కోసం ఉపయోగించుకుంటుంది. మిగిలిన 28 మిలియన్ టన్నులను విదేశాలకు ఎగుమతి చేస్తుంది.
'పామ్ ఆయిల్ ఎగుమతులపై నిషేధం ఎత్తేస్తామని మే19న ఇండోనేషియా ప్రకటించడంతో మార్కెట్ 5 శాతం తగ్గింది. అయితే ఎగుమతి దారులు దేశ అవసరాలను తీర్చాలని షరతు విధించడంతో మే 20న ధరలు మళ్లీ 4 శాతం పెరిగాయి' అని వంటనూనెల దిగుమతిదారు సన్‌విన్ గ్రూప్ సీఈవో సందీప్ బజోరియా అన్నారు.
దేశీయ అవసరాల కోసం 10 మిలియన్ టన్నుల పామ్ ఆయిల్‌ను రిజర్వు చేయాలని ఇండోనేషియా ప్రభుత్వం అక్కడి కుకింగ్ ఆయిల్ పరిశ్రమను ఆదేశించింది. దాంతో వేర్వేరు రకాల కుకింగ్ ఆయిల్స్ నిల్వలు క్రమంగా మెరుగవుతాయని ట్రేడర్లు చెబుతున్నారు. ఆ దేశంలో పామ్ ఆయిల్ ఉత్పత్తి సీజన్ ఇప్పుడు మొదలై సెప్టెంబర్‌లో ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. సన్‌ఫ్లవర్ పరిస్థితీ మెరుగు అవుతుందని అంటున్నారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలవ్వక ముందు భారత్ 200,000 టన్నుల సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను వినియోగించేది. యుద్ధం మొదలయ్యాక సరఫరా స్తంభించడంతో ఇది సగానికి తగ్గిపోయింది. 'యుద్ధం ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంటోంది. ఉక్రెయిన్ నుంచి సన్‌ఫ్లవర్ ఆయిల్ సరఫరా నౌకలు, రైల్వేస్, రహదారి మార్గాల్లో కొద్దికొద్దిగా పెరగనుంది. దేశంలో పొద్దుతిరుగుడు నూనె సరఫరా ప్రతి నెలా 20 నుంచి 25వేల టన్నులకు పెరుగుతుందని అంచనా వేస్తున్నాం' అని బజోరియా వెల్లడించారు.
Also Read: ఎన్‌ఎస్‌ఈ స్కామ్‌లో కీలక పరిణామం - ట్రేడర్లు, బ్రోకర్ల ఇళ్లలో సీబీఐ సోదాలు
Also Read: ఈ-ముద్రా ఐపీవోకు తొలిరోజు 47% స్పందన, రిటైల్ కోటాలో 90% బుక్!