PIB Fact Check: డిజిటలైజేషన్‌ పుణ్యమా అని బ్యాంకింగ్‌ రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. నేరుగా మొబైల్‌ ఫోన్ల నుంచే సులభంగా నగదు బదిలీ చేయొచ్చు. ఇతరుల నుంచి ఈజీగా తిరిగిపొందొచ్చు. సాంకేతిక నైపుణ్యం, డిజిటలైజేషన్ పెరుగుతున్నా మరోవైపు సైబర్‌ క్రైమ్స్‌ ఎక్కువవ్వడం కలవరపరుస్తోంది. ఇప్పటికే కొన్ని వేల మంది సైబర్‌ నేరస్థుల బారిన పడ్డారు. డబ్బులు పోగొట్టుకున్నారు. తాజాగా రూ.12,500 లావాదేవీ ఫీజుగా చెల్లిస్తే ఆర్బీఐ రూ.4.62 కోట్ల డబ్బులు ఇస్తుందంటూ ఓ ప్రచారం మొదలైంది. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, టెలిగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 


ఇదో ఫేక్‌ న్యూస్‌


ఈ ప్రచారాన్ని నమ్మొద్దని పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌ (PIB Fact Check) స్పష్టం చేసింది. ఇది నకిలీ వార్త (Fake News) అని వెల్లడించింది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ప్రచారం అవుతున్న సందేశాన్ని చూస్తే ఇలా అనిపిస్తోంది. ఆర్బీఐ మీకు 4.62 కోట్లు ఇస్తోంది. ఈ ఆఫర్‌ క్లెయిమ్‌ చేసుకోవాలంటే ట్రాన్జాక్షన్‌ ఫీజుగా కేవలం రూ.12,500 చెల్లించాల్సి ఉంటుంది. దానికింద నకిలీ ఈమెయిల్‌ ఐడీ, వెబ్‌సైట్‌ లింక్‌ వస్తుంది. ఈ సందేశాన్ని పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌ (PIB Fact Check) తనిఖీ చేసింది. అన్ని వివరాలను పరిశీలించింది. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ఇలాంటి ఆఫర్‌ ప్రకటించలేదని వెల్లడించింది. మీ బ్యాంకు, వ్యక్తిగత వివరాలు కోరుతూ ఆర్బీఐ ఈమెయిళ్లు పంపించదని స్పష్టం చేసింది.


RBI వ్యక్తిగత వివరాలు అడగదు


ఆర్బీఐ పేరుతో సైబర్‌ క్రిమినల్స్‌ మీ వ్యక్తిగత, ఆర్థిక వివరాలు కోరుతూ మెయిల్స్‌, సందేశాలు పంపిస్తారని పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌ తెలిపింది. ఆ తర్వాత లావాదేవీ ఫీజుగా కొంత నగదు పంపించాలని కోరతారని చెప్పింది. ఆ తర్వాత మరోసారి మరింత పెద్ద మొత్తంలో నగదు బదిలీ చేయాలని చెప్తారంది. ఇలాంటి ఉచ్చులో పడకుండా ఉండేందుకు జాగ్రత్త వహించాలని పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌ తెలిపింది. వెంటనే ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్‌ www.rbi.org.inను విజిట్‌ చేయాలని వివరించింది. సంబంధిత సమాచారం పరిశీలించాలని తెలిపింది.