Indian Railway Ticket Rules: భారతీయ రైల్వేలో ప్రతిరోజూ సగటున దాదాపు రెండు కోట్ల మంది ప్రయాణిస్తున్నట్లు ఒక అంచనా. ఇండియన్ రైల్వే ప్రపంచంలో నాలుగో అతి పెద్ద రైల్వే వ్యవస్థ. రైళ్లలో రష్ కారణంగా, చాలా మంది ప్రయాణికులు ముందుగానే రిజర్వేషన్ (Train Ticket Reservation) చేసుకుని ప్రయాణించడానికి మొగ్గు చూపుతున్నారు. జనరల్ బోగీతో పోలిస్తే రిజర్వ్‌డ్ కోచ్‌లో ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉండడం కూడా ఒక కారణం. ముఖ్యంగా, ఫ్యామిలీతో కలిసి వెళ్లే వాళ్లు ముందుగానే సీట్ రిజర్వ్ చేసుకుని ప్రయాణించడం చాలా ఉత్తమమైన పని. రిజర్వేషన్ కోచ్‌లో ప్రయాణించడానికి టిక్కెట్లను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో బుక్ (Train Ticket Booking) చేసుకోవచ్చు.
రైళ్లలో ప్రయాణించే వాళ్ల కోసం రైల్వే శాఖ చాలా నిబంధనలు (Indian Railway Rules) రూపొందించింది. వీటిలో టిక్కెట్ బుకింగ్‌కు సంబంధించిన రూల్స్ కూడా ఉన్నాయి. రైళ్లలో చిన్న పిల్లలు ఫ్రీగా జర్నీ చేయవచ్చు. అంటే, చిన్న పిల్లల కోసం టిక్కెట్ కొనాల్సిన అవసరం లేదు. కొంతమంది పిల్లల విషయంలో హాఫ్ టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. రైలులో ప్రయాణించే ఏ వయస్సు పిల్లల వరకుకు టిక్కెట్ కొనాల్సిన అవసరం లేదు, ఎవరికి హాఫ్ టిక్కెట్ తీసుకోవాలన్న వివరాలపై రైల్వే రూల్స్ స్పష్టంగా ఉన్నాయి.
ఈ పిల్లలకు టిక్కెట్ కొనాల్సిన అవసరం లేదు
భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం, 0 రోజుల నుంచి 4 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న చిన్నారి మీతో ప్రయాణిస్తున్నట్లయితే, ఆ బాలిక/ బాలుడికి టిక్కెట్ ధరపై సంపూర్ణ రాయితీని రైల్వే శాఖ అందిస్తుంది. అంటే, ఆ చిన్నారి కోసం మీరు టిక్కెట్ కొనాల్సిన అవసరం లేదు. ఆ బాలిక/ బాలుడు మీతో కలిసి ఉచితంగా ప్రయాణించవచ్చు.
మరో ఆసక్తికర కథనం: సూర్య ఘర్ యోజన - సోలార్ ప్యానెళ్లు చలికాలంలో ఎలా పని చేస్తాయి, బిల్లు ఎంత వస్తుంది?
ఏ వయస్సు పిల్లలకు హాఫ్ టిక్కెట్ తీసుకోవాలి?
రైల్వే నిబంధనల ప్రకారం, 5 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల మధ్య పిల్లలకు హాఫ్ టికెట్ కొనుగోలు చేయాలి. అంటే, టిక్కెట్ ధరలో సగం (సాధారణంగా సగం కంటే కాస్త ఎక్కువగా ఉంటుంది) మొత్తాన్ని టిక్కెట్ కోసం చెల్లించాలి. అయితే, హాఫ్ టిక్కెట్ కింద మీ చిన్నారికి ప్రత్యేకంగా సీటు ఇవ్వరు. ఆ బాలిక/ బాలుడికి కూడా సెపరేట్ సీట్ కావాలనుకుంటే, మీరు పూర్తి టికెట్ తీసుకోవాలి.
టికెట్ లేకుండా ప్రయాణిస్తే ఎంత జరిమానా?
భారతీయ రైల్వేలో, టిక్కెట్ లేకుండా ప్రయాణించే వ్యక్తుల విషయంలో కఠినమైన నిబంధనలు ఉన్నాయి. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వ్యక్తిని TTE లేదా రైల్వే అధికారులు గుర్తిస్తే అతనికి ప్రాథమికంగా 250 రూపాయల జరిమానా విధిస్తారు. అంతేకాదు, రైలు ప్రయాణం ప్రారంభమైన స్టేషన్ నుంచి, అతనిని పట్టుకున్న స్టేషన్ వరకు టిక్కెట్ ఛార్జీని కూడా వసూలు చేస్తారు.
మరో ఆసక్తికర కథనం: ఈ 14 సైబర్ మోసాలు గురించి తెలిస్తే మీ అకౌంట్‌లో డబ్బులు సేఫ్- ఎవడూ టచ్ చేయలేడు