PM Surya Ghar Yojana Power Bill During Winter: వేసవి అయినా, చలికాలమైనా ప్రజలు విద్యుత్‌ను ఉపయోగించాల్సిందే. ఎండాకాలంలో మండే వేడి నుంచి తప్పించుకోవడానికి ACలు, కూలర్లు సహా చల్లదనాన్ని పెంచే వివిధ విద్యుత్ ఉపకరణాలను ఉపయోగిస్తారు. ఇక, శీతాకాలంలో చలికి దూరంగా ఉండేందుకు రూమ్‌ హీటర్లు, వాటర్‌ హీటర్లు, గీజర్లు వంటి వాటిని వినియోగిస్తారు. వేసవి వేడి నుంచి రక్షణ కల్పించే పరికరాలైనా, చలికాలంలో వెచ్చదానాన్ని ఇచ్చే పరికరాలైనా.. చాలా విద్యుత్తును ఉపయోగించుకుంటాయి. నెల తిరిగే సరికి కరెంటు బిల్లు తడిసి మోపుడవుతుంది. కరెంటు బిల్లులు ఆదా చేసేందుకు ఇప్పుడు చాలామంది తమ ఇళ్లపై సౌర ఫలకాలు (Solar Panels) అమర్చుకుంటున్నారు. భారత ప్రభుత్వం, ప్రధాన మంత్రి సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకం కింద సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు కోసం రాయితీ కూడా ఇస్తోంది. 


సోలార్ ప్యానెల్స్ శీతాకాలంలో ఎలా పని చేస్తాయి?
పీఎం సూర్య ఘర్‌ యోజన కింద, తమ ఇంటి పైకప్పు మీద సౌర ఫలకాలు అమర్చుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇంతకు ముందు కొంతమంది ఇళ్లలో మాత్రమే సోలార్ ప్యానెల్స్ ఉండేవి. ఇప్పుడు చాలా మార్పు కనిపిస్తోంది. సౌర ఫలకాలు పని చేసి, విద్యుత్‌ ఉత్పత్తి చేయాలంటే సౌర శక్తి (సూర్యకాంతి) అవసరం. చలికాలంలో సూర్యుడి వేడి చాలా తక్కువ ఉంటుంది, కొన్నిసార్లు సూర్యుడు మేఘాల మాటునే ఉండిపోతాడు. వర్షాకాలంలో దట్టమైన మేఘాల కారణంగా సూర్యుడు రోజుల తరబడి మనకు కనిపించడు. అలాంటి పరిస్థితుల్లో సోలార్‌ ప్యానెళ్లకు సూర్యకాంతి & వేడి అందవు. సూర్య కాంతి లేని రోజుల్లో సోలార్ ప్యానెళ్లు ఎలా పని చేస్తాయి అనే సందేహం ప్రజల్లో ఉంటుంది. 


చలికాలంలో సూర్యుడు మేఘాల మాటున దాక్కున్నప్పటికీ సోలార్ ప్యానెల్ తన పని తాను చేస్తుంది. అయితే, బాగా ఎండ ఉన్న రోజులతో పోలిస్తే మబ్బుల పట్టిన రోజు దాని సామర్థ్యం కొద్దిగా తగ్గుతుంది. ఈ రోజుల్లో, సోలార్ ప్యానెళ్లు మేఘాల వెనుక ఉన్న సూర్య కాంతిని సంగ్రహిస్తాయి & ఆ తక్కువ కాంతి నుంచే విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. 


కరెంటు బిల్లు ఎంత వస్తుంది?
కరెంట్‌ పోల్‌ నుంచి మీ ఇంటికి విద్యుత్‌ కనెక్షన్‌ ఉంటే, మీరు ఉపయోగించిన విద్యుత్ మొత్తానికి బిల్లు చెల్లించాలి. కానీ, ప్రధాన్ మంత్రి సూర్య ఘర్ యోజన కింద బిల్లు గణనీయంగా తగ్గుతుంది లేదా పూర్తిగా జీరో అవుతుంది. మీ ఇంటి సౌర విద్యుత్‌ వ్యవస్థను సూర్య ఘర్ యోజన కింద అనుసంధానిస్తే, ప్రతి నెలా మీరు 300 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. దీని కంటే అదనపు విద్యుత్‌ మీ దగ్గర మిగిలితే, దానిని పవర్‌ గ్రిడ్‌కు అమ్మవచ్చు. శీతాకాలంలోనూ ఇదే పరిస్థితి. సాధారణంగా, వేసవితో పోలిస్తే చలికాలంలో కరెంటు వాడకం తక్కువగా ఉంటుంది. కాబట్టి, శీతాకాలంలో మీ ఇంటి విద్యుత్ బిల్లు గణనీయంగా తగ్గుతుంది లేదా అసలు ఉండదు. మిగులు విద్యుత్‌ను గ్రిడ్‌కు అమ్మి డబ్బులు సంపాదించుకోవచ్చు. 


మరో ఆసక్తికర కథనం: స్టాండర్డ్‌ గ్లాస్‌ ఐపీవో షేర్లు మీకు వచ్చాయా? - అలాట్‌మెంట్‌ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో ఇలా చెక్‌ చేయండి