Types Of Online Frauds: సాంకేతికత రెక్కలు చాచేకొద్దీ ప్రజల పనులతో పాటు సైబర్ నేరాలు కూడా సులువుగా జరుగుతున్నాయి. ఎక్కడో గుర్తు తెలీని ప్రదేశంలో మాటు వేసిన సైబర్ నేరగాళ్లు ప్రజలను 14 మార్గాల్లో మోసం చేస్తున్నారు.
డిజిటల్ అరెస్ట్
ఈ మధ్యకాలంలో డిజిటల్ అరెస్ట్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రజలను దోచుకునేందుకు ఈ పద్ధతిని దుండగులు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దేశంలోని వివిధ నగరాల నుంచి ప్రతిరోజూ డిజిటల్ అరెస్ట్‌లకు సంబంధించిన వార్తలు వస్తున్నాయి. పలువురిని డిజిటల్ అరెస్ట్ చేస్తున్న సైబర్ దుండగులు లక్షలు, కోట్ల రూపాయలు దండుకుంటున్నారు.
లోన్ ఫ్రాడ్
సైబర్ వేటగాళ్లు, ఎలాంటి పత్రాలు లేకుండా రుణాలు ఇస్తామని చెబుతూ ఎంతో మందిని మోసం చేశారు. వారి వలలో ఎవరైనా చిక్కుకోగానే, లోన్ ఇప్పిస్తామని మభ్యపెడతారు & ముందుగా ఫీజ్ కట్టమని డిమాండ్ చేస్తారు. ఫీజ్ అందిన వెంటనే లైన్ కట్ చేస్తారు, ఆ నంబర్ మళ్లీ కలవదు.
లక్కీ డ్రా స్కామ్
ఈ స్కామ్‌లో, మీరు లాటరీని గెలుచారని లేదా లక్కీ డ్రా ప్రైజ్ విన్నర్ అయ్యారని చెబుతూ సందేశాలు పంపుతారు. పెద్ద అమౌంట్ గెలుచుకున్నారనే సందేశంతో ఆకర్షిస్తారు. ఆ ప్రైజ్ మనీ ఇవ్వాలంటే ముందుగా టాక్స్‌లు కట్టాలంటూ ట్రాప్ చేస్తారు. డబ్బు కట్టించుకున్న తర్వాత వాళ్ల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉండదు.
పెట్టుబడి మోసం
పెట్టుబడి అవసరాలను కూడా సైబర్ దుండగులు కూడా ఉపయోగించుకుంటున్నారు. కొన్ని స్కీమ్‌లలో పెట్టుబడి పెడితే పెద్ద మొత్తంలో రాబడి వస్తుందంటూ మభ్యపెడతారు. రూ.10 వేలకు రూ.50 వేలు, రూ.2 లక్షలకు రూ.10 లక్షలు, రూ.10 లక్షలకు రూ.50 లక్షలు వస్తానని హామీలు గుప్పిస్తారు. ఆ మాటలు నమ్మి ఎవరైనా పెట్టుబడి పెట్టగానే కంపెనీ మూసేసి మాయమవుతారు.
ఫిషింగ్ స్కామ్
ప్రజలను మోసం చేయడానికి ఈ పద్ధతిని కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇందులో, సైబర్ దుండగులు పెద్ద పెద్ద కంపెనీలు, ప్రభుత్వ శాఖలు, బ్యాంక్ అధికారులుగా పోజులిస్తూ SMSలు పంపుతారు. KYC పూర్తి చేయమని ప్రజలకు ఆర్డర్ వేస్తారు. దాని కోసం ప్రజల మొబైల్ నంబర్‌కు ఒక లింక్ పంపుతారు. ఆ లింక్‌ను క్లిక్ చేసిన తక్షణం బ్యాంక్ ఖాతాలో డబ్బులు మాయమవుతాయి.
జాబ్ స్కామ్
ఉద్యోగాల పేరుతో మోసపోయిన ఉదంతాలు అనేకం. సైబర్ దాడులు నిరుద్యోగ యువతకు నకిలీ ఉద్యోగాలకు రిక్రూట్‌మెంట్ లింక్‌లను పంపి, దరఖాస్తు చేయమని కోరుతారు. ఎవరైనా దరఖాస్తు చేసినప్పుడు, కిట్ & శిక్షణ పేరుతో అతడి నుంచి డబ్బులు దండుకుంటున్నారు.
మ్యాట్రిమోనియల్ సైట్ స్కామ్
మ్యాట్రిమోనియల్ సైట్లలో ఆకర్షణీయమైన ప్రొఫైల్ సృష్టించి, అటు వైపు వ్యక్తులతో పరిచయం పెంచుకుంటారు, పెళ్లి చేసుకుంటామని హామీ ఇస్తారు. ఆ తర్వాత, తమ కుటుంబంలో మెడికల్ ఎమర్జెన్సీ ఉందని చెప్పి డబ్బులు దోచుకెళతారు.
పార్శిల్ స్కామ్
ఈ స్కామ్‌లో, మోసగాళ్లు ప్రజలకు ఫోన్ చేసి మీ పేరిట పార్శిల్ వచ్చిందని చెబుతారు. ఆ పార్శిల్‌లో డ్రగ్స్ దొరికాయని, మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని బెదిరిస్తారు. అరెస్ట్ నుంచి తప్పించుకోవాలంటే డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేసి ప్రజలను మోసం చేస్తున్నారు.
డొనేషన్ స్కామ్
ఈ స్కాంలో మోసపోయిన వ్యక్తులు తాము మోసపోయామని కూడా గుర్తించడం లేదు. ప్రకృతి వైపరీత్యాలు, ఎన్జీవోలకు నిధులు సమకూర్చేందుకు దుండగులు ప్రజల నుంచి డబ్బులు అడుగుతుంటారు. పేదవాళ్లకు చికిత్స పేరుతోనో, మరో సేవా పనుల కోసమో మోసగాళ్లు డబ్బులు అడుగుతున్నారు.
క్యాష్ ఆన్ డెలివరీ స్కామ్
ఈ స్కామ్‌లో, మోసగాళ్లు నకిలీ వెబ్‌సైట్‌ను సృష్టిస్తారు & వివిధ వస్తువులపై కళ్లు బైర్లు కమ్మే ఆఫర్లు పెడతారు. ఎవరైనా ఈ వెబ్‌సైట్‌లో షాపింగ్ చేసి డబ్బులు చెల్లిస్తే, ఆ కస్టమర్‌కు నకిలీ ఉత్పత్తులు పంపుతారు లేదా అసలు వస్తువే పంపకుండా ఎగ్గొడతారు.
పొరపాటున డబ్బు పంపే మోసం
మీ ఖాతాలో కొంత డబ్బు క్రెడిట్ అయిందన్న నకిలీ సందేశాన్ని మోసగాళ్లు పంపుతారు. తర్వాత, మీకు కాల్ చేసి, పొరపాటున మీ నంబర్‌కు డబ్బు బదిలీ అయిందని చెబుతారు. తన డబ్బు తిరిగి ఇవ్వమని అభ్యర్థిస్తారు. అకౌంట్‌లో చెక్ చేసుకోకుండా, కేవలం ఆ సందేశాన్ని చూసి డబ్బులు పంపుతున్న వ్యక్తులు మోసపోతున్నారు.
KYC స్కామ్
సైబర్ నేరగాళ్లు ప్రభుత్వ అధికారుల్లా నటిస్తూ మీకు ఫోన్ చేస్తారు, KYC పత్రాలు సమర్పించాలని కోరతారు. వీళ్లను నమ్మిన ప్రజలు, KYC పూర్తి చేసేందుకు తమ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేస్తున్నారు. క్రిమినల్స్ ఆ సమాచారాన్ని ఉపయోగించుకుని బ్యాంక్ ఖాతా నుంచి నగదును బదిలీ చేసుకుంటున్నారు.
టెక్నికల్ సపోర్ట్ స్కామ్
సైబర్ దుండగులు మీ నంబర్‌కు కాల్ చేసి, మీ కంప్యూటర్ సిస్టమ్‌లో వైరస్ ఉందని భయపెట్టి, దానిని తొలగించడానికి ఒక లింక్‌ను పంపుతారు. ఆ మాటలు నమ్మి ఎవరైనా లింక్‌పై క్లిక్ చేసిన వెంటనే సిస్టమ్‌లో ఉన్న సమాచారం మొత్తం ఆ క్రిమినల్స్‌కు చేరుతుంది, దానిని ఉపయోగించుకుని వాళ్లు మోసానికి పాల్పడతారు.
సైబర్ మోసగాళ్ల నుంచి ఎలా రక్షించుకోవాలి?
మీకు తెలియని నంబర్ నుంచి వచ్చే సందేశాల్లోని లింక్‌లపై ఎప్పుడూ క్లిక్ చేయవద్దు. మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దు. మీ మొబైల్ నంబర్‌కు వచ్చే OTPని ఎవరికీ చెప్పకండి. డబ్బు చెల్లింపులు చేస్తున్నప్పుడు విశ్వసనీయ ప్లాట్‌ఫామ్‌ను మాత్రమే ఉపయోగించండి. మీరు సైబర్ మోసానికి గురైతే, మొదటి గంట లోపలే పోలీసులకు, బ్యాంక్ అధికారులకు, 'నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్' పోర్టల్‌లో ఫిర్యాదు చేయండి.
మరో ఆసక్తికర కథనం: ఇప్పుడు 5 స్టార్ హోటల్‌లో బస పెద్ద విషయమే కాదు - ఈ క్రెడిట్ కార్డ్స్ మీ దగ్గరుంటే చాలు!