Capital Gain Tax: ఒక ఇల్లు కొనాలన్నా, ఇప్పటికే ఉన్న ఇంటిని అమ్మాలన్నా.. ప్రతి వ్యక్తి మెదడులో వేలాది ప్రశ్నలు గిరగిరా తిరుగుతాయి. ముఖ్యంగా.. ఇంటిని అమ్మిన తర్వాత వచ్చే డబ్బు గురించి చాలా ఆలోచనలు ఉంటాయి. ఆ డబ్బుపై ఆదాయ పన్ను (Income Tax) కట్టాలా, వద్దా; ఒకవేళ కట్టాల్సి వస్తే ఎంత పన్ను కట్టాలి, పన్ను ఆదా చేయడానికి ఏవైనా మార్గాలు ఉన్నాయా? ఇలాంటి ప్రశ్నలు మనిషిని కుదురుగా ఉండనివ్వవు.


మూలధన లాభాల పన్ను ఏ విధంగా చెల్లించాలి?
- నివాస ఆస్తిని ‍‌(Residential Property) అమ్మడం వల్ల లాభం వస్తే, ఆ లాభం మీద పన్ను చెల్లించాలి. దీనిని మూలధన లాభాల పన్ను (Capital gains tax) అంటారు. 
- ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 48 ‍‌(Section 48 of the Income Tax Act) ప్రకారం... ఒక ఇంటిని కొనుగోలు చేసిన తేదీ నుంచి 2 సంవత్సరాల లోపు విక్రయిస్తే, దానిపై వచ్చే లాభాన్ని స్వల్పకాలిక మూలధన లాభం (Short term capital gain) లేదా STCG అంటారు. ఈ లాభం నేరుగా మీ ఆదాయంలో కలుస్తుంది. వర్తించే శ్లాబ్‌ రేట్‌ ప్రకారం టాక్స్‌ కట్టాలి. 
- ఇంటిని కొన్న తేదీ నుంచి 2 సంవత్సరాల తర్వాత విక్రయిస్తే, వచ్చే లాభాన్ని దీర్ఘకాలిక మూలధన లాభం (Long term capital gain) లేదా LTCG అంటారు. LTCG మీద 20 శాతం మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది.


ఆదాయ పన్ను ఆదా చేసే మార్గం ఇది
ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 54 (Section 54 of the Income Tax Act) ప్రకారం... మీరు మీ ఇంటిని అమ్మి, ఆ డబ్బుతో కొత్త నివాస ఆస్తిని కొంటే, దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నులో మినహాయింపు పొందొచ్చు. ఈ మినహాయింపు వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదార్లు (Individual tax payers) లేదా హిందూ అవిభక్త కుటుంబానికి (HUF) మాత్రమే అందుబాటులో ఉంటుంది. విక్రయించిన, ఆ డబ్బుతో కొన్న ఆస్తులేవీ వాణిజ్య ఆస్తులై (Commercial assets) ఉండకూడదు. 


పాత ఇంటిని విక్రయించిన నాటి నుంచి 2 సంవత్సరాల లోపు కొత్త ఇంటిని కొనుగోలు చేస్తే ఆదాయ పన్ను మినహాయింపు (Income tax exemption) లభిస్తుంది. ఒకవేళ మీరు కొత్త ఇల్లు కట్టుకుంటే, 3 సంవత్సరాల కాలం వరకు ఆ మినహాయింపు అందుబాటులో ఉంటుంది. 10 కోట్ల రూపాయల లోపు విలువైన ఆస్తిపై మాత్రమే దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను మినహాయింపు దక్కుతుంది. 2 సంవత్సరాల లోపు రెండు ఇళ్లను కొనుగోలు చేసినా టాక్స్‌ బెనిఫిట్‌ ఉంటుంది. అయితే, మొత్తం దీర్ఘకాలిక మూలధన లాభం 2 కోట్ల రూపాయలకు మించకూడదు.


లాభాన్ని ఎలా లెక్కగట్టాలి?
ఇంటిని అమ్మిన తర్వాత వచ్చే లాభాన్ని లెక్కించే సమయంలో.. ఆ ఆస్తి కొనుగోలు ధర నుంచి విక్రయ ధరను, రిజిస్ట్రేషన్ ఛార్జీలను తీసేస్తారు. మీరు ఆస్తి అభివృద్ధికి మరికొంత డబ్బు ఖర్చు చేసినట్లయితే, దానిని కూడా లాభం నుంచి తీసివేయవచ్చు. ఇంటిని విక్రయించడానికి అయ్యే బ్రోకరేజ్, లీగల్ ఫీజులు వంటివి కూడా లాభం నుంచి తీసేస్తారు. మీ పెట్టుబడి + ఖర్చులన్నీ పోను మిగిలిన డబ్బు లాభం అవుతుంది.


మరో ఆసక్తికర కథనం: భారతి హెక్సాకామ్ బంపర్ లిస్టింగ్, ఇన్వెస్టర్లకు లాభాల పంట