Bharti Hexacom Shares Listing Price: ప్రముఖ టెలికాం కంపెనీ భారతి ఎయిర్‌టెల్ అనుబంధ సంస్థ భారతి హెక్సాకామ్ షేర్లు ఈ రోజు (శుక్రవారం, 12 ఏప్రిల్‌ 2024) స్టాక్ మార్కెట్‌లో లిస్ట్‌ అయ్యాయి. BSEలో ఈ షేర్లు దాదాపు 33 శాతం ప్రీమియంతో, రూ.755.20 దగ్గర అరంగేట్రం చేశాయి. IPO సమయంలో, ఒక్కో షేరును రూ.542 నుంచి 570 మధ్య భారతి హెక్సాకామ్ విక్రయించింది. 26 షేర్లను ఒక లాట్‌ చొప్పున అమ్మింది.


NSEలో భారతి హెక్సాకామ్ ఒక్కో షేరు రూ. 755 వద్ద నమోదైంది. భారతి ఎయిర్‌టెల్ అనుబంధ సంస్థ ప్రవేశానికి స్టాక్ మార్కెట్ బలమైన ఆమోదముద్ర వేసినట్లు ఈ రోజు లిస్టింగ్ గెయిన్స్‌ను బట్టి అర్ధమవుతుంది. ఈ రోజు మార్కెట్‌ నష్టాల్లో ఉన్నప్పటికీ భారతి హెక్సాకామ్ పెట్టుబడిదార్లు అద్భుతమైన లిస్టింగ్ గెయిన్స్‌ అందుకున్నారు.


ఒక్కో షేరుపై రూ.185 లాభం, ఒక లాట్‌పై రూ.4,810 ప్రాఫిట్‌
భారతి హెక్సాకామ్‌ ఒక్కో షేరుపై పెట్టుబడిదార్లు రూ.185 చొప్పున లాభపడ్డారు. ఎన్‌ఎస్‌ఇలో ఒక్కో షేరుకు రూ.185, బీఎస్‌ఇలో రూ.185.20 చొప్పున లిస్టింగ్‌ గెయిన్స్‌ దక్కించుకున్నారు. ఒక్కో లాట్‌పై రూ.4,810 ప్రాఫిట్‌ (185 x 26 షేర్లు) వచ్చింది. లిస్టయిన వెంటనే ఈ షేర్లు రూ.767 వరకు వెళ్లడంతో ఇన్వెస్టర్ల లాభాలు మరింత పెరిగాయి.


భారతి హెక్సాకామ్ IPO వివరాలు
భారతి హెక్సాకామ్ ఐపీవో సైజ్‌ రూ. 4275 కోట్లు. ఈ నెల 03 నుంచి 05 తేదీల మధ్య లైవ్‌ అయింది. ఈ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా వచ్చింది, ఇందులో ఒక్క తాజా షేర్ కూడా జారీ కాలేదు. మొత్తం 7.5 కోట్ల షేర్లు ఐపీఓ ద్వారా అమ్ముడయ్యాయి. టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఆఫ్ ఇండియా (TCIL), ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 7.5 కోట్ల షేర్లు లేదా 15 శాతం వాటాను విక్రయించింది. 


భారతి హెక్సాకామ్ IPO మొత్తం 29.88 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. ముఖ్యంగా సంస్థాగత పెట్టుబడిదారుల కోటా 48.57 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్ అయింది. నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కేటగిరీ 10.52 రెట్లు సబ్‌స్క్రైబ్ కాగా, రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 2.83 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది.


IPO ముందు వరకు, భారతి హెక్సాకామ్‌లో సునీల్ భారతి మిత్తల్‌కు చెందిన భారతి ఎయిర్‌టెల్ 70 శాతం, TCILకు 30 శాతం చొప్పున వాటాలు ఉన్నాయి. ఇప్పుడు, TCIL వాటా తగ్గుతుంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: పెట్రోల్ బంకుల్లో జరుగుతున్న 7 రకాల మోసాలు, బహుపరాక్‌