NPS Vatsalya Benifits And Scheme Details In Telugu: ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman), 2024 బడ్జెట్ సమయంలో NPS వాత్సల్య పథకం గురించి ప్రకటించారు. చిన్న పిల్లల పేరిట ఓపెన్‌ చేసే పెన్షన్ స్కీమ్ అని కూడా దీని గురించి చెప్పొచ్చు. ఇందులో, తల్లిదండ్రులు లేదా సంరక్షకులు పిల్లల (మైనర్‌) పేరిట ఎన్‌పీఎస్ వాత్సల్య ఖాతాను ప్రారంభించొచ్చు. పిల్లలకు 18 ఏళ్లు నిండినప్పుడు (మేజర్‌ అయినప్పుడు) ఆ ఖాతా సాధారణ NPS ఖాతాగా మారుతుంది. 


ఇప్పటివరకు NPSలో ‍‌(National Pension System) పెట్టుబడులకు మేజర్లకు మాత్రమే అనుమతి ఉండేది. ఇప్పుడు, మైనర్ల కోసం కూడా ఖాతా ప్రారంభించడం వల్ల, వాళ్లు రిటైర్‌ అయ్యేనాటికి మరింత ఎక్కువ మొత్తం డబ్బు ఈ అకౌంట్‌లో పోగవుతుంది.


సంవత్సరానికి 1000 రూపాయలు కూడా చాలు
మీ పిల్లల భవిష్యత్తును సురక్షితంగా ఉంచడానికి NPS వాత్సల్య స్కీమ్‌ కింద పెన్షన్ ఖాతాను ప్రారంభించొచ్చు. దీనిని PFRDA నిర్వహిస్తుంది, భారత ప్రభుత్వ మద్దతు ఉంటుంది. కాబట్టి, ఈ అకౌంట్‌లో పెట్టుబడి పెట్టడానికి భయపడాల్సిన అవసరం లేదు. కేంద్ర ఆర్థిక మంత్రి, ఎన్‌పీఎస్ వాత్సల్య కోసం ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను కూడా ప్రారంభించారు. ఖాతా ప్రారంభించగానే, ఆ మైనర్‌ పేరిట 'పర్మినెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్‌' (PRAN) జారీ అవుతుంది. ఏడాదికి కనీసం రూ.1000 పెట్టుబడితో ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. ఈ పథకంలో జమ చేసే డబ్బులో 75% మొత్తాన్ని ఈక్విటీల్లో, 25% మొత్తాన్ని గవర్నమెంట్‌ సెక్యూరిటీల్లో పెట్టుబడిగా పెడతారు. గణాంకాల ప్రకారం, ఎన్‌పీఎస్‌ను లాంచ్‌ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు సగటున 12.86 శాతం రాబడి వచ్చింది.


అకౌంట్‌ ఎక్కడ ఓపెన్‌ చేయాలి?
అన్ని బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఎన్‌పీఎస్‌ వాత్సల్య ఖాతాను తెరవొచ్చు. దీని కోసం, పిల్లల జనన ధృవీకరణ పత్రం, తల్లిదండ్రుల KYC అవసరం.


3 సంవత్సరాలలాక్ ఇన్-పీరియడ్
రూల్స్‌ ప్రకారం, చిన్నారికి 18 సంవత్సరాలు రాగానే ఎన్‌పీఎస్‌ వాత్సల్య అకౌంట్‌ సాధారణ NPS ఖాతా (టైర్‌-1)గా మారుతుంది, ఆ ప్రకారం అకౌంట్‌ రూల్స్‌ మారతాయి. అప్పుడు కూడా మీ పెట్టుబడి ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. NPS వాత్సల్య అకౌంట్‌కు 3 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. ఈ లోపు డబ్బు వెనక్కు తీసుకోవడం కుదరదు.


విత్‌డ్రా రూల్స్‌
మూడు సంవత్సరాల లాక్‌-ఇన్‌ పిరియడ్‌ ముగిసిన తర్వాత, అత్యవసర సమయాల్లో ఈ ఖాతా నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. మీ చిన్నారి విద్య, అనారోగ్యం, వైకల్యానికి చికిత్స వంటివాటి కోసం, అకౌంట్‌లో ఉన్న మొత్తంలో 25 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు. డబ్బు విత్ డ్రా చేసుకునే వెసులుబాటు కేవలం 3 సార్లు మాత్రమే ఉంటుంది. 


ఖాతా రద్దు చేసుకోవాలంటే?
ఎన్‌పీఎస్‌ వాత్సల్య ఖాతా రద్దు చేసుకోవాలనుకుంటే, మీ అకౌంట్‌లో బ్యాలెన్స్ రూ. 2.5 లక్షల కంటే ఎక్కువ ఉంటే, ఆ మొత్తంలో 20 శాతం డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగతా 80 శాతంతో యాన్యుటీ పథకాలు కొనుగోలు చేయాలి. అకౌంట్‌ డబ్బు మొత్తం రూ. 2.5 లక్షల కంటే తక్కువ ఉంటే ఆ డబ్బు మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ ఖాతాదారు మరణిస్తే ఆ డబ్బును తల్లిదండ్రులు/సంరక్షకులు/నామినీకి చెల్లిస్తారు. 


పన్ను ప్రయోజనాలు
ఈ పథకంలో పెట్టుబడులపై పన్ను ప్రయోజనాలకు (tax benifits) సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు లేవు. అయితే, ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C & 80CCD (1B) కింద మినహాయింపులు పొందొచ్చని నిపుణులు భావిస్తున్నారు.


మరో ఆసక్తికర కథనం: ఈ పండుగ సీజన్‌లో ఇ-కామర్స్‌ కంపెనీలు ఎంత ఆర్జిస్తాయో తెలుసా? - లెక్కలు చూస్తే మైండ్‌ బ్లాంక్‌