PM Mudra Yojana Details In Telugu: భారత ప్రభుత్వం దేశంలోని విద్యార్థులు, ఉద్యోగాలు, రైతులు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు.. ఇలా అన్ని రకాల వర్గాల కోసం అనేక పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాలను సద్వినియోగం చేసుకున్నవాళ్లు వృద్ధిలోకి వస్తున్నారు. అలాగే, సొంతం వ్యాపారం ప్రారంభించాలనుకునే ఔత్సాహికుల కోసం కూడా కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని అమలు చేస్తోంది.
చాలా మంది సొంతంగా వ్యాపారం స్టార్ చేయాలనుకుంటారు లేదా ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటారు. కానీ, పెట్టుబడి కోసం డబ్బు లేక, అవకాశాలను అందుకోలేక వెనకబడుతుంటారు. ఇలా, పెట్టుబడి లేక అవకాశాలను కోల్పోకుండా ఉండేందుకు వ్యాపారస్తులకు భారత ప్రభుత్వం సాయం చేస్తుంది. వ్యాపారులకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న పథకం పేరు "ప్రధాన మంత్రి ముద్ర యోజన" (PM Mudra Yojana). ఈ పథకం కింద, కేంద్ర ప్రభుత్వం, వ్యాపారం ప్రారంభించే/ విస్తరించే వ్యక్తులకు భారీ మొత్తంలో రుణం ఇస్తుంది.
ఒక కొత్త వ్యాపారాన్ని స్టార్ చేయాలి లేదా ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని మరింత పెంచుకోవాలన్న ఉత్సాహం & సరైన ప్రణాళిక మీ దగ్గర ఉంటే, మీరు కూడా ప్రధాన మంత్రి ముద్ర యోజన (PMMY) కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
రూ. 20 లక్షల వరకు రుణం
భారత ప్రభుత్వం అమలు చేస్తున్న PM ముద్ర పథకం కింద, వ్యవసాయేతర రంగంలో చిన్న & సూక్ష్మ పరిశ్రమలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. కార్పొరేట్ లేదా వ్యవసాయ రంగాలకు PMMY లోన్ ఇవ్వరు. తయారీ, వర్తకం & సేవల ద్వారా ఆదాయాన్ని ఆర్జించే వ్యవసాయేతర సంస్థలకు రుణాలు అందుబాటులో ఉంటాయి. యువ వ్యాపారవేత్తలకు ఈ పథకం ఒక సువర్ణ అవకాశం. గతంలో, ప్రధాన మంత్రి ముద్ర యోజన కింద ప్రభుత్వం రూ.10 లక్షల వరకు రుణం ఇచ్చేది, దానిని రూ. 20 లక్షలకు పెంచింది.
నాలుగు రకాల రుణాలు (Pradhan Mantri Mudra Yojana has four types of loan)
ప్రధాన మంత్రి ముద్ర యోజన కింద, భారత ప్రభుత్వం నాలుగు రకాల రుణాలు అందిస్తోంది. అవి - 1. శిశు (Shishu) కేటగిరి, 2. కిశోర్ (Kishore) కేటగిరిగి, 3. తరుణ్ (Tarun) కేటగిరి, 4. తరుణ్ ప్లస్ (Tarun Plus).
1. శిశు కేటగిరీ కిందకు వచ్చే వ్యాపారస్తులకు భారత ప్రభుత్వం రూ. 50 వేల వరకు రుణం ఇస్తుంది.
2. కిశోర్ కేటగిరీ కిందకు వచ్చే వ్యక్తులు రూ. 50 వేల నుంచి రూ. 5 లక్షల వరకు రుణం తీసుకోవడానికి అర్హులు.
3. తరుణ్ కేటగిరీ కింద రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు రుణం లభిస్తుంది.
4. తరుణ్ ప్లస్ కేటగిరీలోకి వచ్చే వ్యాపారవేత్తలకు రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు లోన్ మంజూరు అవుతుంది.
ప్రధాన మంత్రి ముద్ర లోన్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
ప్రధాన మంత్రి ముద్ర లోన్ కోసం ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు. ముద్ర యోజన కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి... ఉద్యమమిత్ర అధికారిక పోర్టల్ www.udyamimitra.in లోకి వెళ్లాలి. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి... మీ సమీపంలోని బ్యాంక్ లేదా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC) లేదా ఏదైనా MFI శాఖను సందర్శించవచ్చు.
మరో ఆసక్తికర కథనం: ఎస్‌బీఐ కొత్త స్కీమ్‌తో ప్రతి ఇంట్లో లక్షాధికారి - మీ పిల్లలు, తల్లిదండ్రుల కోసం పవర్‌ఫుల్ పథకాలు