SBI Har Ghar Lakhpati Scheme: దిగువ మధ్య తరగతి & అంతకుమించి ఎక్కువ ఆదాయ వర్గాల భవిష్యత్‌ ఆర్థిక అవసరాలను తీర్చడానికి స్టేట్ బ్యాంక్ రెండు కొత్త పథకాలను లాంచ్‌ చేసింది. దీనిలో ఒకటి.. హర్ ఘర్ లఖ్‌పతి స్కీమ్‌. ఇది రికరింగ్‌ డిపాజిట్‌ పథకం (SBI RD Scheme). ఇది కాకుండా, 80 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం ప్యాట్రన్స్‌ (SBI Patrons Schem) పేరుతోనూ మరో కొత్త పథకాన్ని ప్రారంభించింది, ఇది ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకం (SBI FD Scheme).


ఎస్‌బీఐ హర్ ఘర్ లఖపతి పథకం వివరాలు
హర్ ఘర్ లఖ్‌పతి యోజన కింద, బ్యాంక్‌ కస్టమర్‌ కనీసం 1 లక్ష రూపాయలు డిపాజిట్‌ చేయాలి. దీనికి మించి పెట్టుబడి పెట్టాలంటే రూ.లక్ష చొప్పున పెంచుకుంటూ (రూ.లక్ష గుణిజాలు) వెళ్లాలి. పెద్దవాళ్లతో పాటు పిల్లలు (మైనర్స్‌) కూడా ఈ స్కీమ్‌ కింద అకౌంట్‌ ప్రారంభించవచ్చు. పిల్లల్లో మొదటి నుంచి పొదుపు అలవాటును పెంచేందుకు, ఆర్థిక ప్రణాళికలో క్రమశిక్షణ అందించేందుకు దీనిని రూపొందించారు. ఈ రికరింగ్‌ డిపాజిట్‌ కనీస కాల వ్యవధి 12 నెలలు (1 సంవత్సరం) - గరిష్ట కాల వ్యవధి 120 నెలలు (10 సంవత్సరాలు). 


ఎస్‌బీఐ ప్యాట్రన్స్‌ స్కీమ్ వివరాలు
ఎస్‌బీఐ ప్యాట్రన్స్‌ ఫథకాన్ని 80 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సున్న కస్టమర్ల (సూపర్‌ సీనియర్‌ సిటిజన్స్‌) కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాన్ని ప్రస్తుత SBI కస్టమర్లు & కొత్త కస్టమర్లు కూడా ఉపయోగించుకోవచ్చు.


సూపర్‌ సీనియర్‌ సిటిజన్లకు ఎక్కువ వడ్డీ
ఈ స్కీమ్‌ కింద, సీనియర్‌ సిటిజన్లకు ఇస్తున్న వడ్డీ రేట్ల కంటే మరో 10 బేసిస్‌ పాయింట్ల (0.10 శాతం) అదనపు వడ్డీ సూపర్‌ సీనియర్‌ సిటిజన్లకు లభిస్తుంది. ఈ స్కీమ్‌ కింద, కనిష్టంగా 12 నెలల కాలం నుంచి గరిష్ఠంగా 120 నెలల వరకు ఎఫ్‌డీ వేసే సదుపాయం ఉంది.


కస్టమర్ల డిమాండ్స్‌కు అనుగుణంగా ఈ రెండు కొత్త పథకాలను లాంచ్‌ చేసినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ సీఎస్ శెట్టి చెప్పారు.


ఎస్‌బీఐ వికేర్ పథకం
వృద్ధుల కోసం, ఎస్‌బీఐ వికేర్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాన్ని (SBI Wecare FD Scheme) స్టేట్ బ్యాంక్ చాలా కాలం క్రితమే ప్రారంభించింది. ఈ డిపాజిట్ పథకంలో వడ్డీ రేటు 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల కాలానికి 7.5 శాతం. అదేవిధంగా... SBI 444 Days FD పథకంలో సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీ రేటును బ్యాంక్‌ ఆఫర్‌ చేస్తోంది. ఈ పథకం 31 మార్చి 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.


స్టేట్‌ బ్యాంక్‌లో రికరింగ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు దాదాపుగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్ల స్థాయిలోనే ఉన్నాయి. ప్రస్తుతం... ఏడాదికి కంటే ఎక్కువ కాల వ్యవధి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 6.80 శాతం, రెండేళ్లు దాటిన డిపాజిట్లపై 7 శాతం, 3 నుంచి 5 ఏళ్ల కాల వ్యవధి డిపాజిట్లపై 6.75 శాతం, 5 నుంచి 10 ఏళ్ల డిపాజిట్లపై 6.5 శాతం వడ్డీని బ్యాంక్‌ చెల్లిస్తోంది.


మరో ఆసక్తికర కథనం: రూ.8 లక్షల దగ్గర ప్యూర్‌ గోల్డ్‌, రూ.లక్ష దగ్గర వెండి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ