Central Government Pensioners:


పదవీ విరమణ పొందాక చాలామంది ఇంట్లోనే ఖాళీగా ఉంటారు. చేయడానికి పనుండదు. ఒకవేళ బయటకెళ్లి ఉపాధి పొందుదామన్నా వయసు అయిపోందని ఎవ్వరూ ఇవ్వరు. అలాంటప్పుడు పింఛన్ డబ్బులే వారిని ఆర్థికంగా ఆదుకుంటాయి. అప్పటికి వచ్చేదే అరకొర మొత్తం! దాని పైనా ఆదాయపన్ను చెల్లించాల్సి రావడం బాధాకరంగా ఫీలవుతుంటారు. తెలియక చాలామంది పూర్తిగా పన్ను చెల్లిస్తారు. కొన్ని కిటుకులు తెలిస్తే ఏడాదికి రూ.7,99,000 వరకు పింఛను పొందుతున్నా జీరో టాక్స్‌తో బయటపడొచ్చు.


స్టాండర్డ్‌ డిడక్షన్‌


రిటైర్మెంట్‌ తర్వాత చేతికి అందేది పింఛను, బ్యాంకు డిపాజిట్లపై వడ్డీలు మాత్రమే. ఉదాహరణకు మీ పింఛను రూ.5 లక్షలు అనుకుందాం. బ్యాంకు వడ్డీ కింద మరో రూ.2,49,000 వస్తున్నాయని భావిద్దాం. అప్పుడు మీ మొత్తం ఆదాయం రూ.7,99,000 అవుతుంది. పాత పన్ను విధానం ప్రకారం లెక్కిస్తే స్టాండర్ట్‌ డిడక్షన్‌ కింద రూ.50,000 మినహాయింపు ఉంటుంది. సెక్షన్‌ 80 టీటీబీ కింద బ్యాంకు వడ్డీలపై రూ.50,000, మెడిక్లెయిమ్‌ కింద రూ.50,000 మినహాయింపు పొందొచ్చు. అప్పుడు మీరు పన్ను చెల్లించాల్సిన ఆదాయం రూ.6,49,000 అవుతుంది.


Also Read: అప్పు రూ.20వేలకు మించొద్దు - ఇంట్లో దాచుకొనే డబ్బు, లావాదేవీలపై ఐటీ లిమిట్స్‌!


Also Read: వారెన్‌ బఫెట్‌ స్టైల్లో పెట్టుబడి పెడతారా? ఇవిగో ఐదు స్టాక్స్‌


పీపీఎఫ్‌తో ప్రయోజనం


పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (PPF)లో డబ్బు ఆదా చేసుకోవడం మరో బెటర్‌ ఆప్షన్‌. ఇందులో ఏడాదికి రూ.150,000 మదుపు చేస్తే ఆదాయపన్ను చట్టం ఛాప్టర్‌ VI-A కింద మినహాయింపు లభిస్తుంది. అప్పుడు పన్ను చెల్లించాల్సిన ఆదాయం రూ.4,99,000 అవుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన రూ.5 లక్షల రిబేట్‌ పరిమితిలోకి వస్తుంది. రూ.3 లక్షల ఆదాయం పొందుతున్న సీనియర్‌ సిటిజన్ల పన్ను బాకీని ప్రభుత్వం  జీరోగా ఫిక్స్‌ చేసింది. అలాంటప్పుడు రూ.3 నుంచి 5 లక్షల లోపు ఆదాయం గల పింఛన్‌ దారులు గరిష్ఠంగా 5 శాతం అంటే రూ.12,500 పన్ను చెల్లించాల్సి ఉంటుంది.


రిబేటు క్లెయిమ్‌ చేస్తే


కేంద్ర ప్రభుత్వం ఇక్కడే కొన్ని ప్రయోజనాలు కల్పించింది. సెక్షన్‌ 87ఏ కింద నికర పన్ను ఆదాయం రూ.5 లక్షల లోపు ఉన్నవారు రిబేట్‌ క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఇప్పుడు పన్ను చెల్లించాల్సి ఆదాయం రూ. 5 లక్షల లోపే ఉంది కాబట్టి రూ.12,500 రిబేట్‌ను క్లెయిమ్‌ చేసుకుంటే ఆ మేరకు రీఫండ్‌ వస్తుంది. అప్పుడు మీరు చెల్లించిన టాక్స్‌ 'జీరో' అవుతుంది.