ఉద్యోగిని.. మూడు లక్షలు వడ్డీ లేకుంగా.
మహిళలకు ఆర్ధిక స్వావలంబన అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలతో ముందుకొస్తోంది. దీనిలో భాగంగా కేంద్రం తెచ్చిన పథకమే ‘ఉద్యోగిని’. ఈ స్కీమ్ ద్వారా మహిళలకు రూ. మూడు లక్షల వరకు వడ్డీ లేని రుణం అందిస్తారు. వడ్డీ లేకుండా అప్పివ్వడమే కాదు.. తీసుకున్న అప్పులో యాభై శాతం వరకు మాఫీ కూడా చేస్తారు. మహిళలు వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడాలనే ఉద్దేశంతో.. నిరుపేద మహిళలకు సైతం వ్యాపారానికి ఎలాంటి ఆర్థిక అవరోధాలు ఉండకూడదనే లక్ష్యంతో కేంద్రం ఈ పథకం తెచ్చింది. దీని ద్వారా చిన్నతరహా కుటీర పరిశ్రమలు, కిరాణా దుకాణాలు, బేకరీ, బ్యూటీ పార్లర్లు, క్యాంటీన్, కేటరింగ్, కాఫీ, టీ పౌడర్ తయారీ, డయాగ్నస్టిక్ సెంటర్, డ్రై క్లీనింగ్, గిఫ్ట్ ఆర్టికల్స్, జిమ్, ఐస్ క్రీమ్ పార్లర్, టైలరింగ్ షాపులు, అగరబత్తుల తయారీ, పాల డెయిరీ, గ్రంథాలయం, మట్టి పాత్రల తయారీ, గాజుల తయారీ, పేపర్ ప్లేట్ల తయారీ వంటి 88 రకాల వ్యాపారాలు చేసేందుకు వీలుంది.
దీనికి ఎవరు అర్హులు?
- ఈ స్కీమ్ కేవలం మహిళలకోసమే రూపొందించారు. కాబట్టి 18 నుంచి 55 సంవత్సరాల లోపు వయసున్న మహిళలు దరఖాస్తుదారులై ఉండాలి.
- వార్షికాదాయం లక్షన్నరకు మించకూడదు.
- దివ్యాంగులు, వితంతువులకు ఎలాంటి ఆదాయ గరిష్ట పరిమితి లేదు.
- క్రెడిట్ స్కోర్ బాగుండాలి. గతంలో లోన్ తీసుకుని ఎగ్గొట్టి ఉండకూడదు.
ఏమేం డాక్యుమెంట్లు కావాలి..?
- మూడు పాస్పోర్టు సైజ్ ఫోటోలు, ఫోటో గుర్తింపు కార్డు (ఆధార్, రేషన్ లేదా ఓటర్)
- డీపీఆర్( డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు) అంటే.. మీరు ఏం చేయాలనుకుంటున్నారు? దానికి ఎంత ఖర్చు అవుతుంది? రాబడి వచ్చే మార్గాలేంటి తదితరాలతో కూడిన ఒక నివేదిక.
- ఏ రంగంలో వ్యాపారం చేయాలనుకుంటున్నారో దాంట్లో గతంలో ఉన్న అనుభవం తాలూకు ధ్రువ పత్రాలు లేదా.. శిక్షణ పొందిన సర్టిఫికెట్లు..
- కుటుంబ వార్షికాదాయ ధ్రువీకరణ పత్రం..
- కుల ధ్రువీకరణ పత్రం.
- వ్యాపారానికి అయ్యే పెట్టుబడిపై కొటేషన్..
ఎలా దరఖాస్తు చేయాలి..?
- దీనికోసం సంబంధిత బ్యాంకు వెబ్ సైట్ నుంచి ఉద్యోగిని స్కీమ్‌కి చెందిన దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకోవాలి.
- దాన్ని పూర్తిగా ఫిల్ చేసి మీ దగ్గరున్న డాక్యుమెంట్లు జత చేసి డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టుతో బ్యాంకు మేనేజర్‌ని కలిసి ఆయన కన్విన్స్ అయ్యేదా దానిపై వివరించాలి.
- మీరు సమర్పించిన డీపీఆర్ ద్వారా మీరు లోన్ తిరిగి చెల్లించగలరని సంబంధిత బ్యాంకు మేనేజర్ నమ్మితే మీకు లోన్ కచ్చింతంగా వస్తుంది.
ఎవరెవరికి ఎలా వర్తిస్తుంది..?
- ఎస్సీ,ఎస్టీ వర్గాలకు చెందిన మహిళలకు కనీసం రూ. లక్ష నుంచి రూ. మూడు లక్షల వరకు రుణాలిస్తారు. దీంట్లో 50 శాతం సబ్సిడీ దొరుకుతుంది. వడ్డీ కూడా ఉండదు.
- బీసీ, జనరల్ వర్గాలకు చెందిన మహిళలకు రూ. మూడు లక్షల వరకు రుణాలిస్తారు. 30 శాతం సబ్సిడీ దొరుకుతుంది. వడ్డీ బ్యాంకులను బట్టీ 8 నుంచి 12 శాతం లోపు ఉంటుంది.