IT Rules applies on Gold buying: బంగారం అంటే ఇష్టపడని భారతీయులు ఎవరుంటారు? ఎప్పుడెప్పుడు ధర తగ్గుతుందా కొనేద్దామా అని ఎదురు చూస్తుంటారు. 2022, మార్చిలో 19 నెలల గరిష్ఠానికి చేరిన పుత్తడి ధర మెల్లగా తగ్గుముఖం పట్టింది. డాలర్‌ విలువ పెరగడం, రూపాయి విలువ తగ్గడం ఇందుకు దోహదం చేసింది. ధర తగ్గింది కదా అని చాలామంది ఎడాపెడా కొనేద్దామని అనుకుంటున్నారు! మీరూ ఆ కోవకే చెందితే కాస్త ఆగండి. ఆదాయ పన్ను చట్టం ప్రకారం ఒక వ్యక్తి తన వద్ద ఎంత బంగారం నిల్వ ఉంచుకోవచ్చో తెలుసుకోండి. అప్పుడే ఇన్‌కం టాక్స్‌ నోటీసుల నుంచి తప్పించుకోవచ్చు.


భారత దేశంలో ఒక వ్యక్తి ఎంత బంగారం దాచుకోవచ్చో పరిమితులేమీ లేవని ఇన్వెస్ట్‌మెంట్‌, టాక్స్‌ నిపుణులు అంటున్నారు. వివాదాలు తలెత్తినప్పుడు ఒక యూనిఫామిటీ కోసం సీబీడీటీ కొన్ని పరిమితులు నిర్దేశించుకుంది. ఆ నిబంధనల ప్రకారం పెళ్లైన మహిళలు ఎలాంటి ఇన్వాయిసులు లేకుండా 500 గ్రాముల బంగారు నగలు ఉంచుకోవచ్చు. పెళ్లికాని యువతీ యువకులు వరుసగా 250 గ్రాములు, 100 గ్రాములు ఉంచుకోవచ్చు. ఈ పరిమితుల వరకు ఐటీ అధికారులు బంగారాన్ని సీజ్‌ చేయడానికి వీల్లేదు. అలాగని సమాజంలో హోదా, ఆదాయం బాగుందని ఎక్కువ బంగారం ఉంచుకుంటామంటే సీబీటీటీ నిబంధనలు ఒప్పుకోవు. అలాగే మీ కుటుంబంతో సంబంధం లేని వ్యక్తుల బంగారం మీ వద్ద ఉంటే పరిమాణంతో సంబంధం లేకుండా ఎంత మొత్తమైనా సీజ్‌ చేస్తారు.


ఒక వ్యక్తి ఇన్వాయిస్‌లు, కొనుగోలు వివరాలు ఉన్నంత వరకు ఎంత బంగారమైనా ఇంట్లో పెట్టుకోవచ్చు. కొంతమందికి వారసత్వంగా బంగారం ప్రాప్తిస్తుంది. అలాంటప్పుడు వీలునామా, ఎవరిచ్చారో వారి ఐటీఆర్‌ను ఆధారంగా భద్రపర్చుకోవాలి. పరిమితులకు మించి ఎక్కువ పుత్తడిని కొనుగోలు చేసి టాక్స్‌ చెల్లిస్తే ఆ డాక్యుమెంటును మీ వద్ద ఉంచుకోవాలి. అందుకే ఎప్పుడైనా బంగారం కొనుగోలు చేస్తే ఆ వివరాలను ఐటీఆర్‌లోని 'అసెట్స్‌ లేదా ఆస్తుల' కాలమ్‌లో నమోదు చేయాలి. మన దేశంలో ఇన్వాయిస్‌ లేకుండా ఎంత పుత్తడి లేదా బంగారు నగలనైనా ఉంచుకోవచ్చని చాలామంది అనుకుంటున్నారు. అలాంటప్పుడు బంగారంపై పన్నులు, ఇతర వివరాలను తెలుసుకోవడం ముఖ్యమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.


Also Read: తక్కువ వడ్డీకి హోమ్‌ లోన్‌ కావాలా? ఈ ఒక్కటీ ఉంటే LIC ఇచ్చేస్తోంది!


Also Read: ఈ పూలు పూయించండి! లక్షల్లో ఆదాయం పొందండి!