LIC Home Loan: చక్కగా స్థిరపడాలి. ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి. ప్రతి సామ్యానుడు కనే కల ఇదే! తన సంపాదనతోనే ఇల్లు కట్టుకోవాలని చాలా మందికి ఉంటుంది. కానీ తక్కువ ఆదాయం, పెరుగుతున్న ఖర్చులతో ఇది అసాధ్యంగా మారిపోతోంది. అప్పు తీసుకోవాల్సిన అగత్యం ఏర్పడుతోంది. అలాంటి వారికి ఒక గుడ్ న్యూస్!
LIC HFL ఆఫర్లు
త్వరలోనే ఇల్లు కట్టుకోవాలని లేదా కొనుగోలు చేద్దామని ప్రణాళికలు వేస్తున్న వారి కోసం ఎల్‌ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ చక్కని ఆఫర్లు ప్రకటించింది. అతి తక్కువ వడ్డీరేట్లకే గృహ రుణాలను మంజూరు చేస్తోంది. మీకు గనక రుణం మంజూరైతే చెల్లించాల్సిన వడ్డీ కేవలం 6.66 శాతమే. మీ సిబిల్ స్కోరును బట్టి వడ్డీరేటును సవరిస్తోంది.
CIBIL స్కోరు బాగుంటే
కాస్త తక్కువ సిబిల్ స్కోర్ ఉన్నవారికీ ఎల్‌ఐసీ ఇంటి రుణాలను మంజూరు చేస్తోంది. అయితే ఎక్కువ సిబిల్ స్కోర్ ఉంటే తక్కువ వడ్డీకే ఆఫర్ చేస్తోంది. భార్యాభర్తలు కలిసి గృహరుణం తీసుకుంటే ఇద్దరిలో ఎవరి సిబిల్ స్కోరు ఎక్కువ ఉందో వారిదే ఇవ్వాలి. అప్పుడు తక్కువ వడ్డీరేటు అమలవుతుంది. సిబిల్ స్కోరు 700 అంతకన్నా ఎక్కువుంటే ఎల్‌ఐసీ వద్ద ఇంటి రుణం సులభంగా పొందొచ్చు. ఇది పరిమిత కాలపు ఆఫర్.
ప్రాపర్టీలో ఎంత విలువ?
మీ ప్రాపర్టీలో 90 శాతం వరకు ఎల్‌ఐసీ ఇంటి రుణం మంజూరు చేస్తోంది. మీరు రూ.30 నుంచి 75 లక్షల వరకు దరఖాస్తు చేసుకుంటే మీ ప్రాపర్టీలో 80 శాతం వరకు లోన్ ఇస్తుంది. అదే రూ.75 లక్షల కన్నా ఎక్కువ రుణం కోసం దరఖాస్తు చేస్తే ప్రాపర్టీ విలువలో 75 శాతం వరకు మంజూరు చేస్తోంది. ఎల్ఐసీ వద్ద రుణం కోసం దరఖాస్తు చేయడం చాలా సులువు. ఇతర బ్యాంకులు తీసుకొనే డాక్యుమెంట్లనే ఇస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు గనక గృహ రుణం కోసం ప్రయత్నిస్తుంటే మీ సిబిల్ స్కోరును బాగా పెంచుకోండి. ఎప్పుడూ ఈఎంఐలను ఎగవేయొద్దు. నెలవారీ వాయిదాలను ఆలస్యం చేయొద్దు.