Multibagger Business Idea: ఉద్యోగం చేస్తూనే అదనపు ఆదాయ వనరుల కోసం చాలా మంది వెతుకుతుంటారు! కొంత కష్టపడ్డా తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి వచ్చే బిజినెస్‌ ఐడియాల గురించి ఆలోచిస్తుంటారు. అలాంటి వారికోసమే ఈ మల్టీబ్యాగర్‌ బిజినెస్‌ ఐడియా! రజనీగంధ పుష్ఫాలు అదేనండి మన లిల్లీ పూల సాగుతో తక్కువ పెట్టబడితోనే లక్షల్లో లాభం పొందొచ్చు.


మంచి డిమాండ్‌!


లిల్లీ పూలు లేదా రజనీగంధ పుష్ఫాలు ఆహ్లాదకరమైన సువాసనలు వెదజల్లుతాయి. తెల్లని రంగుతో ఆకట్టుకుంటాయి. వీటి పరిమళం అద్భుతంగా ఉంటుంది. ఈ పువ్వులు రెండు రోజుల వరకు తాజాగా ఉండి పరిమళం వెదజల్లడం వల్ల మార్కెట్లో ఎక్కువ డిమాండ్‌ ఉంది. బొకేలు, వేడుకల్లో ఎక్కువగా వీటిని అలంకరిస్తుంటారు. పైగా సుగంధ తైలాలు తయారు చేసేందుకు ఉయోగిస్తారు.


ఎక్కడ సాగు చేస్తున్నారు?


ఈ కాలంలో చాలామంది సంప్రదాయ వ్యవసాయాన్ని మానేసి వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపిస్తున్నారు. తక్కువ పెట్టుబడి, ఎక్కువ ఖర్చులు అవసరం లేని లిల్లీపూల సాగువైపు మళ్లుతున్నారు. పశ్చిమబంగాల్‌, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ఈ తోటల సాగు ఎక్కువగా ఉంది. దేశంలో 20వేల హెక్టార్ల వరకు రజనీగంధను సాగు చేస్తున్నారు. మన దేశంలోనే కాకుండా ఫ్రాన్స్‌, ఇటలీ, దక్షిణాఫ్రికా, అమెరికా వంటి దేశాల్లో పండిస్తున్నారు. మొట్టమొదట దీనిని మెక్సికోలో కనుగొన్నారు.


ఇలా సిద్ధం చేసుకోవాలి?


ఇంగ్లిష్‌లో లిల్లీ పూలను ట్యూబర్‌రోజ్‌ అంటారు. ఈ పూల మొక్కల సాగుకోసం మొదట పొలాన్ని సిద్ధం చేసుకోవాలి. ఎకరాకు 6-8 ట్రాక్టర్ల వరకు జీవఎరువు లేదా పేడను కంపోస్ట్‌ చేసుకోవాలి. డీఏపీ వంటి ఎరువులను వినియోగించొచ్చు. లిల్లీ దుంప జాతికి చెందిన మొక్క. ఒక ఎకరంలో దాదాపుగా 20వేల లిల్లీ దుంపలను నాటొచ్చు. ఎర్రనేలలు, ఇసుక నేలల్లో వీటి సాగు చేపట్టొచ్చు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయమూ పొందొచ్చు.


ఎకరాకు ఎంత లాభం?


లిల్లీ పూల సాగుతో మంచి లాభాలే ఉన్నాయి. ఒక ఎకరంలో ఒక లక్ష వరకు రజనీగంధ పుష్పాలు వస్తాయి. వీటిని దగ్గర్లోని పూల మార్కెట్లు, దేవాలయాలు, వెడ్డింగ్‌ హౌజెస్‌లో అమ్మొచ్చు. ఒక లిల్లీ పువ్వును రూ.1.5 నుంచి 6 వరకు విక్రయించొచ్చు. అంటే ఒక ఎకరాకు లక్షన్నర నుంచి ఆరు లక్షల రూపాయాల వరకు ఆదాయం వస్తుంది. ఖర్చుతో పోలిస్తే దిగుబడి శాతం ఎంతో ఎక్కువ. ఒక సారి దుంపలను నాటితే మూడు నెలల్లో మొగ్గలు వస్తాయి. రెండేళ్ల వరకు పువ్వులు పూస్తాయి.