Union Budget 2024: పిల్లల భవిష్యత్‌కు ఆర్థిక భద్రత కల్పించాలనుకునే తల్లిదండ్రుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రవేశ పెడుతోంది. చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, వాళ్ల కోసం దీర్ఘకాలిక పొదుపులు/ పెట్టుబడుల కోసం మరో కొత్త మార్గం అందుబాటులోకి వచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌, మంగళవారం (23 జులై 2024‌) నాడు ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్‌లో ఒక కొత్త పథకాన్ని ప్రకటించారు. 


ఎన్‌పీఎస్ వాత్సల్య
చిన్నారుల (మైనర్స్‌) కోసం నిర్మలమ్మ ప్రకటించిన కొత్త పథకం పేరు "ఎన్‌పీఎస్ వాత్సల్య". నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) కింద ఈ స్కీమ్‌ రన్‌ అవుతుంది. NPS వాత్సల్య కింద, తల్లిదండ్రలు తమ మైనర్ పిల్లల పేరు మీద NPS ఖాతాను ప్రారంభించొచ్చు, డబ్బు డిపాజిట్‌ చేయవచ్చు. NPSలో మైనర్స్‌ కోసం అకౌంట్‌ ఓపెన్‌ చేసే ఫెసిలిటీ ఇప్పటి వరకు లేదు. ఇప్పటి నుంచి, ఎన్‌పీఎస్ వాత్సల్య స్కీమ్‌ కింద, 18 ఏళ్ల లోపు వయస్సు ఉన్న పిల్లల కోసం వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు (Guardians) ఈ ఖాతా తీసుకోవచ్చు. ఆ పిల్లలకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత NPS వాత్సల్య పథకం సాధారణ NPS పథకంగా మారుతుంది.


ఎన్‌పీఎస్ వాత్సల్య నియమాలు
సాధారణ NPS పథకానికి వర్తించే నియమ, నిబంధనలే NPS వాత్సల్య పథకానికి కూడా వర్తిస్తాయి. గతంలో లేని విధంగా పిల్లల పేరిట అకౌంట్‌ ఓపెన్‌ చేసే అవకాశం కల్పించడమే ఇందులో కొత్త విషయం. 


సంపద సృష్టి - ఆదాయ పన్ను ఆదా
నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌లో దీర్ఘకాలం పాటు, క్రమశిక్షణతో మదుపు చేస్తే చక్రవడ్డీ ప్రయోజనంతో కలుపుకుని పెద్ద మొత్తంలో సంపద సృష్టించొచ్చు. పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (PPF) తరహాలోనే, లాంగ్‌టర్మ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్‌గా NPS బాగా పాపులర్‌ అయింది. 


NPSలో పెట్టే పెట్టుబడులకు ఆదాయ పన్ను ప్రయోజనాలు (Income tax benifits) కూడా అందుతాయి. ఈ అకౌంట్‌లో చేసిన కంట్రిబ్యూషన్‌పై ఆదాయ పన్ను సెక్షన్‌లోని 80C కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1.50 లక్షల వరకు మినహాయింపు పొందొచ్చు. ఇది కాకుండా, సెక్షన్ 80 CCD కింద మరో రూ. 50 వేల మినహాయింపును క్లెయిమ్‌ చేయవచ్చు. మొత్తంగా చూస్తే... NPSలో పెట్టుబడులకు, ఒక ఆర్థిక సంవత్సరంలో, రూ. 2 లక్షల వరకు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు లభిస్తుంది.


భారతదేశ ప్రజలందరికీ సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2004లో జాతీయ పింఛను విధానాన్ని (NPS) ప్రారంభించింది. PFRDA దీనిని నియంత్రిస్తుంది. NPSలో ఖాతా ప్రారంభించే సమయంలో... ఈక్విటీలు, కార్పొరేట్‌ బాండ్లు, గవర్నమెంట్‌ సెక్యూరిటీలు (G-Sec) వంటి ప్లాన్లలో ఒకదానిని చందదారు ఎంచుకోవచ్చు. 


NPSలో టైర్-1 & టైర్-2 అనే రెండు రకాల ఖాతాలు ఉన్నాయి. టైర్‌-1 అనేది ప్రైమరీ పెన్షన్‌ అకౌంట్‌. టైర్‌-1 కింద అకౌంట్‌ తీసుకుంటే, దీని నుంచి డబ్బు వెనక్కు తీసుకోవడానికి కొన్ని పరిమితులు ఉంటాయి. టైర్‌-2 కింద అకౌంట్‌ తీసుకోవాలా, వద్దా అన్నది చందాదారు ఇష్టం. టైర్‌-2 అకౌంట్‌ నుంచి డబ్బు విత్‌డ్రా చేయడానికి ఎలాంటి పరిమితులు ఉండవు. 


NPS సభ్యుడు రిటైర్‌ అయిన తర్వాత లేదా 60 ఏళ్ల వయసు నిండిన తర్వాత NPS డబ్బును వెనక్కు తీసుకోవచ్చు. అప్పటి వరకు అతని ఖాతాలో పోగైన మొత్తంలో గరిష్టంగా 60 శాతాన్ని ఏకమొత్తంగా విత్‌డ్రా చేయవచ్చు. మిగతా 40 శాతం డబ్బును యాన్యుటీ స్కీమ్‌లో మదుపు చేయాలి. యాన్యుటీ స్కీమ్‌లో పెట్టుబడిని 40 శాతానికి తగ్గకుండా ఎంతయినా పెంచుకోవచ్చు. ఈ స్కీమ్‌ల నుంచి నెలనెలా పింఛను తరహాలో డబ్బు వస్తుంది. తద్వారా, పదవీ విరమణ తర్వాత కూడా ఆర్థిక భరోసా లభిస్తుంది.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు - ఈ రోజు ధరలు ఇవి