Big Income Tax Relief For Middle Class: నరేంద్ర మోదీ నేతృత్వంలోని NDA ప్రభుత్వం వచ్చే నెలలో పూర్తి స్థాయి బడ్జెట్‌ సమర్పించనుంది. ఆర్థిక మంత్రి హోదాలో నిర్మల సీతారామన్‌ వరుసగా ఏడో బడ్జెట్‌ ప్రవేశపెట్టి రికార్డ్‌ సృష్టించనున్నారు. రానున్న బడ్జెట్‌లో మోదీ ప్రభుత్వం తమకు పన్ను మినహాయింపు ఇస్తుందని పన్ను చెల్లింపుదార్లు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్‌ 80C, సెక్షన్‌ 80D కింద మినహాయింపు పరిమితిని మేడమ్‌ సీతారామన్‌ పెంచుతారని నిపుణులు ఆశిస్తున్నారు.


కేంద్ర ప్రభుత్వం, చివరిసారి, 2014-15 కేంద్ర బడ్జెట్‌లో సెక్షన్ 80C మినహాయింపు పరిమితిని సవరించింది. ఈ సెక్షన్ కింద పన్ను ప్రయోజనాల థ్రెషోల్డ్‌ను రూ. 1 లక్ష నుంచి రూ. 1.5 లక్షలకు పెంచింది. మినహాయింపు ప్రయోజనాల పరంగా, మధ్య తరగతి పన్ను చెల్లింపుదార్లకు సెక్షన్‌ 80C అత్యంత కీలకం. ఈ సెక్షన్ కింద PPF, NPS సహా చిన్న మొత్తాల పొదుపు పథకాలు, జీవిత బీమా, ELSS, ULIP, హోమ్ లోన్ ప్రిన్సిపల్ రీపేమెంట్, ఇంకా చాలా పెట్టుబడులపై పన్ను ప్రయోజనాలను పొందుతారు.


సెక్షన్ 80C తగ్గింపు పరిమితి సరిపోదు
పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా సెక్షన్ 80C కింద ప్రస్తుతం ఉన్న రూ. 1.5 లక్షల తగ్గింపు పరిమితి ఏ మూలకూ సరిపోదు. ఆదాయ పన్ను చట్టంలోని చాప్టర్ VI-A పరిధిలోకి వచ్చే తగ్గింపులను పెంచాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో, రానున్న బడ్జెట్‌లో సెక్షన్ 80Cకి సంబంధించి కొన్ని పెద్ద మార్పులను ఆర్థిక మంత్రి ప్రకటిస్తారని పన్ను చెల్లింపుదారులు, పన్ను నిపుణులు భావిస్తున్నారు. 


మరింత స్పష్టమైన & సమర్థవంతమైన పన్ను వ్యవస్థ కోసం కూడా టాక్స్‌పేయర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పన్ను స్లాబ్‌లను తగ్గించడం, మినహాయింపులను క్రమబద్ధీకరించడం వంటి సంస్కరణలను నిర్మల సీతారామన్‌ బడ్జెట్‌ నుంచి కోరుకుంటున్నారు.


టాక్స్‌బడ్డీ.కామ్‌ వ్యవస్థాపకుడు సుజిత్ బంగర్‌ అంచనా ప్రకారం, “స్కూల్ ఫీజులపై పన్ను మినహాయింపును సెక్షన్ 80C నుంచి విడదీసే సూచనలు ఉన్నాయి. స్కూల్‌ ఫీజ్‌ల కోసం ప్రత్యేక మినహాయింపును ఫైనాన్స్‌ మినిస్టర్‌ అందించొచ్చు. ప్రత్యేక మినహాయింపుల్లో ట్యూషన్ ఫీజ్‌తో పాటు మరికొన్ని ఫీజ్‌లను కూడా చేర్చే అవకాశం ఉంది. దేశంలో ఆరోగ్య బీమాను ప్రోత్సహించడానికి, ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్‌ 80D కింద ఉన్న ప్రస్తుతం ఉన్న తగ్గింపును రూ. 25,000 నుంచి రూ. 75,000కి పెంచొచ్చు".


ప్రస్తుతం అమల్లో ఉన్న రెండు రకాల పన్ను విధానాల వల్ల టాక్స్‌పేయర్లు గందరగోళానికి గురవుతున్నారని, ఒకే పన్ను విధానాన్ని అమలు చేయడం మంచిదని సుజిత్ బంగర్‌ చెప్పుకొచ్చారు.


ప్రతి సంవత్సరం చాలా మంది వ్యక్తులకు ఫామ్-16 చాలా ఆలస్యంగా అందుతోంది. చాలా కంపెనీలు జులై చివరి నాటికి తమ ఉద్యోగులకు ఫామ్-16 జారీ చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రొఫెషనల్/ఫ్రీలాన్సింగ్ ఆదాయం ఉన్న వ్యక్తులు ఫామ్-16A పొందడంలో జాప్యం జరుగుతోంది. టీడీఎస్‌కు సంబంధించిన సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. తాజా డేటాతో సమానంగా ప్రి-ఫిల్డ్‌ డేటా అప్‌డేట్ కాని సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ కష్టాలను దృష్టిలో ఉంచుకుని, ఐటీఆర్ దాఖలు చేసే గడువు తేదీని ఒక నెల పాటు, అంటే ఆగస్టు 31 వరకు పొడిగించాలని టాక్స్‌పేయర్ల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి.


మరో ఆసక్తికర కథనం: స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి మార్పు!, ఈసారి పెద్ద నిర్ణయం ఉండొచ్చు