Standard Deduction Limit: దేశంలో మోదీ 3.0 ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, తొలి పూర్తి స్థాయి బడ్జెట్‌ తీసుకురావడానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వివిధ పరిశ్రమల ప్రతినిధులు, కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వ అధికార్లు, మేధావులతో బడ్జెట్‌ కూర్పుపై చర్చలు జరుపుతున్నారు. వారి అవసరాలు & అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. మేడమ్‌తో మాట్లాడిన వాళ్లంతా వివిధ విజ్ఞప్తులు, డిమాండ్లను ఆర్థిక మంత్రి టేబుల్‌పై ఉంచారు.


2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు, సీట్లు తగ్గాయి. కొన్ని విషయాల్లో ప్రజల్లో అసంతృప్తి పెరగడమే దీనికి కారణమని పోస్ట్‌ పోల్‌ సర్వేల్లో తేలింది. కాబట్టి, ఈసారి బడ్జెట్‌లో దేశ ప్రజలకు, ముఖ్యంగా సామాన్యులకు ఊరటనిచ్చేలా ఆర్థిక శాఖ కొన్ని చర్యలు తీసుకోవచ్చని సమాచారం. వేతన జీవులను దృష్టిలో పెట్టుకుని.. ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని రూ. 5 లక్షల వరకు పెంచడం, స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచడం వంటి చర్యలు ప్రకటనలు చేసే అవకాశం ఉంది.


కొత్త పన్ను విధానంలో మార్పులు - మధ్య తరగతికి ఉపశమనం
నేషనల్‌ మీడియా నివేదికల ప్రకారం, కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచే ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక శాఖ పరిశీలిస్తోంది. ఇదే జరిగితే మధ్య తరగతి ప్రజలకు చాలా ఊరట లభిస్తుంది. స్టాండర్డ్‌ డిడక్షన్‌ అంటే... మొత్తం ఆదాయంలో 'పన్ను మినహాయింపు' ఉన్న భాగం. స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచడం వల్ల జీతం పొందే వర్గానికి ఊరట లభిస్తుంది. ఆదాయ పన్ను పత్రాలు దాఖలు చేసే సమయంలో దీన్నుంచి ప్రయోజనం పొందొచ్చు. 


నేషనల్‌ మీడియా రిపోర్ట్స్‌ ప్రకారం, కేంద్ర ప్రభుత్వం కొత్త పన్ను విధానంలో మార్పులు మాత్రమే మార్పులు చేయవచ్చు. పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు.


ప్రస్తుతం ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000
గత రెండు దఫాల్లోనూ మధ్య తరగతి ప్రజల ఓట్ల నుంచి నరేంద్ర మోదీ ప్రభుత్వం లబ్ధి పొందింది. ఈసారి ఆ మద్దతు కొద్దిగా తగ్గింది. ఇది పార్టీ పెద్దల్లో కలవరం సృష్టించింది. మధ్య తరగతి ప్రజల మద్దతును మళ్లీ కూడగట్టేందుకు, ఈ బడ్జెట్‌లో ఆ వర్గాని ప్రయోజనాలు కల్పించేందుకు సెంట్రల్‌ గవర్నమెంట్‌ ప్రయత్నిస్తోంది. వైద్యం, విద్య, ఆదాయ పన్ను రంగాల్లో తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రత్యేక సాయం అందడం లేదని చాలా ఏళ్లుగా మధ్య తరగతి ప్రజలు ఆరోపిస్తున్నారు. విద్య, వైద్య ఖర్చులు, పన్నుల బరువు నుంచి ఊరట కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 


2023 బడ్జెట్‌లో, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కొత్త పన్ను విధానంలో రూ. 50,000 స్టాండర్డ్ డిడక్షన్‌ ప్రకటించారు. ఈ ఏడాది నుంచి కొత్త పన్ను విధానం డిఫాల్ట్‌గా మారింది. ఈ విధానంలో, ఇండివిడ్యువల్‌ టాక్స్‌ పేయర్‌ రూ. 7 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపులు పొందుతారు. జీతం తీసుకునే వ్యక్తులకు స్టాండర్డ్‌ డిడక్షన్ కూడా కలుస్తుంది.


క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌లో మార్పులు?
ప్రస్తుతం, ఏడాదికి రూ. 3 లక్షలు దాటి "పన్ను విధించదగిన ఆదాయం" ఉన్న వ్యక్తులు 5 శాతం ఆదాయ పన్ను చెల్లించాలి. ఆదాయ పరిమితిని పెంచడం వల్ల చాలామంది వ్యక్తులు పన్ను పరిధి వెలుపలకు వస్తారు. ఫలితంగా వారి చేతిలో డబ్బు మిగులుతుంది, ఖర్చు సామర్థ్యం పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే దీనివల్ల ప్రభుత్వ ఆదాయంలో స్వల్పంగా తగ్గుదల ఏర్పడుతుంది. నివేదిక ప్రకారం, ఈ బడ్జెట్‌లో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌లో ఎలాంటి మార్పులు ఉండవు.


మరో ఆసక్తికర కథనం: గోల్డ్ కొనే ముందే రేట్లు తెలుసుకోండి - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి